ఓటర్లను బూత్ వద్దకు తీసుకొచ్చేందుకు పార్టీల అభ్యర్థులు వాహనాలు సమకూర్చ కూడదంటున్నారు.
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి.
- ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్, లేదా election@sakshi.comM కు మెయిల్ చెయ్యండి.
ప్ర. ఓటర్లను బూత్ వద్దకు తీసుకొచ్చేందుకు పార్టీల అభ్యర్థులు వాహనాలు సమకూర్చ కూడదంటున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా బూత్ వద్దకు రాలేని ఓటర్ల కోసం ఎన్నికల సంఘమే వాహనాలు ఏర్పాటు చేయవచ్చు కదా?
- ఎల్.శ్రీనివాస నాయుడు, తిరుపతి
జ.ప్రస్తుతానికి ఇలాంటి సౌకర్యాలు కల్పించలేం.
ప్ర. రాజకీయ నాయకులు సేవా సంస్థల పేరుతో అంబులెన్సులు కలిగి ఉన్నారు. ఎన్నికల్లో అంబులెన్సుల్లో డబ్బు రవాణాకు అవకాశం ఉంది. అలా అని తనిఖీల పేరుతో వాటిని ఆపితే అందులో రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? - పి.సూర్యనరేంద్ర, పశ్చిమ గోదావరి జిల్లా
జ.రోగులకు అసౌకర్యమైనా అక్రమ డబ్బు రవాణాను అడ్డుకునేందుకు 104, 108తో సహా ప్రయివేటు అంబులెన్సులను తనిఖీ చేస్తాం.
ప్ర.తనిఖీల్లో పట్టుబడిన కోట్ల రూపాయల డబ్బును రెవెన్యూ లేదా ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అది అక్రమ డబ్బు అని తేలేవరకూ ఆ సొమ్ము ప్రభుత్వ ఖాతాలో చేరదు. అంతవరకు ఆ డబ్బు అలాగే ఉంచే కంటే ఎన్నికల సంఘమే అకౌంట్ ఏర్పాటుచేసి అందులో ఉంచితే బాగుంటుంది కదా? వాటిపై వచ్చే వడ్డీని ఓటర్లను చైతన్యపరిచే కార్యకలాపాలకు వినియోగించవచ్చు కదా?
- జి.శ్రీరామమూర్తి, మచిలీపట్నం
జ. మీ సూచనను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.