క్రికెట్.. ఓ దేశంలో మతంలా ఆరాధించే క్రీడ. మరో దేశంలో జాతీయ క్రీడ. మరికొన్ని దేశాల్లో.. అన్నింట్లో ఓ క్రీడ. క్రికెట్‌పై ప్రేమతో, ఆరాధనతో దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారు కొందరైతే.. ఈ క్రీడకున్న ఆదరణ, భారీ రెమ్యూనరేషన్ల కారణంగా ఆకర్షితులయ్యేవారు మరికొందరు. కానీ, ప్రపంచంలో తామూ ఉన్నామన్న ఉనికిని సమాజానికి చాటేందుకు, తరతరాల తమ వెనకబాటును ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు క్రికెట్ ఆడుతున్నారు.. కెన్యాలోని మసాయ్ తెగ ప్రజలు.
ప్రమాణాలకు తగినట్లుగా బ్యాట్లు లేవు.. ఖరీదైన బూట్లు లేవు. స్పాన్సర్ చేసే కార్పొరేట్ సంస్థలు లేవు.. వేసుకునేందుకు కనీసం జెర్సీలు కూడా లేవు. ఒంటిని సగం మాత్రమే కప్పివుంచే తమ సంప్రదాయ దుస్తులతో, మండుటెండలో టోపీలు కూడా పెట్టుకోకుండానే క్రికెట్ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు మసాయ్ క్రికెట్ వారియర్స్. కెన్యాలోని లైకిపియా ప్రాంతానికి చెందిన ఈ గిరిజనులు శతాబ్దాల తరబడి నాగరికతకు దూరంగా జీవనం సాగిస్తున్నారు.
ఆఫ్రికా నుంచి వలస వచ్చి కెన్యాలోని సరస్సుల లోయ ప్రాంతాల్లో స్థిరపడిన ఈ మసాయ్ తెగ ప్రజలు.. విద్యకు, వైద్యానికి కూడా నోచుకోకుండా, తమ పూర్వీకులనే అనుసరిస్తూ, అవే ఆచారాలు, అదే జీవనవిధానాన్ని అవలంబిస్తూ బతుకీడుస్తున్నారు. అయితే తమ భవిష్యత్ తరాలైనా నాగరిక ప్రపంచంతో కలిసి జీవించేలా, విద్య, ఉద్యోగావకాశాలు పొందేలా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు క్రికెట్ ఒక్కటే వారికి పరిష్కారంగా కనిపించింది.
ఈటెలు పట్టిన చేతులతో బ్యాట్లు..
క్రికెటే తమను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లగలదని నమ్మి.. చేతిలోనుంచి ఈటెల్ని పక్కనబెట్టి బ్యాట్లను పట్టుకున్నారు. తమకు తామే శిక్షణనిచ్చుకున్నారు. మసాయ్ జాతి ప్రజలు నివసించే అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ జట్లను రూపొందించుకొని వాటి మధ్య పోటీలు నిర్వహించుకున్నారు. దీంతో వారనుకున్నట్లుగానే అందరి దృష్టినీ ఆకర్షించగలిగారు.
తరాలుగా తమ జీవితాలను కమ్మేసిన చీకట్లను చీల్చగలిగారు. మసాయ్ క్రికెట్‌ను మీడియా వెలుగులోకి తెచ్చింది. ఏకంగా క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లోని నర్సరీ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘లాస్ట్ మ్యాన్ ఆఫ్ స్టాండ్స్’ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు మసాయ్ వారియర్స్‌కు అవకాశం లభించింది. గత ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 4 దాకా నిర్వహించిన ఈ టి20 టోర్నీలో పాల్గొన్న 11 అంతర్జాతీయ స్థాయి జట్లతో కలిసి మసాయ్ వారియర్స్ జట్టు ఆడింది.
ఈ టోర్నీలో మసాయ్ వారియర్స్ విజయం సాధించలేకపోయింది.. కానీ, తాము ఏ లక్ష్యంతోనైతే క్రికెట్ బ్యాట్లు చేతబట్టారో అది నెరవేరింది. తామంటూ ఉన్నామని ప్రపంచం గుర్తించేలా చేసింది. వారి జీవన స్థితిగతులపై ఓ ఔత్సాహికుడు డాక్యుమెంటరీ రూపొందించి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. ఇకపై క్రికెట్‌లో వారు ఏ స్థాయికి ఎదగగలరన్నది పక్కనబెడితే వారి తదుపరి లక్ష్యం.. తమ ప్రాంతాల్లో పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం అందాలి. తామూ సామాజికంగా ఎదగాలి.. క్రికెట్ ద్వారానే అది సాధ్యం కావాలన్నదే మసాయ్ ప్రజల ఆకాంక్ష. వారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
చీకట్లను చీల్చిన ‘క్రికెట్’
Published Fri, Aug 8 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement