నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను
నేను చనిపోకూడదని ఆశిస్తున్నాను
► ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది... చావాలని లేదు.
► దయాకర్ పదమూడేళ్ల పసివాడు.
► అంత చిన్నవాడూ పుట్టిన రోజునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
► అతడు ఆత్మాహుతికి పాల్పడ్డ కారణమూ చిన్నదే.
► పుట్టిన రోజు కాన్కగా అమ్మను రెండు వందలడిగాడు.
► తల్లి వందే ఇచ్చింది. దయాకర్‌కు మనస్తాపం కలిగింది.
► అంతే! బలవన్మరణానికి పాల్పడ్డాడు.
► ఇంకా వికసించక ముందే తనను తానే రాల్చేసుకున్నాడు.
► తాను వెళ్లిపోయాడు... తల్లిదండ్రుల మనసును బాధపెట్టాడు.
ఆత్మహత్య చేసుకునే వారితో ఎవరైనా స్నేహితులు, బంధువులు కాసేపు ప్రేమగా పలకరిస్తే బలవన్మరణానికి పాల్పడరని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా చిన్నచిన్న కారణాలకే బలవన్మరణానికి ఒడిగడుతున్నారు. మనం అందరం ఒక ఫ్యామిలీగా ఈ విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం.
హైదరాబాద్‌కు చెందిన ఈ పసివాడే కాదు... కొన్ని పసిమొగ్గలు ఇలా చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకొని రాలిపోతున్నాయి. ఇలాంటి అనర్థాలను అరికట్టాలంటే ఏం చేయాలి? తనువూ మనసూ పూర్తి వికాసానికి తల్లిదండ్రులు ఏమార్గం అనుసరించాలి? సైకియాట్రిస్ట్‌లు చెప్పే మాట విందాం. ఎన్నో గర్భశోకాలు నివారిద్దాం. మారుతున్న సమాజంలో పిల్లలపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. వాళ్లపై అనేక రకాల ఒత్తిడులను కలిగిస్తున్నాయి. తన ఫ్రెండ్‌కు సుసాధ్యమైనది తనకు ఎందుకు కావడం లేదనే ఆలోచనలు కలిగిస్తున్నాయి. తోటివారు అనుభవించేది తన వరకూ ఎందుకు రావడం లేదు. దీన్నే పీర్‌ప్రెషర్ అంటారు. పిల్లల్లో ఆత్మహత్యలకు కారణమయ్యే ప్రధాన అంశాల్లో ఇదొకటి. ఇక ఇంటర్‌నెట్ ప్రభావం కూడా పిల్లల ఆత్మహత్యలకు ఒక ప్రధాన అంశం.
మరెన్నో కారణాలు...
పిల్లల్లో ఆత్మహత్మలకు మరెన్నో అంశాలు దోహదపడవచ్చు. వాళ్ల కోరికలూ, ఆలోచనస్థాయి కూడా చిన్నగానే అనిపించవచ్చు. కానీ వాళ్లకు అదే పెద్ద విషయం. స్నేహితుల ముందు చిన్నబోవడం ఇష్టం ఉండదు. అలాగని తాను అనుకున్నదీ నెరవేరడం లేదు. దాంతో కొద్దిపాటి ఒత్తిడికే పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు.
తమకు తెలియకుండానే తల్లిదండ్రులు కూడా...
తమకు తెలియకుండానే తల్లిదండ్రులూ వారిలో ఒత్తిడి పెంచవచ్చు. బాగా చదివే పిల్లలు క్లాస్‌లో టాపర్‌గా నిలవడం తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుంది. దాంతో వాళ్లు పిల్లలను చదువుకొమ్మని ప్రోత్సహిస్తుంటారు. తామెప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలనే తపనను తమకు తెలియకుండానే పిల్లల్లో పెంచుకుంటూ పోతారు. ఒక దశ తర్వాత తల్లిదండ్రుల ప్రమేయం లేకపోయినా పిల్లలు ఆ స్థానం కోసం తహతహలాడుతుంటారు. తమ మార్కులు ఒకింత తగ్గినా తట్టుకోలేరు. ఇలాంటివే ఇంకెన్నో కారణాలుంటాయి. సామాజిక తారతమ్యాలూ, స్నేహితుల తల్లిదండ్రుల ఆర్థిక స్థాయి, మిత్రుల కొనుగోలు శక్తి వాళ్లను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంటాయి. తెలిసీ తెలియని వయసులో కలిగే ప్రేమ భావనలూ (ఇన్‌ఫ్యాక్చుయేషన్స్) వాళ్లను ఆత్మహత్యల దిశగా ప్రేరేపించే అంశాల్లో మరో ముఖ్యమైనది.
భావోద్వేగ మేధాశక్తి అవసరం...
స్కూల్‌లో పిల్లల వికాసానికి మంచి వాతావరణం ఉండాలి. పిల్లల్లో కష్టాలను ఎదుర్కొనే శక్తిని పెంచడానికి స్కూల్ వాతావరణం బాగా తోడ్పడుతుంది. కేవలం పాఠాలనే కాదు... తాము ఎన్నో సమస్యలను అధిగమించాల్సి ఉందనే అంశాలను స్కూల్ పరోక్షంగా నేర్పిస్తుంది. ఇలాంటి మంచి శిక్షణ వల్ల పిల్లలకు సాధారణమైన చదువులతో పాటు భావోద్వేగ మేధాశక్తిని సమకూరుస్తుంది. ఈ భావోద్వేగ మేధాశక్తి (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) పిల్లల్లో ఎంత పెరిగితే, వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అంతగా తగ్గుతాయి. దీన్నే ఎమోషనల్ కోషియెంట్ (ఈక్యూ) అని కూడా అంటారు. ఇంకొందరికి చనిపోవాలనిపించడం ఒక ఫ్యాంటసీలా ఉంటుంది. ఇది కూడా కారణం కావచ్చు.
కొన్ని అలవాట్లూ కారణం కావచ్చు...
చిన్నపిల్లల్లో కొన్ని దురలవాట్లు సైతం ఆత్మహత్యలకు కారణం కావచ్చు. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) తీసుకోవడం వంటి అంశాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణం. డ్రగ్స్‌లో ఉన్నప్పుడు విచక్షణ కోల్పవడం, దుందుడుకు చర్యలకు పాల్పడటం వంటివి ఎక్కువ. సాధారణ పిల్లల్లో కంటే ఈ దురలవాటుకు బానిసలయ్యే వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. పైగా ఆత్మహత్య భావనకు బీజం పడేది చిన్నతనంలోనే.
కొన్ని మానసిక సమస్యలు సైతం...
సాధారణంగా కొన్ని మానసిక సమస్యలు సైతం పిల్లలను ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు. ఉదా: డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్, బైపోలార్ డిజార్డర్, వ్యక్తిత్వ లోపాలు (పర్సనాలిటీ డిజార్డర్స్), ప్రవర్తనారుగ్మతలు (కాండక్ట్ డిజార్డర్స్) వంటి మానసిక సమస్యలున్నవారిలోనూ ఆత్మహత్యలు ఎక్కువ.
ఇవీ కొన్ని గుర్తులు...
పిల్లల్లో కనిపించే కొన్ని సూచనలను గుర్తిస్తే వాళ్ల ఆత్మహత్యలను నివారించడమూ తేలికవుతుందంటున్నారు మానసిక నిపుణులు. అవి... తరచూ ఏడుస్తూ ఉండటం చిరాకు పడుతూ ఉండటం ఏదో కోల్పోయినట్లుగా ఉండటం ఆత్మన్యూనత భావన బరువు తగ్గడం / పెరగడం ఆకలి తగ్గడం నిద్రతగ్గడం లేక పెరగడం బలహీనంగా అనిపించడం అలసట ఏకాగ్రత లేకపోవడం. కొన్ని డిప్రెషన్ సూచనలు శారీరక లక్షణాలతోనూ వ్యక్తం కావచ్చు... అవి కడుపునొప్పి, తలనొప్పి, తలతిరగడం వంటివి. వీటిని ‘మాస్క్ డిప్రెషన్’ అని కూడా అంటారు. అందుకే తల్లిదండ్రులు వాళ్లు చేసే చిన్నపాటి ఫిర్యాదునూ తేలికగా తీసుకోవద్దు. ప్రతి అంశాన్నీ వాళ్లతో మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ సానుకూలత ప్రదర్శించాలి.
పసి మనసులపై చెరగని ముద్ర...
పెద్దలు అనే మాటలు పసి మనస్సులపై మరచిపోలేని ముద్రవేస్తాయి. అందుకే వాళ్లను ఏదైనా అనడానికి ముందు పెద్దలు విచక్షణతో ఆలోచించాలి. వాళ్లు ఏదైనా తప్పు చేసినట్లయితే అందుకు చిన్నారులను దూషించకూడదు. వారు చేసిన పని ఎంత చెడ్డదో, ఎలా సరైనది కాదో చెప్పాలి. అంతే తప్ప... ‘నువ్వు చవటవు, చేతకానివాడివి / చెడ్డవాడివి / పనికిరాని వాడివి ’ లాంటి మాటలను వాడకూడదు. పిల్లల ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని మంద లించే సమయంలో వారి దుష్ర్పవర్తన వల్ల ఎంతమందికి ఎంత ఇబ్బంది / నష్టం కలుగుతుందో వివరించాలి. అంతేకాదు... తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన సమయా న్ని ఇవ్వాలి. వాళ్ల స్నేహితులతో కలిగిన ఇబ్బందులు, స్కూల్లో అనుభవాలూ షేర్ చేసుకోవాలి. పిల్లల మానసిక సంఘర్షణను తల్లిదండ్రులు తప్పక పంచుకోవాలి. అవి పంచుకోగల తొలి నేస్తాలు తల్లిదండ్రులేననే భరోసా కలిగించాలి.
మన దగ్గరే ఎక్కువ...
మన దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ముఫ్ఫయి ఏళ్లలోపు వాళ్లు ఆత్మహత్యలకు తలపెట్టడం అనేది మన దేశంలోనే ఎక్కువని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఇక వీళ్లలోనూ పదకొండు నుంచి పద్దెనిమిదేళ్ల వారిలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వెల్లూరులోని ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో దక్షిణ భారతదేశంలో 11 నుంచి 18 ఏళ్ల పిల్లల ఆత్మహత్యలు ఎక్కువని తేలింది.
హృదయం చేసే ఆక్రందనే ఆత్మహత్య...
ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే... వాళ్లు సహాయం కోసం అర్ధిస్తున్నారని అర్థం. తమకు సాయం కావాలంటూ పరోక్షంగా అభ్యర్థిస్తున్నారని భావించాలి. తమకు చేయూత ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని అనుకోవాలి. అందుకే ఎవరైనా ఆత్మహత్య గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటే, అందునా వారు పసిపిల్లలు లేదా టీనేజ్ పిల్లలైతే తప్పనిసరిగా వాళ్ల వైపు దృష్టిసారించాలి. ఆ మాటలను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. తప్పక క్వాలిటీ సమయాన్ని కేటాయించాలి. ఆ హృదయ ఆక్రందనలు వింటే ఆత్మాహుతులు తగ్గుతాయి. పసిమొగ్గలు వికసిస్తాయి.
ఒక ‘చిత్ర’కారణం...
ఇండోర్‌కు చెందిన ధర్మేంద్ర కుష్వహా అనే ఆ అబ్బాయికి సల్మాన్ సినిమాలంటే పిచ్చి. అతడి సినిమా విడుదలైన రోజున అక్కడి అనుప్ టాకిస్‌కు వెళ్లాడు. టిక్కెట్టు దొరకలేదు. తనకు ఇవ్వాల్సిందేనంటూ థియేటర్ మేనేజర్‌తో గొడవకు దిగాడు. టిక్కెట్లు ఇవ్వలేనన్నాడు థియేటర్ మేనేజర్. అంతే ఆ చిన్నారి ప్రాణాలు తీసుకున్నాడు.
మరో విషాదాంతం
ఆగ్రాకు చెందిన గీత అనే బాలిక తనకు ఇష్టమైన సీరియల్ చూడాలనుకుంది. తనకు టీవీ రిమోట్ ఇవ్వాల్సిందిగా సోదరుడు రాహుల్‌ని కోరింది. అతడు ఇవ్వలేదు. తనకు ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ వస్తోంది కాబట్టి ఇవ్వనన్నాడు. దాంతో మనస్తాపం చెందిన గీత ఆత్మహత్యకు పాల్పడింది.
పది కారణాలు...
1. ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి రావడం
2. తల్లిదండ్రుల దగ్గర లేకపోవడం
3. లైంగికంగా/శారీరకంగా హింసకు గురికావడం
4. కుటుంబ కలహాలు
5. తల్లిదండ్రులలో మానసిక సమస్యలు ఉండటం
6. తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై తగిన శ్రద్ధ చూపకపోవడం
7. ఒంటరితనం
8. శారీరక సమస్యలు
9. స్నేహితుల మధ్య గొడవలు
10. హింస. అయితే ఈ అంశాలన్నీ అందరి పిల్లలపైనా ఒకేలా ప్రభావం చూపవు. కొందరిలో పై అంశాలను తట్టుకొని మళ్లీ మునపటిలా మారే శక్తి (రెజిలియెన్స్) ఎక్కువ. మరికొందరు ఇలా భరించలేరు.
మెదడు స్రావాలూ కారణమే...
మెదడులో స్రవించే అత్యంత ప్రధానమైన రసాయనాల్లో సెరిటోనిన్ ఒకటి. మితిమీరి దుడుకుదనం ప్రదర్శించే పిల్లల్లో దీని స్రావాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. విపరీతమైన తొందరపాటు, తమను తాము గాయపరుచుకునే ధోరణి వంటి వారిలో దీని స్రావాలు తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడ్డవారిలో ఈ సెరిటోనిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.