దుష్కర్మలను నివారించే సుకర్మలు
ఆత్మీయం
మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం.
‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాం’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అని మొక్కి అలా చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు. కుక్కకి పాలు పోస్తే ఉద్యోగం వస్తుందని ఓ జోస్యుడు చెబుతాడు. కోతులకి ఆహారం ఇస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని మరో జోస్యంలో చెబుతారు. కారణం వారి చెడుకర్మ ఫలితాన్ని ఆ సుకర్మ నివారించడానికి, ఆ ప్రాణులకు ఈ రూపంలో ఆహారం అందడానికే.