శ్రావ్యా.. ప్లీజ్‌..! | Family problems with examples | Sakshi
Sakshi News home page

శ్రావ్యా.. ప్లీజ్‌..!

Published Mon, Aug 28 2017 12:25 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

శ్రావ్యా.. ప్లీజ్‌..!

శ్రావ్యా.. ప్లీజ్‌..!

‘నేనేంటి మీకు?’ గుడ్లు తేలేశాడు శ్రీరామ్‌. ‘నేనేంటి మీకు?’ గద్దించింది శ్రావ్య. ‘అర్థం కాలేదు శ్రావ్యా. భర్తకు భార్య ఏమౌతుంది? భార్యే కదా!’ అన్నాడు శ్రీరామ్‌. ‘అవుతుంది నిజమే. నేను మీకు అయ్యానా..’ అంది శ్రావ్య. శ్రీరామ్‌ భయంగా చూశాడు. అది ఆఫీస్‌ టైమ్‌. ఆఫీస్‌కు వెళ్లే ముందు కానీ, ఆఫీస్‌ నుంచి వచ్చాక కానీ సడన్‌గా ఇలా టాటా, బైబై చెబుతుంటుంది శ్రావ్య. ‘ఏంటి అవడం శ్రావ్యా?’.. వెనక్కు వస్తూ అన్నాడు.   ‘నేను మీ భార్యను అని కదా అన్నారు. అనడం వరకేనా? అనుకోవడం వరకూనా?’ ‘అనుకోకుండా అనడం ఉంటుందా ఎక్కడైనా?’ ‘కానీ నాకు తెలుస్తోంది శ్రీరామ్‌.. మీకు నా మీద ప్రేమ పోయింది’.

‘ఎలా చెప్తావ్‌ శ్రావ్యా?’ ‘పెళ్లికి ముందు మీరిలా లేరు!’ ‘ఇలా’ అంటే? ‘అప్పుడున్నట్లు ఇప్పుడు లేరు’. ‘అప్పుడెలా ఉండేవాడిని?’ ‘అది కూడా గుర్తు లేదా?’ ‘గుర్తు లేకపోవడం కాదు శ్రావ్యా.. ఇప్పుడున్నట్లే అప్పుడూ ఉన్నట్లు గుర్తు. నీకు కోపం వచ్చిందని అర్థం అవుతూనే ఉంది కానీ.. ముందు ‘మీరు’ అనడం ఆపు నన్ను’. ‘అప్పుడు నా కోసం ఎదురు చూసేవాడివి. నా మాట కోసం ఆరాటపడేవాడివి. నా నవ్వు కోసం...’ ‘ఇప్పుడు?’ ‘చూశావా.. నా మాట వినడం కూడా విసుగ్గా ఉంది నీకు!’ ‘విసుగా?! ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో చెప్పబోతుంటే వినకుండా.. ‘ఇప్పుడు?’ అని బ్రేక్‌ చేశావ్‌. ‘ఏం బ్రేక్‌ చేశాను?’ ‘నా మాటను బ్రేక్‌ చేశావ్‌?’ ‘సరే.. చెప్పు. నీ నవ్వు కోసం నేనేం చేసేవాడిని?’ ‘అక్కర్లేదు’. ‘ఏంటక్కర్లేదు’ ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో నేను గుర్తు చెయ్యనక్కర్లేదు.

నువ్వు గుర్తుకు తెచ్చుకోనక్కర్లేదు’. ‘ఏమైంది శ్రావ్యా.. నీకు? టార్చర్‌ పెడుతున్నావు తెలుసా?’ ‘టార్చరా!! నువ్వా, నేనా.. టార్చర్‌ పెడుతున్నది శ్రీరామ్‌?’ ‘రాత్రంతా బాగానే ఉన్నావ్‌ కదా!’ ‘బాగా.. ఉన్నానా?! ‘అదే.. శ్రావ్యా.. మన మధ్య గొడవేం జరగలేదు కదా అని!’ ‘గొడవ జరగ్గపోతే బాగున్నట్టు.. గొడవ జరిగితే బాగోలేనట్టు.. ఏంటిది శ్రీరామ్‌? ఏం మాట్లాడుతున్నావ్‌?’ ‘బాగోవడం, బాగోలేకపోవడం.. గొడవల వల్లే కదా శ్రావ్యా?’ ‘మరి ఏ గొడవా లేకుండానే.. అప్పుడెందుకు నువ్వు అన్నిసార్లు ‘ఏంటి శ్రావ్యా అలా ఉన్నావ్‌?’ అని అడిగేవాడివి?! ‘అప్పుడు.. అంటే?’ ‘పెళ్లికి ముందు’. ‘పెళ్లికి ముందా?!’ ‘అవును. అప్పుడు ఒంట్లో బాగున్నా.. ‘అలా ఉన్నావేంటి?’ అని అడిగేవాడివి. ఇప్పుడు ఒంట్లో బాగోలేకున్నా ‘ఎలా ఉన్నావ్‌?’ అని కూడా అడగడం లేదు’.

‘పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత.. ఒకేలా ఎలా ఉంటుంది శ్రావ్యా?’ ‘చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్‌.. మారిపోయానని’ ‘నేను మారిపోవడం, నువ్వు మారిపోవడం కాదు శ్రావ్యా.. ప్రేమలో ఎలా ఉంటామో.. పెళ్లి తర్వాత కూడా అలా ఉండలేం అని అంటున్నా’. ‘అంటే.. ప్రేమ ఉండదనా.. శ్రీరామ్‌?’ ‘ఉండదు అని కాదు శ్రావ్యా.. ఉందీ అని చెప్పడానికి సరిపడినంత టైమ్‌ ఉండదూ అని’. ‘ప్రేమ ఉంటే టైమ్‌ ఉండదా శ్రీరామ్‌?’ ‘మనసుంటే.. మార్గం ఉండదా అన్నట్లు అడిగావ్‌ శ్రావ్యా. పెళ్లికి ముందు నీ కోసం ఎదురు చూసింది నిజమే. ఇప్పుడూ చూస్తున్నా.. ఆఫీస్‌లో ఉండి, నీ ఫోన్‌ కాల్‌ కోసం! పెళ్లికి ముందు నీ మాట కోసం ఆరాటపడిన మాట నిజమే. ఇప్పుడూ పడుతున్నా.. నా పది మాటలకు అలకలో నువ్వొక్క మాటైనా బదులు చెప్పనప్పుడు. పెళ్లికి ముందు కట్టు కథలు చెప్పి నిన్ను నవ్వించాలని చూసింది నిజమే. ఇప్పుడూ చెప్పాలని ట్రయ్‌ చేస్తున్నా..’ అన్నాడు శ్రీరామ్‌ నీరసంగా.

‘సో.. ట్రయ్‌ చేస్తున్నావ్‌. ప్రేమగా ఉండడానికి ట్రయ్‌ చేస్తున్నావ్‌. ప్రేమించడానికి ట్రయ్‌ చేస్తున్నావ్‌. ప్రేమ లేకున్నా, ప్రేమ ఉన్నట్లు నమ్మించడానికి ట్రైయ్‌ చేస్తున్నావ్‌. అంతే తప్ప.. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు’. ‘శ్రావ్యా.. ప్లీజ్‌. ఆఫీస్‌కి టైమ్‌ అవుతోంది. బయల్దేరేదా?’ ‘వెళ్లండి. కానీ సమాధానం చెప్పి వెళ్లండి’. ‘దేనికి సమాధానం?’ ‘నేనేంటి మీకు?’ (‘నువ్వు’ లోంచి మళ్లీ ‘మీరు’ లోకి వచ్చేసింది శ్రావ్య).

సినిమాలో సంసారం
(మణిరత్నం ‘సఖి’ చిత్రంలోని సీన్‌ ఇది. మాధవన్, షాలిని లవ్‌ కపుల్‌. పెద్దల్ని కాదని, పెళ్లి చేసుకుని వేరుగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. ఇద్దరివీ ఉద్యోగాలు. సాయంత్రం మాధవన్‌ వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. బయట చాలా సేపటిగా వెయిట్‌ చేస్తాడు. చేస్తూ ఉంటాడు...)

సారీ, కూరలు తేవడానికి వెళ్లాను. లేటైంది. నలభై ఐదు నిముషాలుగా వెయిట్‌ చేస్తున్నాను. సారీ.. ర.. (ర అంటే.. ఇంట్లోకి రమ్మని)
లేటౌతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్లొచ్చుగా. కొంచెం లేటయింది. దానికింత కోపమా? నువ్వు ఎక్కడికైనా వెళ్లి, ఎంత లేటుగా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్‌ చెయ్యాలా? నేను మాత్రం ఏమైనా షికార్లు కొట్టడానికి వెళ్లానా? మీకు వండి పెట్టడానికేగా వెళ్లాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గూర్ఖాలా వెయిట్‌ చెయ్యించడం? పెళ్లికి ముందు మూడు గంటలు వెయిట్‌ చెయ్యలా.. బీచ్‌లో. ఇప్పుడు పది నిముషాలు వెయిట్‌ చెయ్యలేరా?అది వేరు..   వేరు అంటే?! అదప్పుడు పెళ్లి కాక ముందు.

మరి పెళ్లి తర్వాత? అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తియ్‌. ఇప్పుడు నువ్వన్నావ్‌గా. తలుపు తియ్‌ శాంతీ. మాట మార్చకు. తలుపు తియ్‌. మరెందుకన్నావ్‌? నువ్‌ మాత్రం ఎందుకలా మాట్లాడావ్‌? నువ్వు అన్నావా లేదా? బయట నించుని ఇప్పుడు గొడవ దేనికి? లోపలికి పద చెప్తాను. చెప్పు నాకు. చెప్తాను పదా... (లోపలికి వెళ్లగానే షాలిని అలక తీర్చేపనిలో పడిపోతాడు మాధవన్‌) సంసారంలో పడ్డాక, బాధ్యతల్లో తలమునకలై మునుపటి ప్రేమానురాగాలు తగ్గినట్లు అనిపిస్తుంది కానీ, నిజంగా తగ్గినట్లు కాదు. గొడవలు, అలకలు కూడా ప్రేమానురాగాల్లో భాగమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement