
సాక్షి,ముంబయి:బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ టైటిల్ రోల్ పోషించిన సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పద్మావతి అధికారిక ట్రైలర్ అక్టోబర్ 9న విడుదలైనప్పటినుంచీ ఇప్పటివరకూ 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. వివాదాలతో పాటు ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన పద్మావతి విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తోంది. తాజాగా చిత్ర ట్రైలర్‌కు వచ్చిన అద్భుత స్పందనను మూవీ మేకర్లు ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ట్రైలర్‌ను విశేషంగా ఆదరించడంతో పాటు కీలక మైలురాయిని అధిగమించేలా చేసినందుకు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ప్రేమికులకు యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. యూట్యూట్, ఫేస్‌బుక్‌లో రిలీజ్ చేసిన ట్రైలర్ 5 కోట్ల వీక్షకుల మార్క్‌ను అధిగమించింది. భన్సాలీ సినిమాలంటేనే వివాదాలు, ప్రత్యేకతలతో పతాకశీర్షికలకెక‍్కడంలో ముందుంటాయి. పద్మావతి దీనికి మినహాయింపు కాలేదు. సినిమా ప్రారంభం నుంచే వివాదాలు వెంటాడాయి.
రాణి పద్మిని పాత్ర తీరుపై రాజ్‌పుట్ సంఘాలు మొదటినుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినిమాను తమకు చూపించకుండా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే హెచ్చరించాయి. చరిత్రను వక్రీకరించేలా ఎలాంటి సన్నివేశాలున్నా భారీ మూల్యం తప్పదని స్పష్టం చేశాయి. ఇన్ని వివాదాల మధ్య పద్మావతి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.