మీ సమయాన్ని ఆదాచేసే 7 ఉచిత పీడీఎఫ్ టూల్స్
టూల్స్
ఎప్పుడైనా పీడీఎఫ్ ఫైలుతో మీరు విసిగిపోయారా? పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌ను మనం విరివిగా ఉపయోగిస్తున్నా కూడా.. అది కొన్నిసార్లు మనల్ని చాలా విసిగిస్తుంటుంది. పీడీఎఫ్ కేవలం చదవడమే అయితే ఈజీనే. కానీ, దాన్ని క్రియేట్ చేయడమో లేక ఎడిట్ చేయడమో చేయాలంటే కొన్నిసార్లు తలప్రాణం తోకకొస్తుంటుంది. ఇంతకుమించిన పనులేమైనా పీడీఎఫ్‌తో చేయాలంటే.. ఆ పని ఎక్కడో చోట ఆగినా ఆగిపోతుంది. అదష్టవశాత్తూ వెబ్‌లో మనకు ఎన్నెన్నో పీడీఎఫ్ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందరికీ పెద్దగా తెలియని ఉపయుక్తమైన టూల్స్ మీ కోసం. వీటిలో సాదాసీదా ఎడిటింగ్, క్రియేటింగ్ గురించి కాకుండా కొన్ని కొత్త సంగతులకు సంబంధించిన వాటినే వివరించాం..
జొటి మాల్వేర్ స్కాన్
EXE , ZIP ఫైల్‌లో వైరస్‌లు దాక్కొని ఉండే అవకాశముందని మనకు తెలిసిందే. కానీ పీడీఎఫ్‌లలో కూడా అంతర్గతంగా వైరస్‌లు ఉండే చాన్స్ ఉందని ఎంత మందికి తెలుసు? అలా ఏదైనా పీడీఎఫ్‌లో వైరస్ ఉందా అని చెక్ చేయాలంటే ఈ జొటి మాల్వేర్ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌లోకి మీ ఫైలును అప్‌లోడ్ చేస్తే అది 20కిపైగా వేర్వేరు మాల్వేర్ స్కానర్లతో పరీక్షిస్తుంది. కేవలం క్షణాల్లోనే ఫలితం చూపిస్తుంది.
ఆన్‌లైన్ ఓసీఆర్
మీరు ఓ పీడీఎఫ్ ఫైలు నుంచి ఒక పారాను టెక్ట్స్ రూపంలో కాపీ చేసుకోవాలనుకున్నారు. కొన్ని రీడర్లలో ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా చికాకు తెప్పిస్తుంది. దీనికి సరైన సలహా.. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టూల్ వాడడమే. ఇది ఫైలులోని ప్రతి క్యారెక్టర్‌నూ టెక్ట్స్ రూపంలో మార్చి అందిస్తుంది. చూడ్డానికి పీడీఎఫ్‌ను వర్డ్ లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపించవచ్చుగానీ.. నిజానికి ఇది కొంచెం వేరే ప్రక్రియే. ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కన్వర్టవుతుంది. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
డిఫ్ నౌ
మీరు ఎప్పుడైనా ఒకే ఫైలుకు సంబంధించి రెండు వర్షన్లు అందుకొని వాటిలో ఏం మార్పు జరిగిందబ్బా అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొన్నారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫైళ్లను డిఫ్ నౌ లోకి అప్‌లోడ్ చేస్తే.. ఏమేం మార్పులు జరిగాయో అది ఇట్టే చెప్పేస్తుంది. ఏం కలిపారు? ఏం తీసేశారు? ఏం మార్చారు? అన్న వివరాలు తెలియజేస్తుంది.
హెచ్‌టీఎంఎల్ టు పీడీఎఫ్
ఏదైనా వెబ్ పేజీని పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఆన్‌లైన్ టూల్‌లోకి మీరు కోరుకున్న యూఆర్‌ఎల్ ఇచ్చి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాంటి మరికొన్ని టూల్స్: పీడీఎఫ్ ప్రొటెక్ట్, పీడీఎఫ్ అన్‌లాక్, పీడీఎఫ్ కంప్రెస్... వీటి పేరును బట్టి అవి ఎందుకు ఉపయోగపడతాయో అర్థమైపోతుందిగా.
-razesh007@gmail.com