పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం.
గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా...
పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..!
వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే
దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి.
గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు.
దుస్తులకు తగిన ఎంపిక:
డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి
ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి
ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు
టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి
కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి
పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి
జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి.
సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి
లాకెట్‌లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది
చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి.
పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది.
తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్‌నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్.
తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి.
తీగ చివరల్లో రౌండ్‌నోస్ ప్లైర్‌తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి.
ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు.
ఎప్పటికీ...:
సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే...
ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి.
పెర్‌ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు.
సుధా రెడ్డి
ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్
www.facebook.com/jewelpatterns
మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల