
ఆలోచనల్లో క్రియేటివిటీ మనల్ని కొత్తగా నిలబెడుతుంది! పనిలో ఆర్ట్.. మనల్ని గొప్పగా పరిచయం చేస్తుంది! ఈ రెండు ఏకమై పెట్టుబడిని తోడు తెచ్చుకుంటే ఎంట్రప్రెన్యూర్‌షిప్ సాధ్యమవుతుంది! ప్రస్తుతం అదే షిప్‌లో ప్రయాణం చేస్తున్నారు విదిత, సునీత! ఒకరిది ఫ్యాషన్... ఇంకొకరిది ప్యాషన్! ఎవరు వీళ్లు? ఆ జర్నీ ఏంటీ? ఈ ఇద్దరూ సిలికాన్ వ్యాలీకి ఐకాన్స్ అని చెప్పొచ్చు ఒక్క మాటలో!
(స్టాన్‌ఫర్డ్ నుంచి సరస్వతి రమ)
అమెరికాలోని కాలిఫోర్నియా.. అందునా సిలికాన్ వ్యాలీ..
తెలుగు టెక్ వ్యాలీ అనొచ్చు! ఆ రాష్ట్రంలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో అయితే అచ్చంగా మన అమ్మాయిలదే హవా! బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి ఏ మల్టీనేషనల్ కంపెనీల్లోనో ఉద్యోగం వెతుక్కోకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే సాహస వనితలు! ఈ నెల 28న హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్..పూర్తిగా మహిళా పారిశ్రామికవేత్తలదే! ఈ సందర్భంగా స్టాన్‌ఫర్డ్‌లోని, సిలికాన్ వ్యాలీలో మన మహిళా పారిశ్రామిక వేత్తల పరిచయంలో భాగంగా విదిత, సునీతల గురించి ఈ ఇండ్రక్షన్..
ఇండో ఫ్యాబ్రిక్ .. వెస్ట్రన్ డిజైన్
విదితాసుబ్బారావు స్వస్థలం హైదరాబాద్. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలోని బిజినెస్ స్కూల్లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతూనే ఇంకో పక్క ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి కృషి చేస్తోంది. జోఫీ ఫ్యాషన్ పేరుతో ఆన్‌లైన్ సంస్థను నడుపుతోంది. బనారస్, కంచి, పోచంపల్లి వంటి మన సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌తో వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందించడమే జోఫీ ఫ్యాషన్స్ ప్రత్యేకత. ఆ రకంగా మన ఫ్యాబ్రిక్స్‌ను ప్రపంచానికి అందిస్తోంది విదిత. వస్త్రవ్యాపారమే కాక మధుబని వంటి ఫ్యాబ్రిక్ పెయింట్‌ను సంరక్షించే బాధ్యతనూ చేపట్టింది. మన చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పిస్తూ వారి నేత నైపుణ్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేస్తోంది. ఇప్పుడు వెస్ట్రన్ డిజైనర్స్‌తోనే డిజైన్స్ చేయిస్తున్నా త్వరలోనే నిట్, నిఫ్ట్ వంటి మన ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్ విద్యార్థులతో కలిసి పనిచేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతంలో ఏ ప్రత్యేక నేతకళ ఉన్నా చేయూతనిచ్చి దానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది విదిత. ‘‘నేను ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కారణం మా అమ్మ (సరళా సుబ్బారావు) తను వృత్తిరీత్యా సైంటిస్ట్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం.
ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తో వెస్ట్రన్ డిజైన్ అనేది అమ్మ ఐడియానే. ఎంట్రప్రెన్యూర్ కావాలనే నా యాంబిషన్‌కు అమ్మ ఐడియాను జోడిస్తే జోఫీ ఫ్యాషన్స్‌గా క్రియేట్ అయింది. ప్రస్తుతం మా బ్రాండ్‌తో 12 రకాల డిజైన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. వాటికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికీ మా మార్కెట్ ఆన్‌లైనే. వెంచర్ క్యాపిటల్ కోసం ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదు. నా సొంతంగానే ఈ సంస్థను స్టార్ట్ చేశాను. డూయింగ్ వెల్. సవాళ్లుండవని అనను. ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా చాలెంజెస్ ఉంటాయి. వాటిని అధిగమించి వెళ్లడమే సక్సెస్ కదా! నేను అదే పోరాటంలో ఉన్నా. సిలికాన్ వ్యాలీ.. కొత్త ఆలోచనలను, ఇన్నోవేషన్స్‌ను ఆదరిస్తుంది. ఐడియాలుండాలే కాని అవకాశాలకేం కొదవలేదు. ధైర్యంగా ముందుకెళ్లడమే. ఇక్కడికి రావాలనుకునే వారికి నా సలహా ఒక్కటే. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. అధిగమించడం నేర్చుకోవాలి’’ అని చెప్తుంది యంగ్ ఉమన్ ఎంట్రప్రెన్యూర్ విదితాసుబ్బారావు.
లాఫింగ్ బుద్ధా గేమ్స్
సిలికాన్ వ్యాలీలోని ఇంకో లేడీ ఎంట్రప్రెన్యుయన్ ఎఫర్ట్ ఇది. ఆమె పేరు సునీతా గిరీష్. స్వస్థలం కేరళ. అమెరికాకు వచ్చి దాదాపు పదేళ్లయింది. వాళ్ల కుటుంబంలో అమెరికాకు వచ్చిన తొలి మహిళే కాదు.. తొలి వ్యక్తి కూడా ఆమే. ఇంగ్లీష్‌లో లిటరేచర్ చేయడానికి వచ్చి అది పూర్తయ్యాక అందులో ఉపాధి అవకాశాలు దొరక్క.. సిలీకాన్ వ్యాలీ టెక్నికల్ క్వాలిటీస్‌కే ప్లేస్ ఇస్తుందని గ్రహించి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకుంది. గొడ్డు చాకిరే తప్ప స్టాఫ్ ఆలోచనలను ఆదరించే అధికార సిబ్బంది ఉండరని అర్థమై సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. ఈలోపే పెళ్లి, పిల్లలు. అమెరికాలాంటి చోట... ఫ్యామిలీ సపోర్ట్ సిస్టం లేని దేశంలో ఇటు ఉద్యోగం, అటు పిల్లల పెంపకం.. చాలా కష్టం. ఈ బాధ్యతలతో ఉద్యోగ వేళలను అందుకోవడం దుర్లభం. అందుకే తనకు నచ్చిన ఆలోచనను. తనకు సౌకర్యంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం మంచిదని నిర్ణయించుకుంది. పిల్లలకు గేమ్స్ తయారు చేసే వర్క్ అయితే బాగుంటుందని ఆ రంగంలోకి దిగింది. లాఫింగ్ బుద్ధా గేమ్స్ పేరుతో. ఇదొక స్టార్టప్ కంపెనీ అయినా సేల్స్ బాగా ఉన్నాయి. ఆటల ద్వారా పిల్లలకు పాఠాలు బొధించడమే లాఫింగ్ బుద్ధా గేమ్స్ ప్రత్యేకత. ఈ గేమ్స్ కంపెనీ పెట్టడానికి ఇంకో కారణం సునీత పెద్ద కొడుకు. ఆ అబ్బాయి స్పెషల్లీ చాలెంజ్డ్. ఆటిజం చైల్డ్. ఎంత స్పెషల్ స్కూల్లో వేసినా... రాని మార్పు.. గేమ్స్ మాడ్యూల్స్ ద్వారా రావడంతో సునీతకు ఈ తలపు తట్టింది.. అందుకే సాధారణ పిల్లలతో పాటు స్పెషల్లీ చాలెంజ్డ్ పిల్లల కోసమూ ఈ గేమ్స్‌ను తయారు చేస్తోంది.
ఈ మాడ్యూల్స్ ద్వారా వాళ్లకు పాఠాలు చెప్పేలా. వీటికి అమెరికాలో చాలానే డిమాండ్ ఉంది. ఇదీ ఆన్‌లైన్ మార్కెటే. ప్రస్తుతం ఆసియా దేశాల వైపూ దృష్టి సారించింది సునీత. మన దగ్గరా విద్యాశాఖ, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదించి ఆ స్కూళ్లకూ తమ మాడ్యూల్స్‌ను సరఫరా చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ముంబైలాంటి చోట్ల కొన్ని స్కూళ్లోతో ఒప్పందం జరిగింది. దీనికి మన దేశంలోనే కాదు పశ్చిమాసియాలోని చాలా చోట్ల లాఫింగ్ బుద్ధా గేమ్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ‘పిల్లలకు ఒత్తిడి లేకుండా ఆడుతూపాడుతూ.. మెంటల్ ఎక్సర్‌సైజ్‌తోపాటు ఫిజికల్ యాక్టివిటీనీ జతచేసి పిల్లలకు పాఠాలు నేర్పాలి. పిల్లలూ ఇలాంటి మెథడ్స్‌నే ఇష్టపడ్తారు. మొక్కుబడిగా కాకుండా ఆసక్తిగా నేర్చుకుంటారు. అందుకే లాభాపేక్ష కన్నా సృజనాత్మకతకు ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్స్‌కి, ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ‘మా లాఫింగ్ బుద్ధా గేమ్స్’ బేసిక్ మాడ్యూల్స్‌ను ఉచితంగా ఇస్తున్నాం. మన దేశంలోని అన్ని మెయిన్ సిటీస్ స్కూళ్లతో టై అప్ అయి ఆ తర్వాత నెమ్మదిగా గ్రామాలకూ విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటుంది లాఫింగ్ బుద్ధా గేమ్స్ అధిపతి సునీతా గిరీష్. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎన్నో... ఎందరో... సిలికాన్ వ్యాలీలో మన మహిళలు వ్యాపార దక్షతను చూపిస్తూ.. సామాజిక బాధ్యత మరవని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వీళ్ల పరిచయం, అనుభవం.. హైదరాబాద్ జీఈఎస్‌కు హాజరయ్యే మన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణ, స్ఫూర్తి!
Comments
Please login to add a commentAdd a comment