
'వాళ్లిద్దరూ స్వర్గాన్ని తీసుకువస్తారట!'
జగ్గయ్యపేట : ఈనాడు రాతలు చదువుతుంటే బాధేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రోడ్ షోలో ప్రసంగించారు. నరేంద్ర మోడీ..చంద్రబాబులు స్వర్గాన్ని తెస్తామనే విధంగా మాటలు చెబుతున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. మన రాష్ట్రం గురించి మోడీకేం తెలుసని జగన్ మండిపడ్డారు. మన దగ్గర నుంచి గ్యాస్ తీసుకెళ్లి అక్కడ తక్కువ ధరకు ఇచ్చుకుని.. మనకు మాత్రం రెట్టింపు రేటు కడుతున్నారని జగన్ తెలిపారు.
తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని జగన్ అన్నారు. మరోవైపు తెలంగాణ ఇచ్చింది సోనియానే కాదని... ఈచిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని అంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత సీమాంధ్రలో జగన్ వల్లే తెలంగాణ వచ్చిందని అబద్దాలు చెబుతారన్నారు. 1999-2004 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు..బీజేపీకి 1000కి.మీ సముద్రతీరం కనిపించలేదా? అని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు, కట్టాల్సిన ప్రాజెక్టులు గుర్తుకొస్తాయా అన్నారు.
చంద్రబాబు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ అబద్ధాలాడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. మన రాష్ట్ర బడ్జెట్ లక్షా 25వేల కోట్లు ఉంటే...లక్షా 50వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారన్నారు. 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని, మన రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తానని ముందుకు వస్తారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని జగన్ అన్నారు.