మదనపల్లె మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడిన సంఘటనలో నలుగురు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: మదనపల్లె మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడిన సంఘటనలో నలుగురు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ విషయాన్ని రెండో పట్టణ సీఐ గంగయ్య తెలిపారు. సీఐ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి టీడీపీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి బండి నాగరాజు వర్గం స్థానిక మాయాబజార్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్టు లక్ష్మీనారాయణకు సమాచారం అందింది. దీంతో ఆయన తన ముఖ్య అనుచరుడు సుబ్రమణ్యంను వెంటబెట్టుకుని కారులో మాయాబజార్‌కు వెళ్లారు.
ఇది గమనించిన టీడీపీ నాయకుడు మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీరామ్‌చినబాబు, యోగేశ్వర్‌బాబు అలియాస్ పెదబాబు, పెన్నార్ వెంకటేష్, శంకర్ మరికొంత మంది కారును అడ్డుకుని 34వ వార్డులో తిరిగావంటే అంతు చూస్తామని బెదిరించారు. ఎదురు తిరిగిన లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యంపై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో నిందితులు శ్రీరామ్‌చినబాబు, పెదబాబు, వెంకటేశ్, శంకర్ మరికొంతమందిపై సెక్షన్ 323, 324, 506, 188, 341 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. శనివారం సాయంత్రం నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు తెలిపారు.