అమెరికా, బ్రిటన్ అంటారు కానీ..పొదుపులో మనమే బెస్ట్
మనిషికి పొదుపు చాలా ముఖ్యం. అలాగని అన్ని దేశాల్లోనూ ఈ సూత్రాన్ని పాటిస్తారా? ఒకవేళ పొదుపు చేయాలనుకుంటే ఎలా చేస్తారు?
అత్యంత సంపన్న దేశమైనప్పటికీ.. అమెరికన్లకు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేయటం అలవాటు. ఈ విషయాన్ని పలు సర్వేలు స్పష్టంగా చెప్పాయి. ఇటీవలి సర్వేను చూస్తే... 28% మంది అమెరికన్ కుటుంబాలకు అస్సలు పొదుపన్నదే తెలీదు. 60% మంది దగ్గర అత్యవసర పరిస్థితులకు సరిపడేంత డబ్బు లేదు. ఇక దాచుకునే వారి విషయానికొస్తే.. తమ సంపాదనలో కేవలం మూడు శాతమే పొదుపు చేస్తారట. ఈ విషయంలో బ్రిటిషర్లూ ఏమీ తీసిపోలేదు. ఏకంగా 70% మంది బ్రిటిషర్ల దగ్గర అత్యవసర పరిస్థితుల కోసం పైసా కూడా ఉండదట. పొదుపు విషయానికొస్తే.. ఆదాయంలో ఆరు శాతమే పొదుపు చేస్తారు వీరు.
ఈ విషయంలో ఆసియా వాసులే బెటర్. చైనా వారు ఏకంగా ఆదాయంలో 50% పొదుపు చేస్తుంటారట. మన భారతీయులు వారిలో సగభాగం మేర... అంటే దాదాపు 28 శాతం పొదుపు చేస్తున్నారని అంచనా.
అసలింతకీ పొదుపు ఎందుకు..
మొట్టమొదటిగా అత్యవసరాల కోసం. ఇంట్లో వాటర్ హీటరు నుంచి మిక్సీ, కుక్కర్, టీ వీల దాకా ఏదైనా ఎప్పుడైనా మొరాయించొచ్చు. రిపేరు చేయించడమో లేదా కొత్తది కొంటేనో గానీ పని జరగదు. అడపా దడపా చిన్న చిన్న అనారోగ్యాలు, జ్వరాలు అంటూ ఆస్పత్రికి తిరగాల్సి రావొచ్చు. ఇంటి రిపేర్లతో పాటు ఇలాంటి అత్యవసరాల కోసం పొదుపు మొత్తాలు ఉపయోగపడతాయి.
రెండోది... ఎప్పుడైనా కుటుంబ సమేతంగా సరదాగా హాలిడే గడిపేందుకు ఎటైనా వెళ్లాలనుకుంటే బోలెడంత ఖర్చు. కాబట్టి ముందు నుంచే ఇలాంటి వాటి కోసం కొంత కొంతగా దాచిపెడితే పర్సుపై భారం గురించి ఆలోచించకుండా సెలవులు ఎంజాయ్ చేయొచ్చు.
నిశ్చింతగా రిటైర్ కావాలన్నా పొదుపు చేయాల్సిందే.
యువతకు డబ్బు దాచిపెట్టుకోమంటూ వృద్ధులు నూరి పోస్తుంటారు. అది తప్పుడు సలహా. ప్రతి రూపాయిని దాచిపెట్టకండి. మిమ్మల్ని మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు నలభై ఏళ్లు వచ్చేదాకా నేనొక్క పైసా కూడా దాచిపెట్టలేదు.
- హెన్రీ ఫోర్డ్