పేదరికాన్ని ఎలా తొలగించాలన్న ఆరాటంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనునిత్యం తపించారని, సంక్షేమ ఫలాలను పేదలకు పంచి జనం మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు.
సాక్షి, గుంటూరు: పేదరికాన్ని ఎలా తొలగించాలన్న ఆరాటంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనునిత్యం తపించారని, సంక్షేమ ఫలాలను పేదలకు పంచి జనం మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. వైఎస్ ఐదే ళ్ల హయాంలోనే పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు.
గురువారం మంగళగిరిలో ప్రచారం ముగింపు అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని, ఆయన సువర్ణ పాలన తెచ్చేందుకు జగన్ అహరహం పాటు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌లోని దీక్ష, దక్షతలు జగన్‌లో ఉన్నాయని, వైఎస్ ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ జగన్‌ను చూసుకుంటున్నారని తెలిపారు. ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్, టీడీపీల కుయుక్తులకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
విభజనకు కారకులైన వారికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పే సదవకాశం వచ్చిందన్నారు. గడగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న తనకు ప్రజలంతా వైఎస్ పథకాల మేలు మరిచిపోలేమని చెబుతున్నారని, ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆర్కే చెప్పారు. సింగపూర్‌ను మించిన రాయల్ సిటీని సీమాంధ్రలో నిర్మించే సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు.
పేదల ఆలోచనలకు, ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచే వైఎస్ వారసత్వంపైనే జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. పేదరికానికి కులం, మతం, రాజకీయం ఉండదని, కాలే కడుపు మాత్రమే ఉంటుందని గట్టిగా నమ్మే వ్యక్తి జగన్ అని ఆర్కే చెప్పారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్సార్ సీపీకి అండగా నిలిచి పార్టీ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. త్వరలోనే ఫ్యాన్ గాలి ప్రభంజనానికి టీడీపీ, కాంగ్రెస్‌లు కనుమరుగవడం ఖాయమన్నారు.