ఘర్షణెందుకురా మగడా అంటే...?
ఉత్త(మ)పురుష
మావారికి నాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం అంటే చాలా సరదా. నాకేమో ఇంట్లో ప్రశాంతత ఇష్టం. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు... దాంట్లోంచి ఏదో ఒక పాయింట్‌ను పట్టుకుని అదేపనిగా వాదిస్తుంటారాయన. ఆయన వాదనలెలా ఉంటాయంటే... నేనోరోజు పప్పు వండుతాను. ఆరోజు చికెన్ ఎందుకు చేయలేదని గొడవ. ఇవ్వాళ్ల శనివారం కదా అందుకే వండలేదంటాను నేను.
అప్పుడు స్పీచ్ మొదలు... ‘‘నువ్వసలు జీవహింసే చేయదలచుకోలేదనుకో. ఇక చికెన్ తినడం పూర్తిగా మానెయ్. అంతేగానీ... శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి, ఆ తర్వాతి రోజుల్లో తింటూ ఉంటే ఏం లాభం? పైగా నువ్వు ఆ ఒక్క రోజూ వండనంత మాత్రాన నిన్ను కోడిజనబాంధవురాలని ఎవరూ అనరు. అంతరించిపోతున్న కోడి జాతికి నువ్వు చేసిన సేవలకు నీకెవరూ పక్షివిభూషణ, పక్షిభూషణ, పక్షిరత్న లాంటి బిరుదేమీ ఇవ్వరు. కాబట్టి ఇలాంటివేవీ పెట్టుకోకు. ఇకనుంచి శనివారమైనా కోడి వండాల్సిందే’’ అంటూ లెక్చర్ ఇస్తారు.
అసలు ఆయనకు ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. ఆయనకు తినాలని ఉంటే శనివారం మాత్రం నేను వండకుండా ఉంటానా? ‘‘ఇవ్వాళ్ల ఏం తింటారు మహానుభావా’’... అని నేను అడుగుతూనే ఉంటాను. ఓ పట్టాన జవాబివ్వరు. ఇక వంటకు ఆలస్యం అయిపోతోందంటూ హడావుడిగా ఏదో చేసేస్తాను. ఒకవేళ ఆయనకు నిజంగానే కోడి తినాలని ఉందే అనుకుందాం. మార్కెట్‌కు వెళ్లి చికెన్ తెచ్చి ఇవ్వవచ్చు కదా. అదేం చేయరు. కానీ... భోజనం తయారు అని నేననగానే ఆయనా తయారు... మళ్లీ గొడవకూ, ఘర్షణకు.
ఆయన పెట్టే ఈ ఆరళ్లూ... ఈ అల్లర్లూ తట్టుకోలేక ఒక రోజున గట్టిగానే నిలదీశా. అలాంటి రియాక్షన్ నా నుంచి ఎదురు చూళ్లేదాయన. అందుకే కాస్త దెబ్బతిన్నట్టు చూశారు. కాస్త దార్లోకి వస్తూ వస్తూనే మళ్లీ ఎంత చెడ్డా ఆ పురుషాహంకారం కాస్త గాడి తప్పిస్తుంటుంది. ఆ పురుషాధిక్య బుద్ధి ఎక్కడికి పోతుందీ? అందుకే దిగి వస్తూ కూడా తన మాటల్లో కాస్త సైన్సూ, రొమాన్సూ కలగలిపి చెప్పారు.
‘‘ఏవోయ్... తరచు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరెందుకూ, ఎప్పుడూ ఏదో ఘర్షణ లేకపోతే మీకు తోచదా?... గొడవ లేకుండా సంసార పడవ నడవదా అంటుంటావ్ కదా. ఎడ్డెమంటే తెడ్డెమంటూ అడ్డు వేస్తున్నామనుకో. అంటే ఏమిటన్నమాట? మన మధ్య ఘర్షణ ఉంటుందన్న మాట. ఘర్షణ అంటే మరేమిటో కాదు... ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్లనే గచ్చు మీద నడుస్తున్నా అడుగు కుదురుగా పడుతుంది. నడక చెదరకుండా సాగుతుంది.
ఆ ఫ్రిక్షనే లేదనుకో. ఆ నడక గచ్చు మీద కాకుండా, రొచ్చులోన నడచినట్టయి, జర్రుమంటూ జారిపడతాం. కాబట్టి సంసారంలో నిత్యం కావాల్సిందే ‘ఘర్షణ’. అందుకే నిత్యం నీతో నా సంఘర్షణ’’ అంటూ ముగించారాయన. ఈ పురుషపుంగవులున్నారే! రొచ్చుమీద ఫ్రిక్షన్ తగ్గి కిందపడ్డా... తమ కాలుపైనే, పైపైనే అంటారు. ఏం మగాళ్లో ఏమో?!
- వై!