
అంచనాలు తారుమారు
టెక్కలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కగలమా లేదా అని ఆ పార్టీ శ్రేణులు
టెక్కలి, న్యూస్‌లైన్: టెక్కలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కగలమా లేదా అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. నియోజకవర్గంలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గానికి కీలకమైన టెక్కలి, నందిగాం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఓటములను ప్రధానంగా టెక్కలి, నందిగాం మండలాలు నిర్ణయిస్తాయి. ఈ మండలాలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలమైన కోటబొమ్మాళి మండలంలో కూడా వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ నిచ్చి చెమటలు పట్టిచ్చింది. కింజరాపు సోదరుల కంచుకోటగా పేర్కొనే కోటబొమ్మాళి మండలంలో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పోటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో అడుగిడిన వెంటనే విజయం కైవసం చేసుకుని ప్రత్యర్థులను ఆందోళనకు గురి చేశారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కర్నిక సుప్రియ. నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో వైఎస్సార్‌సీసీ జెడ్పీటీసీ అభ్యర్థి కర్నిక సుప్రియ తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి రెయ్యి మురళీవేణిపై 2348 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. టెక్కలివాసులకు అంతగా పరిచయం లేని పిన్నవయస్కురాలైన సుప్రియ సాధించిన విజయం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, టీ డీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. నందిగాం మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కురమాన బాలకృష్ణారావు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మట్ట చంద్రమోహన్‌పై
2530 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో 12 స్థానాలు వైఎస్సార్‌సీపీ, 4 స్థానాలు టీడీపీ గెలుచుకున్నాయి.
కోటబొమ్మాళి మండలంలో 21 స్థానాల్లో 11 స్థానాల్లో టీడీపీ, 10 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందాయి. టెక్కలిలో వైఎస్సార్‌సీపీ 7, టీడీపీ 14, సంతబొమ్మాళిలో స్వతంత్ర అభ్యర్థి మినహా టీడీపీ 15, వైఎస్సార్‌సీపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. మండల ప్రాదేశిక ఎన్నికలో స్థానిక, అభ్యర్థుల వ్యక్తిగత, ఇతర అంశాలు ప్రభావితం చూపితే, జెడ్పీటీసీ ఎన్నికలో పార్టీల ప్రభావం ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు కీలకమైన టెక్కలి, నందిగాం మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ముచ్చెమటులు పడుతున్నాయి. 16న జరగనున్న సార్వత్రిక ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుందోనని టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. స్థానిక సంస్థల ఫలితాల్లో టెక్కలి నియోజకవర్గంలో మూడు చోట్ల టీడీపీ మండల స్థాయిలో ప్రభావం చూపినా టెక్కలి, నందిగాంలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్ధులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంపై టిడీపీ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నారు.