సినిమా-వీఎఫ్‌ఎక్స్ ఈ రెండింటిని విడివిడిగా చూడలేం. గ్రాఫిక్స్‌తో తెరపై వండర్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక్కోసారి మితిమీరిన గ్రాఫిక్స్ కూడా సినిమాకు పనిచేయవు. ఆదిపురుష్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బ్రహ్మస్త్ర సినిమాలోనూ గ్రాఫిక్స్ డామినేట్ చేశాయి. ఈ క్రమంలో అసలు సినిమా సక్సెస్‌లో గ్రాఫిక్స్ ప్రాముఖ్యత ఏంటి? భారీ బడ్జెట్ సినిమా అంటే హై లెవల్‌లో గ్రాఫిక్స్ ఉండాల్సిందేనా? బాక్సాఫీస్ వద్ద గ్రాఫిక్స్ క్రియేట్ చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుందాం..
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత ఊహించని రీతిలో విమర్శల పాలైందీ సినిమా. ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఆ గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అస్సలు బాగోలేవని, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీస్తున్నప్పుడు ఇలా నాసీరకమైన గ్రాఫిక్స్ ఏంటని నెటిజన్లు దారుణంగా విమర్శించారు. దీంతో వెనక్కి తగ్గిన మేకర్స్ మళ్లీ రీ షూట్స్ చేసి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్‌తో కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి వచ్చిన మరో మైథాలాజికల్ సినిమా హనుమాన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలె విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులోని వీఎఫ్‌ఎక్స్ సైతం విజువల్ వండర్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సినిమాకు పెద్ద హీరో, బడ్జెట్ కంటే కంటెంట్, స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇక మరో భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మస్త్ర. రణ్‌బీర్,ఆలియా హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా బాలీవుడ్ మినహా మిగతా భాషల్లో ఆశించినంత సక్సెస్ కాలేదు. కంటెంట్‌కి గ్రాఫిక్స్ తోడవ్వాలి కానీ గ్రాఫిక్స్‌కే కంటెంట్ వచ్చి చేరింది అన్న విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో వీఎఫ్‌క్స్‌పై ఇంత భారీగా ఖర్చుపెట్టడం సినిమా రిజల్ట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న చర్చ మొదలైంది. ఈ అంశంపై ఓ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ యజమాని రాజీవ్ చిలకా మాట్లాడతూ.. ''స్క్రిప్ట్ విషయంలో సరైన అవగాహన లేక పదేపదే మార్చుతూ దానికనుగుణంగా వీఎఫ్‌ఎక్స్ మార్చితే బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతుంది. ఆదిపురుష్ మూవీకి సంబంధించి మేకర్స్ చాలా తొందరపడ్డారు. ప్రీ-ప్రొడక్షన్‌కి సరైన సమయం ఇవ్వలేదని భావిస్తున్నా. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి. అయితే భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదని గుర్తుపెట్టుకోవాలి.
ఈ మధ్య కాలంలో ఆర్‌ఆర్‌ఆర్, తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, రన్‌వే వంటి సినిమాలు భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. వీఎఫ్‌ఎక్స్ కూడా బాగానే వాడారు. కానీ కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయ్యింది కాబట్టి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. కానీ వాళ్లలాగే మనమూ గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమా తీద్దాం అనుకుంటే ఒక్కోసారి ఆదిపరుష్ లాగా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. సినిమా బడ్జెట్ ఎప్పుడూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. మేకర్స్ అనుకున్నదానికంటే ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ అవ్వొచ్చు.. లేదా తక్కువ అవ్వొచ్చు. బడ్జెట అంటే కంటెంట్ అన్నది చాలా ముఖ్యం అని అందరూ తెలుసుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment