‘సాగర’.. విహారం ఎవరిదో! | who will win in nagarjuna sagar assembly constituency ? | Sakshi
Sakshi News home page

‘సాగర’.. విహారం ఎవరిదో!

Published Sat, Apr 19 2014 1:29 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

‘సాగర’.. విహారం ఎవరిదో! - Sakshi

‘సాగర’.. విహారం ఎవరిదో!

ప్రపంచ పర్యాటక కేంద్రమైన  నాగార్జునసాగర్  గతంలో చలకుర్తిలో భాగం. 2009 పునర్విభజనలో  నాగార్జునసాగర్‌గా మారింది. ఇప్పటి దాకా 9 సార్లు ఎన్నికలు జరిగ్గా ముగ్గురే ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గం వైపు చూస్తోంది.
 
 ఎన్.క్రాంతి, నల్లగొండ:
తెలంగాణ  కాంగ్రెస్‌లో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి   ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతి ఎక్కువ కాలం పనిచేసిన మంత్రిగా రికార్డు సొంతం చేసుకున్న  జానా  రెండుసార్లు టీడీపీ నుంచి, నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించి, ఏడో విజయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేసులో ఉన్న జానాకు  ఈ విజయం ఎంతో అవసరం. దీంతో ఆయనకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఇక్కడ నుంచి చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా .. అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి.  ఈ గండం నుంచి బయట పడాలని ఆయన ఆరాటపడుతున్నారు.
 
 ఒక్కటవుతున్న ...బీసీలు
 జానారెడ్డిని మినహాయిస్తే, ఇక్కడ నుంచి నిమ్మల రాములు మూడు సార్లు, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ ఓసారి గెలిచారు. వీరిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వారే. నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నా..  ఆ వర్గాల నుంచి బలమైన నాయకత్వం లేకపోవడం జానారెడ్డికి కలిసి వచ్చింది. కానీ, ఈసారి పరిస్థితి మారింది.  సీపీఎం సీనియర్ నాయకుడైన నోములు నర్సింహయ్య  టీఆర్‌ఎస్‌లో చేరి ఇక్కడ బరిలో ఉన్నారు.
 
 టీడీపీ సైతం బీసీ నేతనే పోటీకి దించింది. ఈ ఇద్దరు మెజారిటీ ఓట్లున్న ‘యాదవ’ సామాజికవర్గానికి చెందిన వారే. ఇతర బీసీ కులాలను కూడ గట్టే పనిలో నోముల ఉన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా ’ అన్న నినాదంతో నోముల ప్రచారానికి దిగారు. మరోవైపు సీపీఎం తన సంప్రదాయ ఓటుపై ఆధారపడింది. ఈ పార్టీకి చెందిన బీసీ వర్గాలు తమ పార్టీ మాజీ నేత అయిన నోముల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ తన ఓటుబాంకునే నమ్ముకుంది.
 
 సంచలనం కోసం వైఎస్సార్‌సీపీ ప్రయత్నం
 నాగార్జునసాగర్‌లో సంచలనాన్ని సృష్టించేందుకు  ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంలో అధికంగా ఉన్న రైతుల్లో వైఎస్సార్ పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వైఎస్‌ను ఎవరూ మరిచిపోలేదు.

ప్రపంచ బ్యాంకు నిధులతో జరుగుతున్న ఆపనుల వల్లే ఆయకట్టు చివరి భూములకూ నీరందుతోంది. వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా లబ్ధి పొందిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాంగ్రెస్ ఓట్లకు వైఎస్‌ఆర్ సీపీ నుంచి గండి పడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.  

అసెంబ్లీ నియోజకవర్గం: నాగార్జున సాగర్
 ఎవరెన్నిసార్లు గెలిచారు:
 కాంగ్రెస్ - 6, టీడీపీ - 2, స్వతంత్రులు -1
 ప్రస్తుత ఎమ్మెల్యే:  కె. జానారెడ్డి (కాంగ్రెస్)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు: నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం. రైసుమిల్లులు అధికం. రైతులు, బీసీల ఓట్లే ఇక్కడ కీలకం
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 13
 
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 కె.జానారెడ్డి (కాంగ్రెస్)
 మల్లు రవీందర్‌రెడ్డి ( వైఎస్సార్ సీపీ)
 కడారి అంజయ్య యాదవ్ (టీడీపీ )
 నోముల నర్సింహయ్య (టీఆర్‌ఎస్)
 కె. నాగిరెడ్డి (సీపీఎం)
 
 నే.. గెలిస్తే..
 *    తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారానికి  కృషి
 *   ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించి లిప్టుల కింద భూములకు సాగునీరు
 *    {పూట్ మార్కెట్ ఏర్పాటుకు కృషి
 *    నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం
 - కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్)  
 
 *    ప్రజాస్వామ్య పునరుద్ధరణ
 *  నగర పంచాయతీగా నాగార్జున సాగర్ ఏర్పాటు
*    సాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు  కృషి
*   వరదకాల్వ, ఎస్‌ఎల్‌బీసీ పంట కాల్వల పూర్తి . . హాలియాలో మినీ  స్టేడియం  ఏర్పాటుకు  కృషి
 - నోముల నర్సింహ్మయ్య (టీఆర్‌ఎస్)
 
*    పేదలందరికీ  ఇళ్లు, ఇంటి స్థలం
*    {పతి మండలంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు
*    ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ.  లక్ష ఎకరాలకు సాగునీరు
*   నియోజకవర్గంలోని డీఫారెస్ట్ భూములను గిరిజనులకు అందించేందుకు కృషి చేస్తా.
     - కూన్‌రెడ్డి నాగిరెడ్డి(సీపీఎం)
 
*    అన్నీ గ్రామాల్లో  మౌలిక సదుపాయాలు కల్పన
*    {పతి ఇంటింటికి శుద్ధి చేసిన కష్ణా జలాల సరఫరా
*   నాగార్జునసాగర్‌ను గ్రామ పంచాయతీగా మార్చడం
*    హాలియా మండల కేంద్రంలో ఇండోర్,  మినీ స్టేడియంల ఏర్పాటు
*   హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కోనుగోలు కేంద్రం ఏర్పాటు
*    500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించడం
- మల్లు రవీందర్ రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్)
 
*   తాగునీటి సమస్య  శాశ్వత  పరిష్కారానికి కృషి
*    కాల్వ ఎగువ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు
*    {పభుత్వ డిగ్రీ కళాశాల,     పాల్‌టెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి
*    సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి,  హాలియాలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి    
 - కడారి అంజయ్య యాదవ్( టీడీపీ)
 
 జన  తెలంగాణ
 యువతకు ప్రోత్సాహం..
 తెలంగాణ ఉద్యమంలో యువతదే ప్రధాన పాత్ర. తెలంగాణ నవ నిర్మాణంలోనూ వారు కీలకంగా మారనున్నారు. మా ఉద్యోగాలు మాకేనంటూ ఉద్యమించిన వారి ఆశలు నెరవేరాలి. ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలు పెంపొందాలి. యువతకు భరోసానిచ్చే నాయకత్వం రావాలి. యువశక్తిని వినియోగించుకోవాలి. యువజన సంక్షేమశాఖను పటిష్టం చేయాలి. క్రీడ, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహాన్ని అందించాలి.
 - ఏ. కిరణ్‌కుమార్
 జాతీయ యువజన అవార్డు గ్రహీత, కరీంనగర్

 
 అందరికీ నాణ్యమైన విద్య..
 ప్రజలు విద్యావంతులైనప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే నవ తెలంగాణ నిర్మాణంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అనేక మంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే చదువు మానేస్తున్నారు.  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఇలాంటి వారికి వరం. వేలాది మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. కొత్త రాష్ట్రంలో ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలి.  అందరికీ నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి.
 - జి.శివకిషోర్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్
 
 వ్యవసాయానికి పెద్దపీట..
 కొత్త రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులు దళారుల బారిన పడకుండా మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించాలి. గ్రామీణ ప్రాంత యువత  పట్టణాలకు వలస పోకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, పరిశుభ్రమైన తాగునీరు లాంటి ప్రాథమిక అవసరాలను నెరవేర్చడానికి కృషి చేయాలి.పల్లెలు అభివృద్ది చెందితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.
 - సయ్యద్ అహ్మద్
 బోరబండ, హైద్రాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement