శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ : జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం సాయంత్రం పొన్నాంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదువులు, అర్హులకు పింఛన్లు అందాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మండలం నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్థనరావు, నీలంశెట్టి సౌమ్యను గెలిపించాలని కోరారు.
బాబు సంక్షేమమేమిటంటే...
ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడమే చంద్రబాబు మార్కు సంక్షేమమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. ప్రజాదరణతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించిన ఘనత బాబుదన్నారు.
రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25కు పెంచడం, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి గ్రామగ్రామాన బెల్టు షాపుల ఏర్పాటు చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలను తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్ధనరావు, నీలంశెట్టి సౌమ్య, గ్రామ సర్పంచ్ బైరి రాజేశ్వరీరామారావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, కొర్ను గోవిందరావు, నీలంశేట్టి రామకృష్ణ, మొదలవలస శ్రీనివాసరావు, సనపల శ్రీనివాసరావు, రావాడ ధరణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పే నేతలను తరిమికొట్టాలి
ఆమదాలవలస : కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, టీడీపీ నేతలను తరిమికొట్టాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాంతో కలిసి మున్సిపాలిటీపరిధిలోని 22వ వార్డు లక్ష్ముడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి బి.అజంతాకుమరి, కౌన్సిలర్ అభ్యర్థి దుంపల చిరంజీవి, పార్టీనాయకులు అందవరపు సూరిబాబు, రవికుమార్, కూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సరోజనమ్మకు ఓటేయండి
మండలంలోని నెల్లిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెడ్డి శాంతి మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎస్.అనిల్‌కుమార్, పార్టీ నాయకులు ఎస్.సీతారాం, కేవీ రమణ, జి.గిరి, తదితరులు పాల్గొన్నారు.