జోగిపేట, న్యూస్‌లైన్: నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే విషయంలో తెలుగు తమ్ముళ్లకు టీఆర్‌ఎస్ నాయకులు షాక్ ఇచ్చారు. అందోల్ జెడ్పీటీసీ స్థానాన్ని ఆశించి తెలుగుదేశం మండల అధ్యక్షుడు జి.లింగాగౌడ్ టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. పుల్కల్ జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి తన భార్య, కోడలి చేత టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ వేయించారు. అయితే ఈ స్థానాల్లో ఎంతో కాలంగా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న నాయకులు పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేశారు.
లింగాగౌడ్, నర్సింహారెడ్డి నామినేషన్లను దాఖలు చేసిన తర్వాత మాజీ ఎంపీ టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పి.మాణిక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అందోల్ జెడ్పీటీసీ స్థానంలో లింగాగౌడ్ సతీమణితో పాటు టీఆర్‌ఎస్వీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మండల అధ్యక్షుడు పి.శివశేఖర్ పార్టీకి సేవ చేస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికే టికెట్ దక్కాలని పట్టుబట్టారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నేతలతో వాగ్వావాదం జరిగింది.
చివరకు లింగాగౌడ్‌కు కాకుండా శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులకు బీ ఫారం దక్కింది. జరిగిన పరిణామాలకు లింగాగౌడ్ దిగ్భ్రాంతి చెందారు. టికెట్ ఇస్తామని పార్టీలో చే ర్పించుకొని ఇలా చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పుల్కల్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించిన టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డికి కాకుండా మండలానికి చెందిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేశప్పకు బీ ఫారం లభించింది. దీంతో ఇరువురికి పెద్దషాక్ తలిగింది. వీరిద్దరు రెండు మండలాల్లో కీలకవ్యక్తులే కాకుండా గెలవగలిగే సత్తా ఉన్న నాయకులు. పార్టీ నేతలు వారిని కనీసం నామినేషన్లను ఉపసంహరించుకోవాలని అడగలేదని, ఉద్దేశపూర్వకంగానే తమను దెబ్బ కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
టీఆర్‌ఎస్‌లోకి వెళ్లమన్నదీ మా నాయకుడే!
‘మీకు టీఆర్‌ఎస్ తరఫున టికెట్లు ఇవ్వడానికి నిర్ణయం జరిగిపోయింది’ అని తమ నాయకుడు చెబితేనే టీఆర్‌ఎస్‌లో చేరామని లింగాగౌడ్ పేర్కొన్నారు. పార్టీలో చేరమన్న తమ నాయకుడి పేరును అవసరమైనప్పుడు బయటపెడతామని, తాను కూడా టీఆర్‌ఎస్‌లో చేరతానని, టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులను కలవండని అన్ని విషయాలు తాను మాట్లాడానని చెప్పి ఇప్పుడు తమపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని మండలంలోని దేశం పార్టీ శ్రేణులంతా తనపై వత్తిడి తెస్తున్నారన్నారు. బుధవారం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానని లింగాగౌడ్ పేర్కొన్నారు.
తెలుగు తమ్ముళ్లకు టీఆర్‌ఎస్ ఝలక్
Published Tue, Mar 25 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement