సీమలో జోరుగా టీడీపీ ప్రలోభాల పర్వం
రాయలసీమలో కనీసం ఖాతా తెరుస్తామన్న నమ్మకం కూడా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రలోభాలకు తెరతీశారు. పోలింగ్కు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో రెచ్చిపోయి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒక్కో డ్వాక్రా సంఘానికి పయ్యావుల కేశవ్ అనుచరులు రూ.10వేలు ఇస్తున్నారు.
అలాగే, బ్రహ్మసముద్రంలో మద్యం పంచుతున్న టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, వంద మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రలోభాలు మొదలుపెట్టింది. అమ్మవారిపల్లిలో 643 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇక కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లిలో టీడీపీ వర్గీయుల నుంచి 275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పరిటాల వర్గీయులు పరారయ్యారు.
కర్నూలు 26వ వార్డులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు పెడుతున్నా, పోలీసులు మాత్రం తమకు ఏమీ తెలియనట్లు పట్టించుకోకుండా ఊరుకున్నారు. అలాగే, ఎమ్మిగనూరు ఎస్బీహెచ్ కాలనీలో టీడీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి చెందిన రూ. 32 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.