'నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతే'
కళ్యాణదుర్గం : రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరనీయుడై ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల ఉన్నత చదువుల కోసం పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
వైఎస్ అధికారంలోకి వచ్చాక తాము ఉన్నత చదువులు అభ్యసిస్తున్నామని గర్వంగా చెప్పారన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మారలేదన్నారు. 'ఎన్నికల తర్వాత తాను ఉండడు... తన పార్టీ ఉండదనే విషయం చంద్రబాబుకు తెలుసునని' అయినా అధికారం కోసం ఆయన ఏ అబద్ధం అయినా ఆడతారని వైఎస్ జగన్ అన్నారు.
మనం వేసే ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని జగన్ పిలుపునిచ్చారు. ఏ నేత అయితే పేదవాడి గుండెచప్పుడు వింటారో వారికే మీ మద్దతు పలకండని ఆయన కోరారు. మళ్లీ అధికారం కోసం చంద్రబాబు పట్టపగలే అబద్ధాలు ఆడుతున్నారని జగన్ మండిపడ్డారు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్నారని చూస్తున్నారన్నారు. అమ్మకు అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అని వ్యాఖ్యానించారు.
పొరపాటున నిజం చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలు అవుతుందని శాపం ఉందని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడులా తాను అబద్ధాలు ఆడనని, విశ్వసనీయత అనే దానికి అర్థం కూడా బాబుకు తెలియదన్నారు. తనకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని జగన్ అన్నారు. ఇక ప్రమాదానికి గురై డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెబితే ఉపాధి లేని ఆ పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద మూడు వేలు ఇస్తామని జగన్ తెలిపారు. సొంత తమ్ముడి ఉద్యోంగం కోసం ఎలా కష్టపడతానో అలాగే మీ ఉద్యోగాలకు కష్టపడతానని జగన్ పేర్కొన్నారు. ఇక రాజన్న తనయుడిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వృద్ధులు సైతం తరలి వచ్చారు.