నేడో రేపో సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు సాగుతోంది. శుక్రవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు సమావేశమవుతున్నాయి. అనంతరం శుక్ర లేదా శనివారం తొలి జాబితా ప్రకటించనున్నారు. గురువారం కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో ఏపీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను 145 నియోజకవర్గాలపై చర్చ పూర్తయ్యింది. ఒకే పేరు వచ్చిన స్థానాలు 70కి పైగా ఉన్నాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు పేర్లున్నాయి. వీటిపై కసరత్తు జరుగుతోంది. 20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత రాలేదు.
ప్రస్తుతం స్పష్టత వచ్చిన నియోజకవర్గాలకు శుక్ర, శనివారాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి. లోక్‌సభ స్థానాలకు కూడా కొత్త వారిపైనే కాంగ్రెస్ ఆశలుపెట్టుకుంది. సిట్టింగ్ ఎంపీల్లో పలువురు పార్టీని వీడి వెళ్లడంతో అక్కడ కొత్తవారిని వెదుకుతోంది. ఈ నేపథ్యంలో యువత, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిచ్చి ప్రయోగం చేయాలని నిర్ణయించారు. పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఈసారి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నందున ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చన్న అభిప్రాయంతో నేతలున్నారు. పోటీకి ముందుకు వచ్చే మహిళలందరికీ అవకాశం కల్పించనున్నారు. పీసీసీ రూపొందించిన జాబితాలను ఏఐసీసీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు పరిశీలించి, అవసరమైతే మార్పులు చేయవచ్చని పార్టీవర్గాలు తెలిపాయి.
తొలి జాబితాలో 100-120 స్థానాలకు వెల్లడి: రఘువీరా
అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జాబితాలు పరిశీలించాక శుక్ర, శనివారాల్లో అధికారికంగా తొలి విడత జాబితా ప్రకటిస్తామన్నారు. ఇందులో 100 నుంచి 120 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు.