ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే!
ఒక్కసారి కాదు... వందసార్లు చూసినా... బాషా పంచ్‌లు... మళ్లీ మళ్లీ పిడికిళ్లు బిగించేలా చేస్తూనే ఉంటాయి. చాలా కాలం తరువాత... ‘బాషా’ వచ్చాడు తెర పైకి మళ్లీ. కొన్ని వేడిలోనే బాగుంటాయి. కొన్ని చల్లబడిన తరువాత కూడా మునపటి కంటే ఎక్కువ వేడితో, వాడితో బాగుంటాయి. కొన్ని రెండిట్లోనో మహా మహా బాగుంటాయి.
బాషా... వేడిలోనే కాదు... ఆ వేడి తగ్గిన కాలంలోనూ మళ్లీ వేడెక్కిస్తాడు. బాషాను చూసి చాలా కాలమే అయ్యుండవచ్చు. కానీ ఇప్పటికీ చూస్తే... ఇప్పుడే చూసినట్లు ఉంటుంది.
‘మాణిక్యం’ క్యారెక్టర్ గుండెలో తడిని తడుముతున్నట్లే ఉంటుంది. బాషా క్యారెక్టర్ కళ్లలో అగ్నులను ఉత్తేజితం చేస్తున్నట్లుగానే ఉంటుంది. ‘‘నేను మాణిక్యమైపోవాలి’’ అనుకుంటాం. మాణిక్యాన్ని బంగారం చేసింది కుటుంబం మీద అతని ప్రేమ. ఆ ప్రేమను మనకు తెలియకుండానే సొంతం చేసుకుంటాం. ఉన్నట్టుండి మనం మాణిక్యాలమై పోతాం. కుటుంబాన్ని ఇంకా... ఇంకా ప్రేమిస్తాం.
తన చెల్లిని వేధించినవాడిని చావబాదుతుంటే... మనం మన సీట్లో నుంచి లేచి మాణిక్యంలో ఐక్యమైపోతాం. ఆ గూండాను-‘‘రేయ్... అంటోని గురించి నా దగ్గర చెప్పొద్దు’’ అని హెచ్చరిస్తాం. అప్పటికీ మన ఆవేశం చల్లారదు. ‘‘నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు..’’ అని కాలరు పట్టుకొని వాడి చెంప చెళ్లుమనిపిస్తాం.
అంతేనా... మాణిక్యంతో పాటు బాంబే వెళ్లిపోతాం. బాషా అయిపోతాం.
బాషాలా చిటికేస్తాం.
గొంతు పెంచి-
‘‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినపట్లే’’ అని గర్జిస్తాం. గాండ్రిస్తాం. చూస్తూ ఉండగానే బాషా మనల్ని ఆవహిస్తాడు. పేదోడి జోలికి వచ్చే వాడి పీక నొక్కేస్తాం. పేదోడి కడుపు కొట్టే రాబందులను నల్లుల్లా నలిపేస్తాం.
ఆవేశం
ఆవేశం...
ఒంటి నిండా ఆవేశం...
అమ్మ తల్లి పూనినట్లు... బాషా మనల్ని పూనుతాడు.
వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చిన గుండాను మట్టికరిపించి-
‘‘నాకు పని పెట్టొద్దు. నిజం చెప్పు... తెలుసుగా...
ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’’ అని ఊగిపోతాం.
బాషా మనల్ని పూనాడు కదా... ఇక భయమెందుకు? డాన్ ఆంటోని అయితేనేం... వాడి తాత అయితేనేం?
‘‘రేయ్ నువ్వు చావాలి. లేదా నేను చావాలి.
నీ వాళ్లు చావాలి. లేదా నా వాళ్లు చావాలి.
ప్రజలు కాదు... అమాయక ప్రజలు కాదు చావాల్సింది. ఇప్పుడు తెలిసింది... నువ్వు పిరికి వెధవ్వి. ఒక పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ బాషాకు... మాణిక్ బాషాకు నచ్చదు. ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తా. ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే!
ఒక్క డైలాగ్... ఒకే ఒక్క డైలాగు... మనల్ని ఏకం చేస్తుంది... మన ధైర్యాన్ని ఏకం చేస్తుంది. మన అడుగుల్ని ఏకం చేస్తుంది. గుండెలో రగిలే రణధ్వనిని ఏకం చేస్తుంది.
కొందరు భావోద్వేగాలే మనుషులైనట్లు ఉంటారు. కొందరు అవి మచ్చుకైనా లేనట్లు ఉంటారు. అంతమాత్రాన... వాళ్లు రాతిగోడలు కాదు. రాతి గోడలో కూడా తేమ ఉంటుందని గంభీరంగా నిరూపించే వాళ్లు.
మనలో భావోద్వేగాల మాణిక్యాలు ఉండొచ్చు.
దెబ్బకు దెబ్బ తీసే మాణిక్ బాషాలు ఉండొచ్చు.
‘‘మంచి వాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు’’
అది బాషా చెప్పిన భాష్యమే కాదు... నిజ జీవిత సత్యం అని మన జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు సజీవంగా చెబుతుంటాయి. ‘‘ చెడ్డవాడు మొదట సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు’’ ఓడిపోయిన చెడ్డ వాళ్లు మన ముందు దీనంగా క్యూ కడుతూనే ఉంటారు.
బాషా ఒక్కడే-
కానీ ఎప్పుడు వచ్చినా వందలుగా వస్తాడు.
అందరినీ .... పంచ్ పవర్‌తో ఏకం చేస్తూనే ఉంటాడు. బాషా అంటే ఏకవచనం కాదు... అందరిని ఏకం చేసే సర్వనామం! సింహనాదం!!