పెరిగిన విభజన వేగం
నేడు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి ఉన్నతస్థాయి సమీక్షలు
రెండు రాష్ట్రాల చట్టసభలకు వేర్వేరు భవనాలు
కౌన్సిల్, అసెంబ్లీలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు
పోలీసు విభజన ప్రక్రియపై హోం శాఖ సమీక్ష
పోలీసు ఆఫీసులు 2 రాష్ట్రాలకూ వినియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా ఏప్రిల్ నెలాఖరునాటికల్లా పూర్తి చేయాలని గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అన్ని విభాగాల్లోనూ విభజన పనులు ఊపందుకున్నాయి. మేలో ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక విభజన ప్రక్రియకు రాజకీయపరమైన ఆటంకాలు, ఒత్తిళ్లు వస్తాయని గవర్నర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసింహన్, మహంతి బుధవారం వేర్వేరుగా ఉన్నతస్థాయి సమీక్షలను నిర్వహించనున్నారు.
- గవర్నర్ నరసింహన్ భౌతిక వసతులు, ఆస్తులు, ఆదాయ వనరుల సమీకరణ, సమగ్ర వ్యాపార, వాణిజ్య అంశాలు, సాగునీటి రంగాలపై సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
- విభజనకు సంబంధించి తొమ్మిది కీలకాంశాలపై సీఎస్ మహంతి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని డి-బ్లాక్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించనున్నారు.
- మార్చి 1వ తేదీవరకు ఉన్న ఫైళ్లు విభజన, రికార్డులు, డిస్పోజల్స్ విభజన, చరాస్తుల వివరాలు, ప్రభుత్వ వాహనాలు, అలాగే స్థిరాస్తుల వివరాలు, రాష్ట్ర, మల్టీ జోనల్ పోస్టులు, యూనిట్స్ గల ప్రాంతాలు, ప్రధానమైన చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు, కోర్టు కేసులు, కాంట్రాక్టుల వివరాలతో మిగతా అంశాలన్నింటిపై సీఎస్ సమీక్షించనున్నారు.
- ప్రస్తుతం సచివాలయంలోని ప్రతి శాఖలో టేబుల్స్, కుర్చీలు, టీవీలు, కంప్యూటర్లు, తదితర సామగ్రికి నంబర్లు వేస్తున్నారు. వీటిని ఇరు రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయనున్నారు.
చట్టసభలకు వేర్వేరు భవనాలు
విభజనానంతరం రెండు రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్ సమక్షంలో మంగళవారం అసెంబ్లీ, శాసనమండలికి భవనాల కేటాయింపుపై చర్చ జరిగింది.
- ప్రస్తుత అసెంబ్లీలోని కొత్త, పాత సమావేశపు హాళ్లను ఒక రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిళ్లకు కేటాయించాలని, పబ్లిక్‌గార్డెన్‌లోని కౌన్సిల్ భవనంతో పాటు మరో భవనాన్ని అసెంబ్లీ సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మరో రాష్ట్రానికి కేటాయించాలన్న సూచన వచ్చింది. దీనివల్ల ఒకే ప్రాంగణంలో రెండు సభలు ఉంటాయి కనుక మంత్రులకు వీలుగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు.
- ఇపుడున్న పాత, కొత్త ఎమ్మెల్యేల వసతి గృహాలను రెండు రాష్ట్రాలకు యథాతథంగా లేదంటే వేర్వేరుగా కేటాయించినా ఫర్వాలేదన్న అభిప్రాయపడ్డారు.
సలహాదారులుగా మహారాష్ట్ర రిటైర్డ్ డీజీపీ, రాజస్థాన్ రిటైర్డ్ సీఎస్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సలహాదారులుగా మహారాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారిని, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అయితే వారి పేర్లు మాత్రం తెలియలేదు.
పోలీసు ఆఫీసులన్నీ వన్ బై టూ!
రాష్ట్రాలుగా విడిపోయినా, సమన్వయంతో కలసి పనిచేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించుకుంది. మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు విభజన తీరు తెన్నుల్ని రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి టీపీ దాస్ సమీక్షించారు.
ఇరు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ, సీఐ సెల్ ఒకే ప్రాంగణంలో ఉండాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నన్ని రోజులూ ఇదే విధానం కొనసాగనుంది. ప్రస్తుతం ఈ విభాగాలు కొనసాగుతున్న చోటే కొన్ని అంతస్తులు/కొంత ప్రాంతాన్ని మరో రాష్ట్రానికి కేటాయించనున్నారు.
రాష్ట్ర స్థాయి విభాగాల వద్ద ఉన్న ప్రతి ఫైల్‌కూ మరో రెండు నకళ్లు సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాలకూ చెరోటి ఇచ్చినా మరోటి కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని టీపీ దాస్ ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ)లో పనిచేస్తున్న అన్నిస్థాయిల వారికీ ఆప్షన్లు ఇవ్వాలని, తర్వాత అవసరమైన పక్షంలో నిర్దేశించిన నిష్పత్తిలో పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో విభజన ప్రక్రియ ఆలస్యమౌతోందని పోలీసు అధికారులు హోం సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. విభజన సైతం కీలక ప్రాధాన్యం ఉన్న అంశం కావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ మే 15లోపు కసరత్తులన్నీ పూర్తి చేయాల్సిందేనని, అపాయింటెడ్ డే లోపు తుదిరూపు సంతరించుకోవడం, విభజన పూర్తి కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.