'కృష్ణా' నేతలకు కలిసిరాని విప్ పదవి
మచిలీపట్నం: నేతలకు సెంటిమెంట్లు ఉన్నా.. లేకున్నా.. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లు వెంటాడుతూనే ఉంటాయి. అలా జరగడం యాథృచ్చికమే అయినా వరుసగా ఒకేవిధంగా జరిగితే అదే సెంట్‌మెంట్‌గా మారుతోంది. ఇదే తరహాలో జిల్లాకు చెందిన కీలక నేతలకు విప్ పదవి అచ్చి వచ్చినట్టు లేదు. ముగ్గురు నాయకులు విప్ పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ బలపడింది. తాజాగా ప్రభుత్వ విప్ పదవి నిర్వహించిన బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఓటమితో జిల్లాలో దీనిపై చర్చసాగుతోంది. గతంలో టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి సామినేని ఉదయభాను విప్‌లుగా పనిచేసి ఓటమిపాలైన వారే.
మొదట ‘కాగిత’...
మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాగిత వెంకట్రావు చంద్రబాబు హయాంలో విప్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కూడా కాగిత పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి కాగిత ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో మల్లేశ్వరం రద్దయి పెడన నియోజకవర్గం ఏర్పడింది. పెడన నుంచి 2009 ఎన్నికల్లో పోటీచేసిన కాగిత రెండోసారి కూడా ఓటమిని చవిచూశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాగిత పెడన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విప్ పదవి నిర్వహించిన కాగితకు పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది.
ఉదయభాను పరిస్థితి అంతే..
జగ్గయ్యపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సామినేని ఉదయభాను వైఎస్ ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభాను ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఉదయభాను మంత్రి అవుతారని ఆయన అభిమానులు, జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినా ఉదయభాను మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేదు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ఉదయభాను బలపరిచారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన జిల్లాలో మంచి పట్టు సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన జగ్గయ్యపేట నుంచి కచ్చితంగా గెలుస్తారని రాజకీయ పరిశీలకులు ధీమాగా చెప్పారు. టీడీపీకి దీటైన పోటీ ఇచ్చిన ఆయన అనూహ్యంగా ఓటమిని చవిచూశారు.
మూడో నాయకుడు ‘పేర్ని’
మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి నడకుదుటి నర్సింహారావు చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో నడకుదుటిపై, 2009 ఎన్నికల్లో నడకుదుటి అల్లుడు కొల్లు రవీంద్రపై నాని విజయం సాధించారు. దీంతో నానికి ప్రభుత్వ విప్ పదవి లభించింది. వైఎస్ మరణంతో జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుమ్మక్కు కుట్రలు సహించలేక, పాలకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించడాన్ని తట్టుకోలేక నాని తన విప్ పదవికి రాజీనామా ప్రకటించి వైఎస్సార్ సీపీలో చేరారు. పదవే పరమావధిగా భావించే నేతలు ఉన్న ఈ రోజుల్లో నాని కీలకమైన విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. పదవుల కంటే విలువలు, విశ్వసనీయత ముఖ్యమని భావించే నాని నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. అటువంటి నాయకుడు ఓటమిని చవిచూడటం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో ప్రభుత్వ విప్‌లుగా పనిచేసి విశేష ప్రజాదరణ పొందిన నేతలు సైతం ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.