సాక్షి, గుంటూరు: జిల్లాలో టీడీపీ దౌర్జన్య కాండకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఈ నెల 7వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గెలుపుఖాయమని గ్రహించిన టీడీపీ నేతలు గ్రామాల్లో భయందోళనలు సృష్టించడం ద్వారా గెలవాలనే కుట్రలు పన్నుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రచారాల్లో పాల్గొంటే ఒప్పుకునేది లేదంటూ బడుగు, బలహీన వర్గాల ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారు. ఎస్సీ కాలనీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్‌లుగా కూర్చుంటే సాంఘిక బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
చివరకు గ్రామాల్లోకి ప్రచారాలకు సైతం రావద్దంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కాన్వాయ్‌లపై రాళ్ళ దాడులకు దిగుతున్నారు. కొన్నిచోట్లయితే ఓట్లు వేయడానికి వస్తే ఇబ్బందు లు పడతారంటూ టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఓటమి భయంతో గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం వంటి కుయుక్తులకు తెరలేపుతున్నారు. జిల్లాలో పలుచోట్ల టీడీపీ దౌర్జన్య కాండలకు కొన్ని ఉదాహరణలు...
మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో ఆదివారం ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై దాడికి దిగారు. అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ళురువ్వి తీవ్రంగా గాయపరిచారు.
ఇటీవల సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో ప్రచారానికి వెళ్ళిన అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళతో దాడికి దిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా లక్కరాజుగార్లపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడిచేయడంతో తలకు తీవ్రగాయమైంది.
రేపల్లె నియోజకవర్గం నగరం మండలం కోరంకివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నందుకు ఎస్సీ వర్గీయులపై సోమవారం దాడులుచేసి, సాంఘిక బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరికలు జారీచేశారు.
నరసరావుపేట మండలం కేసానుపల్లిలో వైఎ స్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు సోమవారం దాడులకు దిగడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన మాజీసర్పంచ్‌పై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
పొన్నూరు రూరల్ మండలం చింతలపూడిలో ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రావి వెంకటరమణ సతీమణి కల్పనాకిరణ్‌ను అడ్డుకుని భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై ఆమె అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ దౌర్జన్య కాండ...
Published Mon, May 5 2014 11:53 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement