‘సైకిల్’కు ఎదురుగాలి | tdp have rebels that seemingly | Sakshi
Sakshi News home page

‘సైకిల్’కు ఎదురుగాలి

Published Tue, May 6 2014 12:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

‘సైకిల్’కు  ఎదురుగాలి - Sakshi

ప్రతి నిత్యం పొద్దు తూర్పున పొడుస్తుందన్నది ఎంత నిశ్చిత సత్యమో.. ప్రతి ఎన్నికల్లో ‘తూర్పు’ గోదావరి జిల్లా ఓటర్లు ఎటు మొగ్గితే.. యావత్ రాష్ట్రం అటే మొగ్గుతుందన్నదీ అంతే తథ్యం అని రాజకీయ పార్టీల ప్రగాఢ నమ్మకం. కొన్ని దశాబ్దాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నమ్మకం మరింత వేళ్లూనుకునేలా చేయడం విశేషం.
 
 రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చారిత్రాత్మక ఎన్నికల్లోనూ ఈ ఆనవాయితీ పునరావృతం కానుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో భంగపడ్డ తెలుగుదేశం మళ్లీ జిల్లాలో చతికిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. జననేత జగన్ సారథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయోత్సాహంతో దూసుకుపోతున్నారు. జిల్లా అంతటా ‘ఫ్యాన్’ గాలి జోరుగా వీస్తోంది.

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ చైతన్యానికి నెలవైన జిల్లాలో ‘సైకిల్’కు ఎదురుగాలిలో కదల్లేకపోతోంది. అసంతృప్తులు, రెబెల్స్ బెడద, బీజేపీతో పొత్తు, వలస నేతలకు టిక్కెట్లు కట్టబెట్టడంతో పాటు కేడర్ సహాయ నిరాకరణ తెలుగుదేశం పార్టీని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయి. అదే సమయంలో సమర్థులైన అభ్యర్థులు, సీట్ల కేటాయింపులో సామాజిక సమతూకం వైఎస్సార్ కాంగ్రెస్‌కు సానుకూలమవుతున్నాయి.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం చోటు చేసుకున్న సంక్లిష్ట పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ సామెతగా టీడీపీ.. రెండు ప్రధాన సామాజికవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్ సీపీని చూసి తానూ అలాగే చేయాలనుకుని బోర్లా పడింది. ఆ క్రమంలో తెచ్చిపెట్టుకున్న వలస నేతలతో ఆ పార్టీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. జిల్లాలో ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలను కాపులకు వైఎస్సార్ సీపీ కేటాయించింది. తర్వాత బలమైన బీసీలకు 4 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది.
 
కాగా టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చేసిన పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ముళ్లబాటనే ఎదుర్కొంటోంది. పిఠాపురంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు టిక్కెట్టు ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటతప్పి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్ వర్మను తప్పించి పోతుల విశ్వంకు కేటాయించారు. దీంతో వర్మ రెబల్‌గా బరిలోకి దిగారు. ఈ పరిణామాలతో అక్కడ టీడీపీ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక పెద్దాపురం టీడీపీ టిక్కెట్టు కోసం ఆరుగురు పోటీ పడగా వారిని కాదని స్థానికేతరుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు ఇవ్వడంతో పార్టీ కేడర్ వ్యతిరేకంగా పనిచేస్తుండగా అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోట సుబ్బారావునాయుడి విజయావకాశాలు మెరుగు పడ్డాయి.
 
కృష్ణుడిని వెన్నాడుతున్న గత నిర్వాకాలు
ఒకప్పడు టీడీపీకి కంచుకోటగా ఉన్న తునిలో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికైన యనమల రామకృష్ణుడికి వరసకు సోదరుడైన యనమల కృష్ణుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి. రామకృష్ణుడు వివిధ హోదాల్లో ఉన్నప్పుడు షాడో ఎమ్మెల్యేగా కృష్ణుడు చేసిన నిర్వాకాలు, అధికార దుర్వినియోగం, వేధింపులతో విసుగెత్తిన పలు వర్గాలు టీడీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతకు తోడు మృదుస్వభావి, యువకుడు కావడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా వైపు మొగ్గు కనిపిస్తోంది.
 
ప్రత్తిపాడులో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఒకే కుటుంబానికి చెందిన పర్వత చిట్టిబాబు, పర్వత ప్రసాద్ పోటీలో ఉన్నారు. దీంతో ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి అవకాశాలు సన్నగిల్లుతాయంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి, ఏడాదిన్నరగా గడప, గడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైన ఆ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు ప్రజాదరణ లభిస్తోంది. జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ.. గత ఎన్నికల్లో ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు మరోసారి తలపడుతున్నారు. సమర్థుడనే పేరున్న నెహ్రూ ముందు చంటిబాబు ఎదురీదుతున్నారనే చెప్పాలి.
 
 కాకినాడలో బలహీనపడ్డ టీడీపీ
 కాకినాడ సిటీలో టీడీపీ నుంచి వనమాడి కొండబాబు బరిలో నిలవగా, ఆ పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు శశిధర్ జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బరిలోకి దిగడంతో టీడీపీ బలం చీలిపోయింది. అన్ని వర్గాల పట్టు కలిగిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి సానుకూలపవనాలు వీస్తున్నాయి. కాకినాడ రూరల్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి కీలక నేతలు తరలిరావడం వైఎస్సార్ సీపీ అభ్యర్థి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు పరిస్థితి మెరుగుపడింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి, స్వతం త్ర అభ్యర్థి కన్నబాబు రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని చెప్పవచ్చు.
 
వలస నేతలైన మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులుకు సీట్లు కట్టబెట్టడంతో కొత్తపేట, రామచంద్రపురంలలో టీడీపీ శ్రేణుల నుంచి పెల్లుబికిన అసంతృప్తితో ఆ పార్టీ ఏటికి ఎదురీదుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు గత ఉప ఎన్నికల్లో మాదిరిగా అధికారం లేకపోవడం, వివిధ వర్గాల వ్యతిరేకతతో బోస్‌కు సానుకూలత స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తపేటలో సానుభూతి, పార్టీ వేవ్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డికి కలిసివస్తోంది.
 
మండపేటలో ఒక బలమైన సామాజికవర్గం నుంచి మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడిని వైఎస్సార్ సీపీ బరిలోకి దింపడంతోటీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. గిరజాల ఎంపీగా పనిచేసినప్పుడు మండపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, పార్టీకి ఉన్న ఆదరణ కలిసిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement