సార్వత్రిక ఎన్నికల పరిశీలకురాలు బసచేసిన గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో విలువైన వస్తువులు కాలిపోయాయి.
వికారాబాద్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పరిశీలకురాలు బసచేసిన గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో విలువైన వస్తువులు కాలిపోయాయి. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున అనంతగిరి టూరిజం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజక వర్గాల్లో ఎన్నికల పరిశీలనకు కేంద్రం నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి అమృతవల్లి వచ్చారు. ఆమె ఈనెల 9 నుంచి మే 16 వరకు ఉంటున్న నేపథ్యంలో అధికారులు వికారాబాద్‌లోని అనంతగిరి పర్యాటక కేంద్రంలో 205 నంబర్ వీఐపీ సూట్‌ను ఏర్పాటు చేశారు. అందులో కంప్యూటర్, ఎల్‌సీడీ టీవీ, ఫోన్, ఫర్నీచర్ ఉన్నాయి.
దీంతోపాటు ఓ గన్‌మన్, నలుగురు వీఆర్‌ఓలు, ఇద్దరు అటెండర్లు, ఓ డ్రైవర్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అమృతవల్లి వాకింగ్ కోసం బయటకు వస్తుండగా తన గదిలోంచి పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే గదిలో ఉన్న వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అనంతరం జిల్లా ఉప ఎన్నికల అధికారి(సబ్ కలెక్టర్) ఆమ్రపాలి, వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని విలేకరులకు తెలిపారు.
కరెంట్ ఓవర్ లోడ్‌తో సమస్య తలెత్తిందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ విషయమై ఎన్నికల పరిశీలకురాలు అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల అశ్రద్ధ, పర్యాటక కేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 24 గంటల పాటు ఇక్కడే ఉండాల్సిన మేనేజర్ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పరిశీలకురాలి గదిని మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చినట్లు సబ్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటామని సబ్ కలెక్టర్ చెప్పారు. అవసరమైతే 24 గంటల పాటు ఓ అబ్జర్వర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఘటన జరిగిందని ఆమె స్పష్టం చేశారు.