కోరుకున్న కురులు
బ్యూటిప్స్
జుట్టు పట్టుకుచ్చులా, అందంగా పొడవుగా ఉండాలని ఎవరికి ఉండదు? కానీ అలా కావాలంటే కొద్దిగా ఓపిక తెచ్చుకోక తప్పదు. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె కానీ ఆలివ్ ఆయిల్‌తో కానీ రాత్రిపూట మాడుకు మసాజ్ చేయాలి. జుట్టుకు కూడా నూనె బాగా రాయాలి. తర్వాత వెడల్పు పళ్ల బ్రష్‌తో ఒక నిమిషంపాటు తలను దువ్వాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో తల స్నానం చేసి, వెంటనే చల్లటి నీటితో జుట్టును కండీషనింగ్ చేసుకుంటే చాలు. మీరు కోరుకున్నట్టు జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారింది. అందుకు ఈ చిట్కా వాడి చూడండి. కాకరకాయ రసంలో కొద్దిగా పంచదార కలిపి ఓ 15 నిమిషాలు నానబెట్టండి.
తర్వాత దాన్ని పొడిగా ఉన్న మాడుకు అప్లై చేయండి. 5-6 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో మాడుకు మర్దన చేసి చల్లటి నీటితో తలను కడిగేసుకోండి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. ఎండలో బాగా తిరగటం కారణంగా ముఖం, చేతులు సన్‌టాన్‌తో నల్లగా, నిర్జీవంగా మారుతుంటాయి. అది సబ్బు పెట్టి రుద్దినంత మాత్రాన వెంటనే పోదు. ఇంటికి చేరుకోగానే శనగపిండితో చర్మాన్ని స్క్రబ్ చేయాలి. తర్వాత కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో మర్దన చేసుకుంటూ కడిగేసుకుంటే సన్‌టాన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా అవుతుంది, ఈ చిట్కాతో మునుపటి సౌందర్యం మీ సొంతమవుతుంది.