
సిగ్గులతో బుగ్గలు ఎర్రబారే జబ్బు!
మెడి క్షనరీ
సాధారణంగా కథలలో నాయకుణ్ణి చూడగానే కథానాయికలకు బుగ్గలు ఎర్రబడతాయి. వాళ్లు సిగ్గుల మొలకలైనప్పుడూ ఇలా బుగ్గలు ఎర్రబడతాయని రచయితలు వర్ణిస్తుంటారు. చెంపలు కెంపులవుతాయని కవులు రాస్తుంటారు. కానీ ఎవరినైనా అపరిచితుణ్ణి చూసినా ఇలా బుగ్గలు ఎర్రబారే జబ్బు ఒకటుంది. సిగ్గులతో బుగ్గలు ఎర్రబారే జబ్బు (బ్లషింగ్ డిజార్డర్) అని అంటుంటారు. వైద్యపరిభాషలో దీన్నే ‘ఇడియోపతిక్ క్రేనియోఫేషియల్ అరిథ్మా’ అంటారు.
ఈ జబ్బు ఉన్నవారిలో అప్రయత్నంగానే బుగ్గలు ఎర్రబడతాయి. అపరిచితులను అడ్రసు అడుగుతున్నా, మాట్లాడుతున్నా, ఆఖరుకు షాపులో ఏవైనా వస్తువులు ఉన్నాయా అని వాకబు చేస్తున్నా ఈ లక్షణం కనిపించవచ్చు. ఇది వాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంది. తీవ్రమైన యాంగ్జైటీ వల్ల ఇలా జరుగుతుందని, ఇదొక రుగ్మత అని వైద్యనిపుణులు పేర్కొంటుంటారు.