పోలింగ్ సమయం :ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఆదివారం తొలి విడత పోలింగ్ జరగనుంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ, 705 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలివిడతగా ములుగు, నర్సంపేట రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 మండలాల్లో 423 లొకేషన్లలో 777 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 మండలాలను 80 జోన్లు... 101రూట్లుగా విభజించారు.
856 పోలింగ్ ఆఫీసర్లు, 3419 సహాయ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. 387 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ (నెట్ ద్వారా ప్రసారం) చేస్తుండగా.. ఇంటర్నెట్ అందుబాటులో ఉండే పోలింగ్ లొకేషన్లలో 253 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. మొదటి విడతలో 86 సాధారణ, 148 సున్నిత, 89 అత్యంత సున్నిత, 77 తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలు జరిగే మండలాలు
ములుగు డివిజన్‌లోని భూపాలపల్లి, చిట్యాల, ఏటూరునాగారం, గణపురం (ములుగు), గోవిందరావుపేట, మంగపేట, మొగుళ్లపల్లి, ములుగు, పరకాల, రేగొండ, తాడ్వాయి, శాయంపేట, వెంకటాపురంతోపాటు నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోలింగ్ జరగనుంది. 255 గ్రామ పంచాయతీలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగిం చుకోనున్నారు. ములుగు డివిజన్‌లోని గోవిందరావుపేట మండలం ఎస్సీ మహిళకు రిజర్‌వ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు చైర్‌పర్సన్ రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
ఉదయం 7 నుంచి పోలింగ్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు... ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మొత్తం 1,749 బ్యాలట్ బాక్స్‌లను వినియోగించనున్నారు. నిర్ధేశించిన సమయం ముగిసినప్పటి1కీ... పోలింగ్ కేంద్రాల అవరణలో ఉన్న ఓటర్లు ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశముంటుందని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
బ్యాలెట్ బాక్స్‌ల భద్రం
ములుగు డివిజన్ పరిధిలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను ములుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... పరకాల, భూపాలపల్లి, శాయంపేట, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం (ములుగు ) మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను పరకాలలోని గణపతి డిగ్రీ కాలేజీలో భద్రపరచనున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ ఆంజనేయులు తెలిపారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రపరుస్తామన్నారు.
ఎన్నికల సిబ్బందికి నిధుల కేటాయింపు
స్థానిక ఎన్నికల్లో శిక్షణతోపాటు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు అలవెన్స్‌లు చెల్లించేందుకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు నిధులను విడుదల చేసినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు వారు శిక్షణ పొందిన మండలాల్లోని ఎంపీడీఓలు అలవెన్సులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. పీఓలకు ఒక్కొక్కరికి రోజుకు రూ.350 చొప్పున రెండు రోజులకు రూ.700... ఏపీఓలకు రూ.500, ఓపీఓలకు రూ.500 చెల్లించనున్నట్లు వివరించారు.
పోలింగ్ రోజున పోలింగ్ అధికారులకు భోజన వసతి కల్పించని పక్షంలో ప్రతి ఉద్యోగికి రూ. వంద చెల్లించాలని ఎంపీడీఓలకు సూచించారు. మైక్రో అబ్జర్వర్లకు రూ.వెయ్యి, జోనల్ అధికారులకు రూ. 1500 చెల్లించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ చేస్తున్న విద్యార్థులు ఒక్కొక్కరికి రెమ్యూనరేషన్ కింద రూ.500తోపాటు భోజనం కింద రూ.150, వీడియో గ్రాఫర్లకు రూ.900లు చెల్లించాలన్నారు.