నీట మునిగిన సత్యం
గ్రాఫిక్స్
ఎడమ వైపు ఫొటోలో ఉన్న అమ్మాయి ‘తేజ్’ న్యూస్ చానల్ యాంకర్. కుడివైపు ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ అదే యాంకర్. అయితే మొదటి ఫొటో ఒరిజినల్. రెండోది ఫేక్. చెన్నై వరదల్లో నీటి మట్టం క్షణక్షణానికీ పెరిగి పోతున్న విషయాన్ని ‘లైవ్’లో చెప్పడానికి ఈ యాంకర్ నీళ్లలోకి దిగారు. రెండో ఫొటోలో మాత్రం యాంకర్ బొమ్మ మాత్రమే నీళ్లలోకి దిగింది!
తేజ్ న్యూజ్ చానెల్ వాళ్లు స్టూడియోలో ఉండి చేసిన గ్రాఫిక్స్ గిమ్మిక్ ఇది. అర్థమైన వాళ్లకు అయింది. ‘మరీ ఇలాంటప్పుడు కూడానా!’ అని ఆవేదన చెందారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా చెన్నైని వానలు, వరదలు ముంచెత్తాయి. 200 మందికి పైగా మరణించారు. మీడియా నిద్రమాని మరీ వార్తల్ని అందించింది.
మరింత ప్రాణ నష్టం జరక్కుండా, పరిస్థితి విషమించకుండా ప్రజలకు, ప్రభుత్వశాఖలకు అప్‌డేట్స్ ఇచ్చింది. ఇలా వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టే న్యూస్ ఛానెల్స్‌ను అభినందించాల్సిందే. కానీ ఆ అభినందనల కోసం గ్రాఫిక్స్‌తో గిమ్మిక్స్ చేసే ఛానెళ్లను ఏమనుకోవాలి? పైగా దీనిపై ఆ చానల్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.