ఆమె బలహీనత నన్ను బాధ పెట్టేది!
మనోగతం
ఆడవాళ్ల నోట్లో ఆవగింజ నానదు... అనే మాట వినడమేగానీ పెళ్లయ్యాకగానీ అది నా అనుభవంలోకి రాలేదు. మా ఆవిడ చాలా మంచిది. అయితే ఆమెకు ఉన్న చిన్న బలహీనత ఏమిటంటే-మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ల అన్నయ్యలకు, నాన్నకు చెబుతుంది.
ఒకరోజు...
‘‘బావగారూ! మీరు అలా చేసి ఉండాల్సింది కాదు’’ అని పెద్ద బావమరిది నుంచి ఫోన్ వచ్చింది.
‘‘ఏంచేశాను?’’ అని అడిగితే-
‘‘కూర బాగా లేదని కసురుకున్నారట కదా...’’ అన్నాడు.
తల పట్టుకున్నాను నేను.
ఇక మామగారు చీటికిమాటికీ ఫోన్ చేస్తారు.
‘‘సొంత ఇల్లు ఉండాలండీ...ఎంతకాలమని అద్దె ఇంట్లో ఉంటారు’’ అని నాన్‌స్టాప్ ఉపన్యాసం ఇస్తాడు.
చిన్న బావమరిది ఏ మాత్రం తనకు సమయం దొరికినా ఫోన్ చేసి ‘‘మీరు అలా కాదు...ఇలా ఉండాలి’’ అని ఏదో చెప్పబోతాడు. ఈ ఫోన్ల బెడద...చివరికి ఆఫీసు వరకు వచ్చి పనికి అంతరాయం కలిగించేది. ఇక ఇలా అయితే కుదరదనుకొని మా ఆవిడతో తగాదా పెట్టుకోవడానికి మంచి ముహూర్తం ఒకటి నిర్ణయించుకున్నాను.
ఒక ఆదివారం పూట గొడవకు దిగాను.
‘‘అమ్మానాన్నలు నీకు పెట్టిన పేరు...శ్రీలత. బీబీసి కాదు’’ అన్నాను.
‘‘అంటే?’’ అంది ఆమె అర్థం కానట్లు.
‘‘మన ఇంట్లో చీమ చిటుక్కుమన్నా మీ పుట్టింటివాళ్లకు చెబుతావు. నిన్ను కాదు...ఈ సెల్‌ఫోన్‌లను అనాలి’’ అన్నాను.
‘‘ఏదో పక్కింటి వాళ్లకు చెబుతున్నట్లు ఫీలైపోతారేమిటి?’’ అని ఆమె ముఖం మాడ్చుకుంది. ‘‘అలా కాదు తల్లీ’’ అంటూ ఆమెకు అర్థమయ్యేలా అన్ని విషయాలూ చెప్పాను. ‘గుట్టు’ అనేది సంసారానికి ముఖ్యం అని గుర్తు చేశాను. తరచుగా నాకు ఫోన్ చేయడం వల్ల వచ్చే సమస్యలు చెప్పాను.ఆమె నా బాధలు అర్థం చేసుకుంది. మారింది. నాకు సంతోషాన్ని ఇచ్చింది.
-ఆర్‌ఆర్, తెనాలి