
ఇక సిక్కోలు సేవలోనే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజల మీద జగనన్నకు ఉన్న ఆపేక్ష.. జగనన్న మీద ప్రజల్లో నాటుకుపోయిన విశ్వాసమే తనను శ్రీకాకుళం ఎంపీగా గెలిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి శాంతి ధీమాగా చెబుతున్నారు. తాను సిక్కోలు ఆడబిడ్డనేనని.. ఇక నుంచి సిక్కోలులోనే ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నానన్నారు. ‘ఆరెంజ్-గ్రీన్ బేస్డ్ ఇండస్ట్రీ’ పాలసీతో జిల్లాను ప్రగతిబాట పట్టిస్తానని హామీ ఇచ్చారు. వెనుకబాటు తనానికి పర్యాయపదంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాను ప్రగతికి చిహ్నంగా మారుస్తానని హామీ ఇస్తూ ప్రజల తీర్పును కోరుతున్న రెడ్డి శాంతి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కార్యాచరణను ఇలా ప్రకటించారు..
పదవీ కాంక్షతో రాలేదు
పదవి, అధికారం పొందడానికిరాజకీయాల్లోకి రాలేదు. ఆ రెండూ మాకు కొత్త కాదు. మా నాన్నగారు పాలవలస రాజశేఖరం ఎంపీగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. అమ్మ ఇందుమతి కూడా ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేసింది. నా భర్త నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్ అధికారికగా ఢిల్లీలో ఉన్నత హోదా లో ఉన్నారు. పదవులు, అధికార హోదాకు సన్నిహితంగానే ఉన్నాను. కానీ నేను పుట్టి పెరిగిన జిల్లాకు నావంతు ఏదైనా చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. శ్రీకాకుళం అంటేనే వెనుకబడిన ప్రాంతమనే ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులుగా చేశారు. కానీ, నియోజకవర్గంలో అందరికీ ఇప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కల్పించలేకపోయారు. మహిళల గౌరవానికి సంబంధించిన కనీస అవసరం కూడా తీర్చలేదంటే బాధేస్తోంది. జిల్లా యువతకు ఉపాధి అవకాశాలే లేవు. ఏటా వేలమంది వలస వెళుతున్నారు. అపార సహజ వనరులు ఉండి కూడా నా సొంత జిల్లా ఇంతగా వెనుకబడి ఉందన్నదే నా బాధ. అందుకే నేను పుట్టిన గడ్డకు నా వంతు ఏదైనా చేద్దామన్న సంకల్పంతోనే శ్రీకాకుళం ఆడబిడ్డగా ప్రజల ముందుకు వచ్చాను.
జగనన్న నాయకత్వమే రాష్ట్ర ప్రగతికి చుక్కాని
విభజనతో రాష్ట్రం ఓ విపత్కర స్థితిలో చిక్కుకుంది. కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేసింది. రెండు నాల్కల విధానంతో టీడీపీ కాంగ్రెస్‌కు సహకరించింది. దాంతో రాజధాని ఏదో.. ఉపాధి అవకాశాలు ఎలాగో.. భవిత ఏమిటో తెలియని అయోమయస్థితిలో మనం పడిపోయాం. ఈ దుస్థితి నుంచి రాష్ట్ర ప్రజలను గట్టెక్కించాలంటే సాహసోపేత నాయకత్వం అవసరం. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా పనిచేయగల సత్తా ఉన్న విశ్వసనీయ నాయకుడు కావాలి. జగనన్నే ఆ నాయకుడని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గుర్తిం చారు.
పదవికి ఆశపడక, అధికారానికి బెదరక సాహసోపేతంగా ఓదార్పు యాత్ర చేశారు జగనన్న. విభజనను అడ్డుకోవడానికి జైలులో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తరువాతా చిత్తశుద్ధి తో పోరాడారు. ప్రస్తుతం అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. ఒక్క అమ్మ ఒడి పథకం చాలు జగనన్నకు ఈ రాష్ట్ర ప్రగతి పట్ల ఎంతటి దార్శనికత ఉందో తెలుసుకోవడానికి. విద్య ద్వారానే అటు ప్రజలు, ఇటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నది గుర్తించే జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అన్ని పథకాలు కూడా ప్రజా సంక్షేమా న్ని కాంక్షించేవే. అందుకే జగనన్నను సీఎం చేయడం.. ఎక్కువమంది ఎంపీలను అందించి జగనన్నకు కేంద్రంలో పట్టు కల్పించడం ద్వారా మన రాష్ట్ర బంగారు భవితను మనమే లిఖించుకుందామనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచాను.
ఆరెంజ్-గ్రీన్ ఆధారిత పరిశ్రమలతో విప్లవం
నన్ను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే శ్రీకాకుళం నియోజకవర్గ దశ, దిశ మార్చేం దుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాను. విభజనతో కేంద్రం ఉత్తరాంధ్రకు ప్రకటించిన 5 ఏళ్ల ప్రత్యేక ప్యాకేజీ ఏమాత్రం సరిపోదు. కనీసం 15 ఏళ్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అలాగే 15ఏళ్లు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తేగానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో నెలకొల్పలేం. అందుకోసం జగనన్న సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తాను. జిల్లాలోఅపార సహజ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకునేలా పర్యావరణ అనుకూల ఆరెంజ్-గ్రీన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుం టాను. తీరప్రాంత ఆధారిత, వ్యవసాయాధార పరిశ్రమలు నెలకొల్ప డం ద్వారా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చు. గ్రీన్ అక్వా, పాడి పరిశ్రమలను ప్రోత్సహించి వాటి ఉత్పత్తులకు జాతీ య,
అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు కృషి చేస్తాను. ఉదాహరణకు జిల్లాలో అవుపాలు లీటరు రూ.20 ఉంటే ఢిల్లీలో రూ.120 ఉంది. శ్రీకాకుళంతో పోలిస్తే ఢిల్లీలో ఆవు నెయ్యి ధర పదిరెట్లు ఎక్కువ. పాడి పరిశ్రమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మన రైతులకే గరిష్ట లబ్ధి చేకూరుతుంది. వీటన్నింటి ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల సమస్య పరిష్కారంపై ఎవరూ చిత్తశుద్ధతో దృష్టి సారించలేదు. ఆ వ్యాధి ఈ ప్రాంతంలో మహమ్మారిలా ప్రబలడానికి మూల కారణాన్ని సోధించేందుకు విదేశీ సంస్థలు, ఎన్‌జీవోల సహకారం తీసుకోవాలి. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులైన సిబ్బందిని నియమించాల్సి ఉంది. జిల్లాలో వెనుకబడిన మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని కోరిన వెంటనే జగనన్న హామీ ఇచ్చారు.
సిక్కోలు బిడ్డగానే ఉంటా
ప్రత్యర్థి పార్టీలు అసత్య ప్రచారాలను తెరపైకి తెస్తున్నాయి. నేను ఎన్నికైతే విజిటింగ్ ఎంపీగా ఉంటాననే అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నాయి. విజిటింగ్ ఎంపీగా కాదు.. పూర్తిస్థాయి సేవకురాలిగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను ఈ జిల్లా ఆడపడుచుని. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చదివాను. మా అమ్మనాన్న ఇక్కడే ఉన్నారు. భర్త తరఫు వారంతా కూడా ఇక్కడివారే. నా భర్త నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్ అధికారి అయినందున ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉన్నప్పటికీ నా మూలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. నా మనస్సు ఈ జిల్లాతో ముడివేసుకునే ఉంది. ఎంపీగా గెలిచిన తరువాత పూర్తి సమయం జిల్లాలోనే ఉంటాను. శ్రీకాకుళంలోనే కుటుంబంతో సహా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను. శ్రీకాకుళం ఆడబిడ్డగానే నన్ను ప్రజలు ఎంతగానో ఆదరి స్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాను విశ్వసిస్తున్నారు. ఇవే నన్ను గెలిపిస్తాయన్న నమ్మకం ఉంది.