ఆ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు? | YS Jagan Mohan Reddy questioned Chandrababu Naidu, Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?

Published Sat, May 3 2014 1:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

YS Jagan Mohan Reddy questioned Chandrababu Naidu, Narendra Modi

* 1999 - 2004 మధ్య టీడీపీ-బీజేపీ ఒక్కటై రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పారుగా.. అప్పుడేం చేశారు?  వైఎస్ జగన్
* పోలవరం, గాలేరు-నగరి, హంద్రీనీవా నాడు గుర్తుకు రాలేదే?
* సీమాంధ్రకు వెయ్యి కి.మీ. తీరముందంటున్న మోడీకి నాడు అది గుర్తురాలేదేం?
* మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు..
* మన గ్యాస్‌లో మనకు కోటా ఇవ్వకుండా.. దేశాన్ని అభివృద్ధి చేస్తాననడం న్యాయమేనా?
* 25 మంది ఎంపీలను గెలిపించుకుందాం.. అప్పుడు ప్రధాని మోడీనా.. ఎల్లయ్యా.. పుల్లయ్యా అన్నది మనమే నిర్ణయిద్దాం
 
‘వైఎస్‌ఆర్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మొన్న తిరుపతి సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు మాట్లాడుతూ తామిద్దరం కలిస్తే ఆకాశం నుంచి స్వర్గాన్ని అలా అలా కిందికి తీసుకొచ్చేస్తామని చెప్పారు. సీమాంధ్రను ఎక్కడికో తీసుకుపోతామన్నారు. వాళ్లను నేను ఒక్కటే అడుగుతున్నా.. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఒక్కటై ఇటు రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ నేతలు చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు చెప్పగలరా? ఆ రోజు మీకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదా? పులిచింతల ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు గుర్తుకు రాలేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి గుర్తొచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

శుక్రవారం కృష్ణా జిల్లా తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి.. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. వేలాది మంది ఈ కార్యక్రమాలకు తరలివచ్చారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దాం..
‘‘తిరుపతి సభలో నరేంద్రమోడీ అంటారు... రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉంది.. చంద్రబాబుకు ఓటెయ్యండి.. గొప్పగా బాగు పరుస్తారని చెప్పారు. ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబు నాయుడులను ఒకటి అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మన గ్యాస్‌లో మనకు వాటా ఇవ్వకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎంతవరకు న్యాయం? అని అడగదలచుకున్నా.

వీరికి మన మీద ప్రేమ లేదు. వీరికెవ్వరికి మన భాష రాదు.. ఆప్యాయత లేదు. వీరికి కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. అందుకోసం ఏ గ డ్డి అయినా తింటారు. వీళ్లను ఎవరూ నమ్మొద్దు. ఈ ప్రాంతంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుం డా 25 సీట్లను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దామా.. ఎల్లయ్యను చేద్దామా.. పుల్లయ్య ను చేద్దామా అన్నది ఆ రోజు నిర్ణయం తీసుకుందాం. ఎవరైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మనకు నమ్మకం ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. ఆరోజు ప్రధాని సీటులో కూర్చునే వ్యక్తి మనకు ఏం కావాలో దానికి ఒప్పుకుంటేనే ఆ కుర్చీ మీద కూర్చోబెడదాం.

జగన్‌పై బురదజల్లడమే ఎజెండా..
ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఎంతగా చెడిపోయిందంటే.. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారు. బీజేపీ ఆ విభజనకు మద్దతు పలికింది. దానికి చంద్రబాబు నాయుడి ఎంపీల తోడు ఉండబట్టే రాష్ట్రాన్ని విభజించగలిగారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే వరకు ఈ మాటలే అక్కడ చెబుతూ వచ్చారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అయితే పెద్దమ్మ సోనియా గాంధీతోపాటు చిన్నమ్మనైన తాను సహకరిస్తేనే రాష్ట్రాన్ని విభజించారని ఆమె అన్నారు. నిస్సిగ్గుగా నరేంద్రమోడీ నుంచి సుష్మాస్వరాజ్ దాకా తాము సహాయం చేయకపోతే విభజన జరిగేది కాదని తెలంగాణలో అన్నారు.

చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లినప్పుడు నిస్సిగ్గుగా తానిచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. వీరందరి పరిస్థితి ఎలా ఉందంటే ‘అడ్డంగా ఒక మనిషి కాలు నరికేసి... ఆయింట్‌మెంటు పెట్టడానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నట్లు’ ఉంది. తెలంగాణలో ఎన్నికలు 30వ తేదీన అయిపోయాయి. ఆ రోజు సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అయిపోయి గంట కూడా తిరగకముందే ఏడు గంటలకు తిరుపతిలో ఒక మీటింగ్ జరిగింది.

బీజేపీ నుంచి మోడీ, వెంకయ్య నాయుడు, తెలుగుదేశం నుంచి చంద్రబాబు, వీళ్లతోపాటు చాలామంది తోకలు అందరూ నిస్సిగ్గుగా మాట్లాడారు. అందరిదీ ఒకే లక్ష్యం.. అదేంటంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఉంది.. జగన్‌పై బురద జల్లండి అన్న ఒకే ఒక ఎజెండాతో మాట్లాడారు. వీళ్లు మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా గుండె బరువెక్కింది. నిజాయితీలేని మాటలు మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించింది. ఆ వేదిక మీద రాష్ట్రాన్ని విడగొట్టింది జగన్ అంటూ అభాండాలు వేయడానికి చూశారు.’’
 
బాబు కావాలా? నేను కావాలా?
అబద్ధాలు, వెన్నుపోట్లకు మారుపేరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావాలో, విశ్వసనీయత, నిజాయితీ కలిగిన తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల్లో నాతో చంద్రబాబు పోటీ పడుతున్నారు. చంద్రబాబు నాయుడి గత చరిత్రను ఒకసారి తిరగేయండి. చంద్రబాబు భయానక పరిపాలనను గుర్తు తెచ్చుకోండి’’ అని సూచించారు.

‘‘విశ్వసనీయత లేని, నిజాయితీ లేని చంద్రబాబు కావాలా?’’ అని మైలవరం సభలో ప్రశ్నించగా.. ప్రజలు ముక్తకంఠంతో ‘నో’ (వద్దు) అంటూ చేతులు పెకైత్తారు. చంద్రబాబుకు వినపడేలా చెప్పాలని జగన్ అనే సరికి సభా ప్రాంగణం మొత్తం ‘నో’ అంటూ నినదించింది. ‘విశ్వసనీయతకే మారుపేరుగా నిలబడిన నేను కావాలా?’ అని జగన్ అడిగినప్పుడు అందరూ ‘యస్’ అంటూ గళమెత్తి చాటారు. గట్టిగా చెప్పాలని మరోసారి జగన్  కోరగా మైలవరం మొత్తం మార్మోగిపోయింది.
 
నాలుగు జిల్లాల్లో నేడు జగన్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం హెలికాప్టర్‌లో బయలుదేరి తొలుత కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉదయం 9.30, పశ్చిమగోదావరిలోని పాల కొల్లులో ఉదయం 11.00, తూర్పుగోదావరిలోని పి.గన్నవరంలో మధ్యాహ్నం 1.00, విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్‌లో సాయంత్రం 5.00 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. సీమాంధ్రలో ప్రచారం ముగిసే వరకూ జగన్  ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్‌ను వినియోగిస్తారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement