సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటరు ఇచ్చిన విలక్షణ తీర్పుతో ఈ రెండు పార్టీలు చెరో 21 జెడ్పీటీసీ స్థానాలను నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచిన విషయం తెలిసిందే. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలుండగా.. పాలకవర్గం ఎంపిక కోసం కనీసం 24 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ కేవలం 4 స్థానాలను దక్కించుకున్నప్పటికీ.. జెడ్పీ చైర్మన్ ఎన్నికలో ఆ పార్టీ సభ్యుల మద్దతు కీలకంగా మారింది.
ఆ పార్టీ గెలిచిన 4 స్థానా ల్లో మూడు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉండడంతో .. జెడ్పీ చైర్మన్ ఎన్నికలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి నిర్ణయం కీలకంగా మారింది. ఈ విషయంలో వంటేరు సూచనలనే టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపికలో ప్రతాప్‌రెడ్డి ‘కింగ్ మేకర్’గా మారారు. జెడ్పీ పాలకవర్గం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ‘సమ అవకాశాలు’ కలిగి ఉండడంతో.. ఇరు పార్టీల ముఖ్య నేతలు రంగంలో దిగి నేరుగా ప్రతాప్‌రెడ్డితోనే సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ప్రతాప్ రెడ్డితో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం.
కొందరు టీఆర్‌ఎస్ నేతలను సైతం ప్రతాప్‌రెడ్డిని సంప్రదించి మద్దతు కోరినట్లు తెలిసింది. గజ్వేల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే నిర్ణయాన్ని తెలుపుతానని ఆయన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన మూడు ప్రధాన డిమాండ్‌లను ఇరు పార్టీల నేతల ముందుంచినట్లు తెలిసింది.
గజ్వేల్ నగర పంచాయతీలో ఎన్నికల్లో టీడీపీ 10 వార్డులు గెలిస్తే, టీఆర్‌ఎస్ 9 వార్డుల్లో, కాంగ్రెస్ ఒక వార్డులో పాగా వేసింది. చైర్మన్ స్థానాన్ని దక్కించుకోడానికి టీడీపీకి ఇంకొక సభ్యుడి మద్దతు అవసరం కాగా.. ఇక్కడ మద్దతు ఇచ్చిన పార్టీకి జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సహకరిస్తామని ప్రతాప్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలున్నాయి. జగదేవ్‌పూర్, కొండపాక మండలాధ్యక్షుడి పీఠాలను దక్కించుకోడానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే.. తూప్రాన్, వర్గల్ మండల అధ్యక్షుడి పీఠాలను దక్కించుకోడానికి అవసరమైన ఎంపీటీసీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ములుగు, గ జ్వేల్ మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ రెండు మండలాల ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకునేలా సహకరించాలని ప్రతాప్ రెడ్డి కోరినట్లు సమాచారం. జెడ్పీ వైఎస్ చైర్మన్ కుర్చీని టీడీపీకి కట్టబెట్టాలి.
ఈ డిమాండ్లను నెరవేర్చే పార్టీకి జెడ్పీ చైర్మన్ ఎంపిక విషయంలో సహకరిస్తామని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ వర్గాలు మాత్రం డిమాండ్ల మాట వాస్తవమేనని ధ్రువీకరిస్తున్నాయి.