అదితి సింగ్
అదితి సింగ్ ఎక్కడా పెద్దగా కనిపించరు. వెతుక్కోవాలి ఆమెను మనుషుల్లోకి వెళ్లి! తనకు ఇష్టం లేనిదే పార్టీ చెప్పినా వినరు. తగని పని తన పార్టీ చేసినా ఊరుకోరు. పాలిటిక్స్.. ఆమెకు స్వచ్ఛంగా ఉండాలి. పార్టీ ఏదైనా మనిషి మనిషిలా ఉండాలి.
ముందొక జోకు. తర్వాతొక క్రూయల్ జోకు.
∙∙
‘‘ఎప్పుడు తిన్నాడో ఏమో, పొద్దున చేసిన ఉప్మా కాకుండా మళ్లీ ఫ్రెష్‌గా తీస్కోనిరా’’ అంటాడు సుధతో, తనికెళ్ల భరణి.
డైనింగ్ టేబుల్ ముందుంటారు భరణి, నాగార్జున. నాగార్జునకు.. భరణి బాబాయ్. నాగార్జున పిన్ని.. సుధ.
‘‘ఎర్ర రవ్వ ఉప్మా చెయ్యనా? తెల్ల రవ్వ ఉప్మా చెయ్యనా?’’ అని మళ్లీ వచ్చి అడుగుతుంది సుధ.
‘‘ఉప్మాలా ఉండే ఉప్మా చెయ్’’ అంటాడు భరణి. (ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...)
భర్త అంగద్‌తో అదితి
ఇప్పుడు ఒక క్రూయల్ జోక్. ఊహు. దానికన్నా ముందు ఒక సత్యశోధన.
మనిషి ఎలా ఉండాలి? ఎర్రగానా, ఎత్తుగానా, బక్కగానా, బలంగానా?
నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి కారణంగా కూతురికి ఉన్న ఫాలోయింగ్ కాదు అదితికి ఉన్నది. ప్రజలతో చక్కగా మాట్లాతారు. ప్రత్యర్థులకు మాటకు మాట చెబుతారు. ప్రత్యర్థులు అవతలి పార్టీవాళ్లే అయి ఉండాలనేం లేదు ఆమెకు. తిన్నగా లేకపోతే సొంత పార్టీవాళ్లకు కూడా తను ప్రత్యర్థిగా మారిపోతారు. మనుషుల పార్టీ ఆమెది! మనిషికి కష్టం కలిగించిన వాళ్లెవరైనా, మనిషిలా ప్రవర్తించని వాళ్లెవరైనా అదితికి నచ్చరు. రాజకీయాల్లో ఈ స్వభావం పని చేస్తుందా? పని చేసే స్వభావమే రాజకీయ స్వభావం కావాలన్నది అదితి పాలసీ. పని గట్టుకుని ఆమె పాలిటిక్స్‌లోకి రాలేదు.
పని చేయాలనుకుని వచ్చారు. ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత ముస్సోరీలో. తర్వాత యూఎస్‌లోని డ్యూక్ యూనివర్సిటీలో. మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు అక్కడ. ఇండియా వచ్చాక సోషల్ వర్క్‌ను ఎంచుకున్నారు. సోషల్ వర్క్‌లో చురుగ్గా ఉండేవాళ్లకు రాజకీయాలు పట్టవు కానీ.. రాజకీయాలు అలాంటివారిని ఎంత దూరాన్నుంచయినా వెంటనే పట్టేస్తాయి. అలా పాలిటిక్స్‌లోకి వెళ్లారు.
క్రూయల్ జోక్ నుంచి పక్కకు వచ్చేశామా! లేదు. ప్రియాంక గాంధీ చేసిన ఒక పనిని క్రూయల్ జోక్ తో పోల్చింది అదితినే!
∙∙
అదితి, ప్రియాంక ఒకేపార్టీ వాళ్లు. అదితి.. ఎమ్మెల్యే మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి కూడా. ప్రియాంక తూర్పు యూపీకి పార్టీ ప్రధాన కార్యదర్శి. వలస కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది అని ప్రియాంక ప్రకటించగానే, ఆ బస్సుల జాబితాను అధికార పార్టీ బీజేపీ తెప్పించుకుని చూసింది. వాటిల్లో సగానికి పైగా కండిషన్‌లో లేని బస్సులే! 297 బస్సులు తప్పుపట్టి ఉన్నాయి. 98 ఆటో–రిక్షాలు, అంబులెన్స్ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి ఉన్నాయి! 68 వాహనాలకైతే అసలు పేపర్‌లే లేవు! ఈ విషయమే అదితికి తన సొంత పార్టీ మీద ఆగ్రహం తెప్పించింది.
ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్ జోక్ కాదా ఇది అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే క్రమశిక్షణ చర్య ఒకటి అదితిపై పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ హాజరైనందుకు అదితిని ఎమ్మెల్యేగా అనర్హురాలిని చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఆ ఫిర్యాదుపై ఇంకా ఏ నిర్ణయమూ జరగలేదు.
∙∙
ఎవరి నిర్ణయాలకూ తలొగ్గరు అదితి. అలాగే తనపై వచ్చిన ఏ నిజం కాని వార్తకూ ఆమె స్పందించకుండా ఉండరు. రాహుల్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చినప్పుడు ఆమె వెంటనే ఖండించారు. ‘‘రాహుల్‌జీ నాకు అన్నయ్య. ఆయనకు రాఖీ కూడా కట్టాను’’ అని స్పష్టంగా చెప్పి ఆ విషయంలో ఇక ఎవరి ఊహల్నీ ముందుకు వెళ్లనీయలేదు. గత ఏడాదే అదితికి అంగద్‌సింగ్‌తో వివాహం జరిగింది. ఆయన కూడా ఎమ్మెల్యేనే. అయితే పంజాబ్‌లో. సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు లేనప్పుడు ఢిల్లీనే ఈ దంపతుల ఇల్లు. అతడిదీ కాంగ్రెస్ పార్టీనే. లవ్ మ్యారేజ్ వాళ్లది. అదితి ఎక్కువగా ఉండేది మాత్రం తన నియోజకవర్గ ప్రజలతోనే.
Comments
Please login to add a commentAdd a comment