‘ఆది’ నుంచీ హోరాహోరీ
తెలంగాణ ఇచ్చింది తామేనని, గెలుపు తమదేననే ధీమాతో కాంగ్రెస్ ఉండగా, ప్రత్యేక రాష్ట్రం తమ పోరాట ఫలితమేనని, ప్రజలు తమనే ఆదరిస్తారని టీఆర్‌ఎస్ భావిస్తోంది. తీవ్ర సంక్షోభంలో పడిన టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు పైనే భారం వేసి ఎన్నికల బరిలో దిగుతోంది.
(పాత బాలప్రసాద్ - ఆదిలాబాద్): అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ రాష్ట్రంలోనే మొదటి లోక్‌సభ స్థానం. గోండు, కొలాం వంటి ఆదివాసీల నిలయం. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమసంఖ్యలో నెం.1 ఎంపీగా విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ లోక్‌సభ నియోకవర్గం ఎస్టీలకు రిజర్వు కావడంతో బలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు సైతం అన్వేషించాల్సి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామేనని, గెలుపు తమదేననే ధీమాతో కాంగ్రెస్ ఉండగా, ప్రత్యేక రాష్ట్రం తమ పోరాట ఫలితమేనని, ప్రజలు తమనే ఆదరిస్తారని టీఆర్‌ఎస్ భావిస్తోంది. తీవ్ర సంక్షోభంలో పడిన టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు పైనే భారం వేసి ఎన్నికల బరిలో దిగుతోంది.
కొత్త, పాత ముఖాలు..
ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకున్ని తెరపైకి తెచ్చింది. ఈ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న 37 ఏళ్ల నరేష్ జాదవ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసిన ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. నేరుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నాయకుడు రాథోడ్ రమేష్ టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా పట్టుండటం ఈ ఎన్నికల్లో కొంతమేరకు ప్రభావం చూపనుంది. మూడు నెలల క్రితం వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన గొడం నగేష్‌ను తమ పార్టీలో చేర్చుకున్న టీఆర్‌ఎస్ ఆయన్నే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా కూడా చాలా కాలం పనిచేశారు. తన సొంత నియోజకవర్గం బోథ్‌లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నగేష్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఒక్కసారి గెలిస్తే...
ఈ నియోజకవర్గంలో ఒకసారి ఎంపీగా గెలిచిన అభ్యర్థి, తిరిగి రెండు, మూడు సార్లు గెలవడం ఆనవాయితీగా వస్తోంది. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఆశన్న ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1984 వరకు ఆరు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులే ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. జి. నారాయణరెడ్డి ఒకసారి (1962లో), పి.గంగారెడ్డి (1967, 1971లలో), జి.నర్సింహరెడ్డి (1977, 1980లలో)రెండేసి పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందారు.
లోక్‌సభ నియోజకవర్గం- ఆదిలాబాద్
1984లో టీడీపీ అభ్యర్థిగా సి.మాధవరెడ్డి విజయం సాధించగా, 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1991 ఎన్నికల్లో ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా ఎస్. వేణుగోపాలచారి (ప్రస్తుతం ముథోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి) గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఈ ఆనవాయితీ కలిసిరాలేదు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీగా మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
‘దేశం’ కోటకు బీటలు..
జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. రాష్ట్ర స్థాయిలో ఓ వెలుగు వెలిగిన అనేక మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు దయనీయ పరిస్థితికి దిగజారింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో నాలుగు చోట్ల విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరమయ్యారు. తెలంగాణపై అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే గొడం నగేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి నష్టం కలిగించే విధంగా తయారయ్యాయి.
బలాబలాలు..
అనుకూలం
- యువకుడు, విద్యావంతుడు కావడంతో యువతలో కొంత సానుకూలత నెలకొని ఉండడం
- {పత్యక్ష రాజకీయాలకు కొత్త కావడంతో పెద్దగా ఆరోపణలు లేకపోవడం
- తెలంగాణ తెచ్చింది..ఇచ్చిందీ మేమే అంటున్న కాంగ్రెస్ ఓటుబ్యాంకుపైనే ఆధారం
ప్రతికూలం
- కాంగ్రెస్‌లోని గ్రూపు విభేదాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం. నిర్మల్ అభ్యర్థి మినహా ఆరు చోట్ల ఆయన వ్యతిరేక వర్గీయులకే ఎమ్మెల్యే టికెట్లు రావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం
- తన సొంత నియోజకవర్గం బోథ్‌లోనే వ్యతిరేక వర్గం నెలకొనడం
- ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కావడం
అనుకూలం
- జిల్లాలోృవిస్తృతంగా పర్యటించడం. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం
- సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండడం, అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పట్టుండడం, అనుచరులు ఉండడం
- మోదీ ప్రభావంతో ఓట్లు పడే అవకాశం
- ఆర్థికంగా బలమైన నేత కావడం
ప్రతికూలం
- గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించకపోవడం. ముఖ్యంగా సీసీఐ పునప్రారంభం చేయించలేకపోవడం. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పనలో విఫలం కావడం
- కుటుంబ పాలన. గత ఎన్నికల్లో తన సతీమణి సుమన్‌రాథోడ్‌కు, ఇప్పుడు తన కుమారుడు రితేష్‌రాథోడ్‌కు టికెట్లు ఇప్పించుకోవడం
- బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు దూరమయ్యే అవకాశం
- తన ఎంపీలాడ్స్ నిధులతో చేపట్టిన పనులు ప్రజావసరాల కంటే, కార్యకర్తల జేబులు నింపేలా ఉండడం
- తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేసిన చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలుండడం
నే.. గెలిస్తే..
నరేష్‌జాదవ్ (కాంగ్రెస్)
- నిజామాబాద్ వరకు ఉన్న రైలు మార్గాన్ని నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు పొడిగించేందుకు కృషి
- అవకాశమున్న చోట్ల సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు కృషి, ముఖ్యంగా కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యం
- ఆదిలాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ, ఉట్నూర్‌లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తా
- ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి
- మారుమూల ప్రాంతాల వాసులకు తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తా
- యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేం దుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు కృషి
- మూతపడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాని తిరిగి తెరిపించేందుకు కృషి
రాథోడ్ రమేష్ (టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి)
- గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తా, తాగునీటి సమస్య పరిష్కరిస్తా
- ఆదిలాబాద్ -కామారెడ్డి, ఆదిలాబాద్ - మంచిర్యాల రైల్వే లైన్ల ఏర్పాటుకు కృషి
- {పాణహిత, పెన్‌గంగా, గోదావరి జలాలను బీడు భూములకు తరలించేందుకు కృషి
- సీసీఐ పున ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా
- రూ.రెండు వేల కోట్లతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల రోడ్ల అభివృద్ధి
అనుకూలం
- గోండు కావడంతో నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఆ సామాజిక వర్గం ఓట్లు పడే అవకాశం
- సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం
- టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు కలిసొచ్చే అవకాశం
ప్రతికూలం
- తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండడం. తెలంగాణవాదుల్లో, జేఏసీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత
- నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం. ప్రజాసమస్యలపై స్పందించకపోవడం
- సొంత నియోజకవర్గం బోథ్‌లో వ్యతిరేకత
గోడం నగేష్ (టీఆర్‌ఎస్ అభ్యర్థి)
- నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా
- ప్రజలకు అందుబాటులో ఉంటా
- బాసర నుంచి మంచిర్యాల వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా
- అవసరమైన ప్రాంతాల్లో 400 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
- జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కృషి
- మూతపడిన సీసీఐ వంటి పరిశ్రమల పునఃప్రారంభానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాను
- లోయర్ పెన్‌గంగా, గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణాని కృషి
- పత్తి రైతులకు సాగుకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు శిక్షణ సంస్థల ఏర్పాటు
- ఐఐటీ వంటి విద్యా సంస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తా