అర్జెంటీనా ‘దేవుడు’
అంతా తొండి... చేతితో గోల్ చేశాడు... క్రీడా స్ఫూర్తి లేదు... ఓ ఆటగాడి గురించి ఇలాంటి విమర్శలు మొదలైన నాలుగు నిమిషాలకు... అందరి నోళ్లు మూయించాలంటే... అదీ ఫుట్‌బాల్ లాంటి క్రీడలో నాలుగు నిమిషాల్లో రెండు గోల్స్ చేయాలంటే... కచ్చితంగా అతను ‘మాయ’ చేయాలి లేదా దేవుడై ఉండాలి. అందుకే మారడోనా అర్జెంటీనాకు దేవుడయ్యాడు.
1986 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. రెండో అర్ధభాగంలో ఆరో నిమిషంలోనే మారడోనా గోల్ చేసి అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. విమర్శల కోసం సిద్ధంగా ఉండే ఇంగ్లండ్ మీడియా అంతెత్తున లేచింది. తను చేతితో బంతిని నెట్టాడని అది గోల్ కాదని వాదన మొదలు పెట్టింది. అయితే మైదానంలో మారడోనాకు ఇదేమీ తెలియదు. మరో నాలుగు నిమిషాలు గడిచాయి.
60 మీటర్ల దూరం నుంచి బంతిని డ్రిబుల్ చేసుకుంటూ... ఐదుగురు ఇంగ్లండ్ డిఫెండర్లను బోల్తా కొట్టించి ఎవరూ ఊహించని రీతిలో మారడోనా మరో గోల్ కొట్టాడు. ఈ గోల్‌ను చూసిన వాళ్లెవరూ ఆ తర్వాత తన నైపుణ్యం గురించి జీవితంలో మాట్లాడలేదు. ఇప్పటికీ ఈ శతాబ్దానికి దానినే అత్యుత్తమ గోల్‌గా పరిగణిస్తారు. అంత అద్భుతమైన ఆటగాడు మారడోనా. అందుకే చేతితో చేశాడనే గోల్‌ను కూడా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ అని పిలుస్తారు.
పరిచయం అక్కరలేదు
డీగో మారడోనా... పరిచయం అక్కర్లేని పేరు. అర్జెంటీనాలో అతనో ఆరాధ్య దైవం. తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సృష్టించుకున్న దిగ్గజం.. 17 ఏళ్ల పాటు అర్జెంటీనా జాతీయ జట్టుకు సేవలందించడమే కాకుండా కెప్టెన్‌గా... కోచ్‌గా... మేనేజర్‌గా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన ఆల్‌టైమ్ గ్రేట్. పీలేతో కలిసి 20వ శతాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన ఘనత డీగోకే దక్కింది.
ఎనిమిదేళ్లకే చిచ్చర పిడుగు
అర్జెంటీనాలో ఫుట్‌బాల్ అంటే పిచ్చి. తమది పేద కుటుంబమే అయినా పట్టుదలగా ఆడాడు. ఎనిమిదేళ్లకే సాకర్‌లో చిచ్చరపిడుగుగా మారిపోయాడు. ఆ వయసులోనే అద్భుతాలు సృష్టించిన మారడోనా ప్రతిభను ఒడిసి పట్టింది ఫ్రాన్సికో కొర్నియో. ఆయన గనక మారడోనా ప్రతిభను గుర్తించకపోతే ప్రపంచానికి ఓ దిగ్గజం కనిపించేవాడు కాదేమో.
కొర్నియా ఆధ్వర్యంలోనే తన ఆట తీరుకు మరింత మెరుగులు దిద్దుకున్న మారడోనా జూనియర్ విభాగంలో సత్తా చాటాడు. తద్వారా 1977లో 17 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1994 వరకు జాతీయ జట్టుకు సేవలందించాడు. 1982, 86, 90, 94 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నాడు. కెప్టెన్‌గా డీగో మారడోనా తానేంటో నిరూపించుకున్నాడు. 1986లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపాడు. గోల్డెన్ బాల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాతి ప్రపంచకప్ (1990)లో అర్జెంటీనాకు కొద్దిలో టైటిల్ చేజారింది.
1982 ప్రపంచకప్ తర్వాత మారడోనాకు బార్సిలోనా క్లబ్ 7.6 మిలియన్ డాలర్లు ఇచ్చింది. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఫుట్‌బాల్ ద్వారా ఇంత డబ్బు సంపాదించవచ్చని ప్రపంచానికి తెలిసింది అప్పుడే.
డ్రగ్స్‌కు బానిసై... తర్వాత బయటపడి...
తన ఆటతీరుతో మారడోనా ఎంతగా ప్రాచుర్యం పొందాడో... అంతకంటే ఎక్కువగానే వివాదాల్లో, వార్తల్లో నిలిచాడు. సాకర్‌తో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న డీగో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలోనే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కొకైన్‌కు అలవాటుపడి 1991లో డ్రగ్ పరీక్షలో విఫలమయ్యాడు. ఫలితంగా 15 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు.
ఇక 1994 ఫిఫా ప్రపంచకప్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఎపిడ్రిన్‌ను తీసుకోవడంతో అమెరికా నుంచి స్వదేశానికి బలవంతంగా పంపారు. అలా తెరమరుగైన మారడోనా 2005లో డ్రగ్స్ నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోని అర్జెంటీనా 2010 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఏమైనా ఆటగాడిగా, కోచ్‌గా కూడా ఫుట్‌బాల్ ప్రపంచంలో మారడోనాది ప్రత్యేక ముద్ర. ఆట బతికున్నంతకాలం అతని పేరూ బతికే ఉంటుంది.
నేను మరో మిలియన్ సంవత్సరాల పాటు సాకర్ ఆడినా మారడోనా దరిదాపుల్లోకి కూడా రాలేను. ఆయన చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు.
- అర్జెంటీనా స్టార్ మెస్సీ