తుంగతుర్తి, న్యూస్‌లైన్: విశ్వాసానికి, విశ్వాసఘాతానికి.. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.
60 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. 1969, 2009 ఉద్యమాల్లో 1200మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. వారి త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌పార్టీ పతనమై పోతుం దని తెలిసి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకు ఫలితంగా అత్యధికమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా ఒక దేవతలాంటిదన్నారు. తాము రౌడీలకు భయపడేది లేదన్నారు. డబ్బుతో మంచితనాన్ని కొనలేమని అన్నారు. తెలంగాణ రాకుండా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎన్నో కుట్రలు చేశారన్నారు.తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం అవుతామని చెప్పిన కేసీఆర్ నేడు మాట మార్చడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ అన్నంపెట్టిన తల్లికి సున్నంపెట్టాడని విమర్శించారు.
30 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులకు రూ.1000, వికలాంగులకు, వితంతువులకు రూ.1500 ఇస్తామన్నారు. ఎస్సారెస్పీ కాలువలను పూర్తిచేసి రైతులకు నీరందిస్తామన్నారు. పాలేరు జలాలను ప్రతి గ్రామానికీ అందేలా కృషి చేస్తామన్నారు.
పాలేరు జలాలు తేవడానికి రూ.98కోట్లతో పనులు ప్రారంభించామని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్, తండు శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, ఎర్ర యాదగిరి, రఘునందన్‌రెడ్డి, దొనకొండ రమేష్, లక్ష్మీనర్సింహారెడ్డి, బాలరాజు, కైలాస్, కృష్ణమూర్తి, వేణుగోపాల్‌రెడ్డి, తోట సోమయ్య, చినపాక యాదగిరి, కోడి శ్రీను, విజయకుమార్‌రెడ్డి, కడియం పరమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ధర్మం.. అధర్మం మధ్య పోరాటం
Published Wed, Apr 16 2014 4:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement