పులివెందుల రూరల్/అర్బన్, న్యూస్‌లైన్ : పులివెందులలోని క్రిష్టియన్‌లైన్‌లో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో టీడీపీకి చెందిన నాయకుడు తూగుట్ల మధుసూదన్‌రెడ్డి తన వర్గీయులను పరామర్శించడానికి వెళ్లి గన్‌మెన్ తుపాకీ చూపిస్తూ ఆసుపత్రిలో హల్‌చల్ సృష్టిస్తూ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటనపై ఆసుపత్రిలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఆ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీకి చెందిన నాయకులనుంచి పోలీసులకు భారీస్థాయిలో ముడుపులు అందడంతోనే అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమయ్యారని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు.
ఈ సంఘటనకు సంబంధించి పులివెందుల పోలీసులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుతోపాటు పోలీసులపై ప్రయివేట్ కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని క్రిష్టియన్‌లైన్‌లో రవి నివాసముంటున్నారు. సమీపంలో టీడీపీకి చెందిన కార్యకర్త యాకోబ్ కూడా నివాసముంటున్నారు. గురువారం ఉదయం డబ్బుల విషయమై ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, మద్యం సీసాలు, సోడా సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన రవి, పద్మావతి, సుధీర్, డేనియల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే టీడీపీకి చెందిన యాకోబ్, మాణిక్యం, ఫృద్వీరాజ్, చిన్నలకు గాయాలయ్యాయి. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నేత మధుసూదన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. తన వర్గీయులను పరామర్శించి తన గన్‌మెన్ చేతిలోని తుపాకీని లాక్కొని వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆ పార్టీ నేతలు, మాజీ మున్సిపల్ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్ రెడ్డి, ఇసీ గంగిరెడ్డిలు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ఆర్ సీపీ నేతలను చూసి న టీడీపీ నాయకుడు తూగుట్ల మధు తీవ్ర ఆగ్రహంతో హల్‌చల్ చేశారు. ఒక దశలో తగుల్దామా.. తేల్చుకుందా మా అని వైఎస్‌ఆర్ సీపీ నాయకుల పట్ల మధు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
38 మందిపై కేసు నమోదు :
క్రిష్టియన్‌లైన్‌లో జరిగిన ఘర్షణలో మొత్తం ఇరువర్గాలకు చెందిన 38 మందిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ భాస్కర్ తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీకి చెందిన రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపైన.. టీడీపీకి చెందిన మాణిక్యం భార్య నిరీక్షమ్మ ఫిర్యాదు మేరకు 16మందిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.
పోలీసుల ఏకపక్షం
ఆస్పత్రిలో రెండు వర్గాలకు సంబంధించిన బాధితులు చికిత్స పొందిన అనంతరం వారిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి సమస్యను సరిదిద్దాల్సిన పులివెందుల పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, వైఎస్సార్ సీపీ కార్యకర్తల పట్ల టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం చూస్తే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. పట్టణంలో బుధ, గురువారాలలో క్రిష్టియన్‌లైన్‌లో జరిగిన సంఘటనలపై పులివెందుల పోలీసులను టీడీపీ నాయకులు ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమేరకే ఈ సంఘటనలో టీడీపీ కార్యకర్తల తప్పు ఉందని తెలిసినా.. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలదే తప్పు ఉందని సృష్టించే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.
టీడీపీ నేతల దౌర్జన్యం
Published Fri, Apr 25 2014 2:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement