మనుషులు ఉచ్చు పన్నుతుంటారు.అందులో వేటను పడుతూ ఉంటారు.కాని ఒక్కోసారి విధి కూడా ఉచ్చు పన్నుతూ ఉంటుంది.అందులో చిక్కుకునేది ఎవరు?దోషా? నిర్దోషా?2011. అక్టోబర్. వరంగల్ జిల్లా పాకాల.సాయంత్రం 6.ఓ మహిళ హడావుడిగా పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి లోపలికి రావాలా? వద్దా? అన్న సందిగ్ధంలో గేటు వద్దే తటపటాయిస్తోంది అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆమె వైపు అనుమానంగా చూసి ‘ఏం కావాలి?’ అన్నాడు.‘దొరని కలవాలి’ అంది.లోపలికి వెళ్లు’ అన్నాడు.భయంభయంగా లోపలికి వచ్చింది. 30 ఏళ్లు ఉంటాయి. గిరిజన మహిళ. బహుశా పోలీస్ స్టేషన్‌కు రావడం అదే కొత్త. బిత్తరచూపులు చూస్తోంది. కానిస్టేబుల్ దారి చూపించాడు..ఎస్.ఐను చూసి ‘దండాలు దొరా’ అంటూ వంగి నమస్కరించింది. ఏదో ఫైల్ చూస్తున్న ఎస్.ఐ ‘ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు?’ అన్నాడు.‘సార్.. నా పేరు మంగ్లీ. నా పెనిమిటి ఆలూ నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు’ అంది.‘ఏమయ్యాడు’‘నిన్న రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు దొరా! మామూలుగా వెంటనే వచ్చేస్తాడు.ఇప్పటిదాకా రాలేదు. నాకెందుకో గుబులైతోంది. నా పెనిమిటిని ఎతకండి దొరా.. మీ కాళ్లు పట్టుకుంటా.. పిల్లలు, నేనూ రాత్రంతా నిద్రపోలేదు’... అంటూ రెండు కాళ్లు పట్టుకుంది..వెంటనే ఆమెను లేపాడు ఎస్.ఐ.స్టేషన్ బయటకు చూశాడు. చలికాలం. అప్పటికే బాగా చీకటైపోయింది. ‘ఏం భయం లేదమ్మా. రేపు ఉదయం వెతుకుతాం. నువ్వెళ్లి కానిస్టేబుల్‌కి మీ ఆయన వివరాలు చెప్పు’ అని ఆమెను పంపాడు.కేసు గురించిన ఆలోచనలు అతడిలో మొదలయ్యాయి.
ఉదయం నలుగురు పోలీసులతోపాటు బయలు దేరాడు ఎస్.ఐ. మొదట తండాకు వెళ్లి మంగ్లీని ఎక్కించుకున్నాడు.‘మీ పొలం ఎక్కడా?’‘అడవిలో కిలోమీటరు లోపల ఉంటుంది దొరా’ అని చెప్పింది మంగ్లీ.అడవి మొదలు వరకు జీపు వెళుతుంది. ఆ తర్వాత నడిచే వెళ్లాలి. పగలే చీకటి ఉండే అడవి అది. మంగ్లీ చెప్పిన దాన్నిబట్టి ఆలూ పోడు వ్యవసాయం చేస్తాడు. శత్రువులెవరూ లేరు. మరి రెండు రోజులైనా ఇంటికి రాలేదంటే ఏమై ఉంటుంది? అడవిలో ఏదైనా జంతువు తినేసిందా? లేక ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా? ఎవరైనా చంపేశారా? ఎస్సై మనసులో ఆలోచనలు రేగుతుండగా వారికి దారి చూపుతూ నడుస్తోంది మంగ్లీ. ఆలూ పొలం వచ్చింది. పొలంను మార్క్ చేసిన ఎస్.ఐ పొలం మడుల్లో నీరు నిండుగా ఉండటం గమనించాడు. అంటే ఆలూ ఇక్కడికి వచ్చాడు. నీళ్లు పెట్టాడు. తరువాతే అతను మామయ్యాడు.‘వెతకండి’ అన్నాడు ఎస్.ఐ.పోలీసులు చుట్టుపక్కల అరకిలోమీటరు వరకు జాగ్రత్తగా వెదికారు. జంతువు తిరిగిన ఆనవాళ్లు కానీ, ఆలూ కాలిముద్రలుగానీ ఏమీ దొరకలేదు. మరి ఆలూ ఏమైనట్లు? ఈసారి వచ్చిన దారిన కాకుండా సమాంతర దారిలో వచ్చారు. ఆ దారిలో నడుస్తున్న ఎస్.ఐ హఠాత్తుగా ఆగిపోయాడు.ఆ దారిలో ఇరువైపులా పైరు శుభ్రంగా ఉంది. కాని ఒక పొలంలో మాత్రం తొక్కుడుకి గురై ఉంది.‘ఇది పశువులు తొక్కిన పైరులా లేదు కదూ’ అన్నాడు ఎస్.ఐ దానినో క్లూగా తీసుకుంటూ.దగ్గరగా వెళ్లి పరిశీలించాడు. ఎవరో పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపించాయి. జాగ్రత్తగా పరిశీలించిన ఎస్.ఐకి ఒకచోట ఏదో మెరుస్తూ కనిపించింది.తాయత్తు. దాన్ని మంగ్లీకి చూపాడు. ‘ఇది మా ఆయనదే’ అంది మంగ్లీ. తన భర్తకు ఏం ఆపద వచ్చిందోనని ఏడుపు మొదలెట్టింది. ఎస్.ఐ ఆ ఏడుపుకు చెదరకుండా పరిసరాల మీద దృష్టి పెట్టాడు.అక్కడే చిన్న వైరు ముక్క కనిపించింది. పొలాల్లో ఉచ్చు కోసం ఉపయోగించే వైరు ముక్క. దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
‘చెప్పండి.. ఆలూని చివరిసారిగా ఎవరు చూశారు?’ తండాలో అందరినీ పోగేసి అడిగాడు ఎస్.ఐ.‘మా తమ్ముడు పొలం వెళుతుండగా నేను చూశాను’ అన్నాడు ఆలూ అన్న సోమ్లా. ‘మీరొకసారి స్టేషన్‌కి రండి’ అన్నాడు.మరునాడు స్టేషన్‌కి వచ్చిన సోమ్లాని ఎస్.ఐ ఇంటరాగేషన్ చేశాడు. ఈ హడావుడికి గ్రామంలో దాదాపు 20 మంది యువకులు భయపడి పారిపోయారు. వారంతా మరునాడు మళ్లీ తండాకు వచ్చారు ఇద్దరు యువకులు తప్ప!పాకాల చెరువు.మంగ్లీని తీసుకొని అక్కడకు చేరుకున్నారు పోలీసులు. మంగ్లీకి విషయం అర్థమైంది– తన భర్త ప్రాణాలతో లేడని.గజ ఈతగాళ్లు చెరువును జల్లెడ పడుతున్నారు. 24 గంటలు గడిచాయి. మంగ్లీ పిల్లలతో చెరువు ఒడ్డునే రోదిస్తోంది. మరో 12 గంటలు గడిచాక ఆలూ శవం దొరికింది. శవానికి పెద్ద బండరాళ్లు కట్టిఉన్నాయి.చెరువు మధ్యలో దాన్ని పడేసి, రాళ్లు కట్టారు. ‘ఎవరు సార్? ఈ పని చేసింది ఎవరు సార్..’ అంటూ ఎస్.ఐ వద్దకు వచ్చి దయనీయంగా అడగసాగింది మంగ్లీ. ‘నా మరదలు అడుగుతుంటే నోరు తెరవరేమిసార్.. నా తమ్ముడిని పొట్టనబెట్టుకుంది ఎవరు?’ అంటూ కోపంగా అడిగాడు సోమ్లా.‘ముందు అంత్యక్రియలు చేయండి.. చంపిందెవరన్నది త్వరలోనే చెబుతాం’ అంటూ వెళ్లిపోయాడు ఎస్.ఐ.
ప్రశాంతంగా ఉన్న తండాలో రయ్..రయ్‌మని రెండు పోలీసు జీపులు వెళ్లాయి. అంతా అటువైపే పరిగెత్తుతున్నారు. గుడిసెలో ఉన్న మంగ్లీతో ఆలూని చంపినవాళ్లను పోలీసులు పట్టుకున్నారు అని ఓ కుర్రాడు వచ్చి ఆయాసంగా చెప్పి తిరిగి పరుగు అందుకున్నాడు.ఆ కుర్రాడు చెప్పింది వినగానే.. కోపంతో మంగ్లీ కళ్లు చింతనిప్పుల్లా మారాయి. లేని శక్తిని కూడదీసుకుని తానూ వెళ్లింది. పోలీసులు ముఖానికి ముసుగులు వేసిన ఇద్దరు యువకులను జీపు నుంచి దించారు. వారి ముసుగులు తీశారు. అంతా షాక్.. వారెవరో కాదు. ఆలూ అన్న సోమ్లా కొడుకులు.ఏం జరిగిందో వారి చేతే చెప్పించారు పోలీసులు.ఆ రోజు రాత్రి ఆలూ కంటే ముందే సోమ్లా ఇద్దరు కొడుకులు మోంగియా, మోహన్‌లు పొలానికి వెళ్లారు. ఆలూ పొలానికి ఫర్లాంగు దూరంలో సోమ్లా పొలం ఉంటుంది. అక్కడ అడవి పందులకు కరెంటు ఉచ్చులు బిగించారు. కానీ, అనుకోకుండా అదే ఉచ్చులో సాక్షాత్తూ తమ బాబాయే ఇరుక్కుంటాడని అనుకోలేకపోయారు. అడవి జంతువులను వేటాడటం నేరమని తెలిసీ ఉచ్చుబిగించారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. కానీ తెల్లారితే ఈ విషయం ఊరంతా తెలుస్తుందన్న భయంతో ఆ శవానికి రాళ్లు కట్టి పాకాల చెరువు మధ్యలో తీసుకెళ్లి పడేశారు. అదీ జరిగింది. ఇద్దరు యువకుల నిర్లక్ష్యం మంగ్లీకి భర్తను, ఇద్దరు పిల్లలకు తండ్రిని దూరం చేసింది. తమ్ముడే ప్రాణంగా బతికిన సోమ్లాకు అటు తమ్ముడు దూరమై కొడుకులు జైలుపాలై తీవ్ర వేదన మిగిలింది.
– అనిల్‌కుమార్ భాషబోయిన
Comments
Please login to add a commentAdd a comment