యాపారం | E - com Ops preparation | Sakshi
Sakshi News home page

యాపారం

Published Wed, Jul 2 2014 10:44 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

యాపారం - Sakshi

యాపారం

చెట్టూ పుట్టా, వ్యర్ధం, వ్యసనం, చిన్నా, పెద్దా దేన్నైనా ఎకనామిక్ ఐతో చూడటం మనిషికి ఎప్పట్నుంచో అలవాటు. ఇప్పుడా కన్ను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్స్ మీద పడింది. మొదట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌లాంటి ఇంటర్‌ఫేస్‌లతో పాటు చిన్నా చితకా ఆప్స్ ఫోన్‌లతో నిక్షిప్తం అయి వచ్చేవి. కాని ఇప్పుడు ఆప్స్ ఉండే ఓఎస్‌కే ఆదరణ లభిస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. 19 బిలియన్స్‌లకి అమ్ముడు పోయినే వాట్సాపే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఆ ఊపులో మన నగర విద్యార్థులు కూడా ఇ-కామ్ ఆప్స్ తయారీలో చొరవ చూపించి విజయవంతమయ్యారు. అందులో విజయవంతమైన ఓ ఆప్ గురించి...
 
‘‘..... ఖార్ఖానా బస్టాప్ వచ్చి, మాయా బజార్ హోటల్ గల్లీలో నాలుగో రైట్ నుండి మూడో లెఫ్ట్, పచ్చ రంగు గేటు, దాని మీద ఏపుగా మనీ ప్లాంట్ పెరిగి ఉంటుంది. అదే మా ఇల్లు’’ ఇలా తన అడ్రస్ చెప్పాడొకడు విదేశాల నుండి వచ్చిన తన మిత్రుడికి. ఆ అడ్రస్ ఆనవాళ్లను పట్టుకొని, ఆ మనీ ప్లాంట్ మొదళ్లని చేరుకునే సరికి ఆ విదేశీ ఆసామి వీసా కాస్తా ఆవిరైపోతుంది. ఇలా ఈ తంటాలేవి చెప్పినా అడ్రస్‌ని అర్థం చేసుకుని, అవతల వ్యక్తికి డెరైక్షన్‌తో కూడిన మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఆలోచనే 2011లో ఆదిత్యా పుచి అనే వ్యక్తికి వచ్చింది. అలా ఏర్పడిందే ఈ జిప్పర్ అనే ఆప్.
 
‘‘స్వతహాగా వైద్యులు అయిన మా నాన్నగారు పేషెంట్‌లకు మా క్లినిక్‌కి దారి చెబుతుండగా పడ్డ ప్రయాసల నుండి పుట్టింది ఈ జిప్పర్ ఐడియా’’ అని అంటారు 34 ఏళ్ల ఆప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆదిత్య.  హైదరాబాద్ వాస్తవ్యులైన ఆదిత్య స్కూలింగ్ అంతా హెచ్.పి.ఎస్.లోను తరువాత ఇంజినీరింగ్‌ని సి.బి.ఐ.టి.లో పూర్తి చేశారు. 2002లో పై చదువులకు యూఎస్ వెళ్లి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసి సిలికాన్ వ్యాలీలో ఎక్స్‌పోనెన్షియల్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 7 ఏళ్లకి కంపెనీ పనుల మీద తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు ఆదిత్య.
 
‘‘మన దేశానికి, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా కాలనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో. ఇళ్లు - రోడ్ల నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉండి, ఒకసారి తిరిగి చూస్తే లే అవుట్ అంతా గుర్తుండిపోతుంది. కాని మన దేశంలో రోడ్డు వ్యవస్థ సంక్లిష్టంగా, తిరిగే దూరం తక్కువే ఉన్నా చిన్న చిన్న సందులు, మలుపుల వల్ల ఎంతో కన్‌ఫ్యూజన్.’’ ఇది తిరిగి భారత దేశానికి వచ్చిన ఆదిత్యా మదిలో మెదిలిన ఆలోచన. ఈ ఆలోచనతో 2011లో ఆప్ పనులు మొదలు పెట్టాడు. అప్పటికే ‘మింట్ మీడియా’ అనే ఆన్‌లైన్ సైట్ నడుపుతున్న అనుభవంతో ఆప్ రూపకల్పన మొదలైంది. కోటి రూపాయల బడ్జెట్‌తో తన కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులతో జిప్పర్‌ని రూపొందించి 2013 జూన్‌న విడుదల చేశారు.
 
ఏం చేస్తుందీ జిప్పర్: ఈ ఆప్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కాని, ఏదైనా ప్రదేశం తాలూకు లొకేషన్‌కి ఒక జిప్పర్ కోడ్‌ని క్రియేట్ చేయొచ్చు. తరువాత మీ అడ్రస్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు, ఆ వ్యక్తికి మీ జిప్పర్ కోడ్‌ని ఎస్.ఎమ్.ఎస్. ద్వారా పంపిస్తే చాలు. సదురు వ్యక్తి కోడ్‌ని జిప్పర్‌లో ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న మ్యాప్ అతని ఫోన్‌లో ప్రత్యక్షం అవుతుంది.
 
108తో ఒప్పందం: ఈ ఆప్‌ని మొదలు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ‘అంబులెన్స్ సేవలకు మెరుగైన సేవలు అందించడం’ అని అంటారు ఆదిత్య. జిప్పర్, 108 జీవీకె సేవలతో గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు.
 
‘‘ఈ రెండేళ్లలో ఎంతో కొంత సాధించామనే అనుకుంటున్నాం. 108తో ఒప్పందం ఒక పెద్ద అచీవ్‌మెంట్. కోటి రూపాయల బడ్జెట్‌తో మొదలై ఇపుడు లక్షల సెల్‌ఫోన్స్‌లలో మా ఆప్ తన సేవలని అందిస్తోంది. మన రాష్ట్రానికి పరిమితం అయిన జిప్పర్‌ని ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపచేసే పనిలో ఉన్నాం’’ అని అంటున్న ఆదిత్య యాపారం ఇది.
 
- జాయ్
 
ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement