దెందులూరు.. టీడీపీ బేజారు
దెందులూరు, న్యూస్‌లైన్ : దండ నాయకులు నివసించిన ప్రాంతంగా.. వేంగి రాజుల ప్రధాన కేంద్రంగా భాసిల్లిన దెందులూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. నియోజకవర్గంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం జీవనాధారంగా బతుకుతున్నారు. చేపలు చెరువులు విస్తారంగా ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాలతో పాటు ఏలూరు రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలతో నియోజకవర్గం ఏర్పడింది. 2.66 లక్షల జనాభా ఉండగా వీరిలో అత్యధిక శాతం మంది బీసీలు. ఓటర్లలో కూడా వీరిదే ఆధిక్యత. అయినా బీసీలు, ఎస్సీలు ఇక్కడ పల్లకీ మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడంతో ఆయా వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్, తణుకు ఎమ్మెల్యేగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి, స్థానిక ప్రజలతో ఆయనకున్న సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం, నిధులు మం జూరులో చొరవ వంటి అంశాలు కారుమూరికి అనుకూలంగా మారాయి. దీనికితోడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన పనులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదరణ, ఆ పార్టీ మేనిఫెస్టో, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల ఆదరణ వైసీపీ అభ్యర్థి విజయానికి దోహదపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కారుమూరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు ప్రచారంలో వెనుకపడటంతోపాటు ముఖ్యనేతలు టీడీపీని వీడటం ప్రతికూలంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంటి వీరేంద్రప్రసాద్ నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు.
కారుమూరి దూకుడు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొల్లేరు దళితవాడలు, బీసీ, మైనార్టీ ప్రాంతాల్లో కారుమూరికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. వైసీపీ మేనిఫెస్టో నచ్చి పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కారుమూరికి మద్దతు పలుకుతున్నారు. పలువురు ముఖ్య నేతలు కారుమూరి విజయం కోరుతూ గ్రామగ్రామానా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధిక శాతం బీసీలు, ఎస్సీలు కారుమూరి వెంటే ఉండటం అనుకూల అంశంగా ఉంది. కారుమూరి పరిపాలన దక్షత, అభివృద్ధికి విజన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ, మహానేత వైఎస్సార్‌పై అభిమానం కారుమూరి విజయానికి దోహదపడనున్నాయి. కారుమూరి విజయం నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చింతమనేనికి చింతలు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు ఎదురీదుతున్నారు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో టీడీపీకి సేవలందించిన పలువురు నాయకులు, కార్యకర్తలు దూరం కావడంతో పార్టీ కేడర్ అయోమయ స్థితిలో ఉంది. ముఖ్య నేతలు కమ్మ శివరామకృష్ణ, వడ్లపట్ల శ్రీనివాసరావు, కొలనువాడ కృష్ణంరాజుతో పాటు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడటం ప్రతికూల అంశంగా ఉంది.
కాంగ్రెస్ నామమాత్రపు పోటీ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి వీరేంద్రప్రసాద్ నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రుల ఆగ్రహాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు దక్కడం కూడా కష్టంగా కనిపిస్తోంది. మాగంటి ప్రచారం వెలవెలబోవడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు.