'చందమామ కథలు వినడానికి ప్రజలు అమాయకులు కాదు'
ప.గో:నరేంద్ర మోడీ చెప్పే చందమామ కథలు వినడానికి ఇక్కడి ప్రజలు అమాయకులు కాదని వైఎస్సార్ సీపీ నేత షర్మిల విమర్శించారు. అసలు మోడీకి కుటుంబ విలువలు ఉన్నాయో లేదో తనకు తెలియదని, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రం ఆ విలువలు బాగా తెలుసని షర్మిల తెలిపారు. జిల్లాలోని కొయ్యలగూడెం ఎన్నికల ప్రచార సభలో హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల.. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ ఏవో చందమామ కథలు చెబుతున్నాడని, వాటిని వినడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఏమీ అమాయకులు కాదని షర్మిల విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగిన సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సీల్డ్ కవర్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారన్నారు. కాంగ్రెస్ అన్యాయంగా పరిపాలిస్తుంటే అధికార పక్షాన్ని నిలదీయకుండా బాబు కూడా కుమ్మక్కయ్యారన్నారు.
కరెంట్ ఛార్జీలు తగ్గించమన్న రైతన్నలపై చంద్రబాబు కాల్పులు జరిగినట్లు మోడీ తెలుసా?అని షర్మిల ప్రశ్నించారు. బాబు సైకో అన్న సంగతి, స్కామ్ ల సంగతి, వేల కోట్ల ఆస్తుల సంగతి అసలు మోడీకి తెలుసో?లేదో అని షర్మిల నిలదీశారు. స్కామ్ ల గురించి మోడీ మాట్లాడుతున్నారు.. అసలు చంద్రబాబు ఐఎంజీ అనే బోగస్ సంస్థకు తక్కువ ధరకే 850 ఎకరాల భూముల కట్టబెట్టారన్నారు. 2009 ఎన్నికలప్పుడు టీడీపీని విమర్శించిన పవన్.. 2014 లో ఆయనతోనే కలిసి పనిచేయడం దేనికి నిదర్శనమన్నారు. టీడీపీకి ప్రచారం చేపట్టిన పవన్ కు విశ్వసనీయతకు అర్థం తెలుసా?అని షర్మిల ప్రశ్నించారు. టీడీపీ-బీజేపీ కూటమికి ఎంతకు అమ్ముడుబోయావో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించుకుని తిరిగి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.