ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం మీదే!
ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం మీదే!
Published Tue, Apr 29 2014 11:54 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
ఇప్పుడు గుజరాత్ లో అందరి చూపూ వల్సడ్ లోకసభ నియోజకవర్గం పైనే. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో కేంద్రంలో అధికారం వారిదే. మొదట్నుంచీ దక్షిణ గుజరాత్ లోని ఈ నియోజవకర్గం అధికారపక్షానికి అనుకూలమే. అందుకే అందరూ దీన్ని గేట్ వే టు ఢిల్లీ అంటారు.
1996 లో తొలి సారి వల్సడ్ బిజెపి చేతికి వచ్చింది. అప్పుడు వాజ్ పేజీ పదమూడు రోజుల ప్రభుత్వం ఏర్పడింది. 1998, 1999 లో వల్సడ్ లో మళ్లీ బిజెపి గెలిచింది. వాజ్ పేయీ మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 లో కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ పటేల్ గెలిచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2009 లోనూ మళ్లీ కిషన్ పటేల్ గెలిచారు. ఈ సారి రెండో సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
ఈ సారి మళ్లీ కిషన్ పటేల్ ఎన్నికల బరిలో ఉన్నారు. బిజెపి తరఫున మాజీ వైద్య మంత్రి డా. కెసి పటేల్ పోటీలో ఉన్నారు. 1977 నుంచి వచ్చిన ఫలితాలు చూస్తూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ అయిదు సార్లు, బిజెపి మూడు సార్లు, ఇండిపెండెంట్లు రెండు సార్లు గెలిచారు. ఇండిపెండెంట్లు గెలిస్తే కాంగ్రెసేతర, బిజెపిఏతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
ఈ నియోజకవర్గంలో 14.95 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో ధోదియా, కూంకనా, వర్లి, కోలి, ఓబీసీ, హల్ పతి, మత్స్యకారులు, ముస్లింలు, భీల్ గిరిజనులు ప్రధానం. ఈ సారి పది మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ సారి వల్సడ్ గత చరిత్రను కంటిన్యూ చేస్తుందా లేక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా చూడాలి.
Advertisement
Advertisement