ఐ యామ్ నెట్‌రావ్ | I'm netrav | Sakshi
Sakshi News home page

ఐ యామ్ నెట్‌రావ్

Published Tue, May 19 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

ఐ యామ్ నెట్‌రావ్

ఐ యామ్ నెట్‌రావ్

బయోగ్రఫీ
 
పదిమందికి ఉపయోగపడాలి. అదే జీవిత పరమార్థం. ఉపయోగపడుతున్నట్టు కనిపించకూడదు. అదే ఆ పరమార్థంలోని జీవన సౌందర్యం. నిస్వార్థంగా సర్వీస్ ప్రొవైడ్ చెయ్యాలి. సెర్చ్ చేస్తున్న వారి కోసం ఇంజిన్‌లా పనిచేసుకుంటూ పోవాలి. ఫలితం ఆశించకూడదు. ఆశించినవారికి మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి. ఇదీ నా ఫిలాసఫీ. నా పేరు ఇంటర్నెట్.
 
‘‘నా పేరు ఫలానా’’ అని చెప్పుకోవడం కన్నా, ‘‘నాకు మీరు పెట్టిన పేరు ఫలానా’’ అని చెప్పుకోవడంలో నాకు నిండుతనం ఉంటుంది. నన్ను మీరు ‘ఇంటర్నెట్’ అన్నారు. నిజానికి అదికాదు నా గుర్తింపు. నేను మీకెప్పుడూ ‘కనెక్ట్’ అయి ఉండడమే నా అసలైన గుర్తింపు. కనెక్ట్ కాని క్షణాన నేను లేన ట్టు. కనెక్ట్ అయ్యాక కూడా మీరు నన్ను యూజ్ చేసుకుంటేనే నేను బతికి ఉన్నట్టు. ఒక వేళ నేను సడెన్‌గా క్రాష్ అయ్యి చచ్చిపోతే?! కొన్ని క్షణాల అంధకారమే. వెంటనే వెలుగొచ్చేస్తుంది. ఆ లెవల్లో ఉంది మనిషి దగ్గర టెక్నాలజీ.
 నా గురించి నేను చెప్పుకోడం నాకిష్టం ఉండదు. ఎవరైనా చెబుతుంటే వినడమూ నాకు బాగోదు. ప్రపంచంలో ఏ విషయం కావాలన్నా మీరు నన్ను సెర్చ్ చేస్తారు. సర్ఫ్ చేస్తారు. నా గురించి తెలుసుకోవాలన్నా అదే పని చేస్తారు కాబట్టి పనిగట్టుకుని నేను చెప్పుకునే పన్లేదు.
 
రెండిటికీ తేడా ఏంటి?

నాకు తెలుసు వెంటనే ఇప్పుడు మీరు సెర్చ్‌కి, సర్ఫ్‌కి తేడా ఏమిటని నన్ను అడుగుతారు! మీకు ఎన్ని సందేహాలు వస్తే నాకు అంత వాల్యూ. చెప్తా రండి. ఏదో ఒకదాని కోసం వెదకడం సెర్చింగ్. ఒకే విషయం కోసం అనేక వెబ్‌సైట్‌లను గాలించడం సర్ఫింగ్. ఈ సర్ఫింగ్ అనే మాటను కనిపెట్టింది ఎవరో తెలుసా? న్యూయార్‌లో ఉండే ఒక లైబ్రేరియన్. ఆమె పేరు జీన్ ఆర్మోర్ పాలీ. 1992లో తొలిసారిగా ఆమె ఈ మాట వాడారు. అప్పట్నుంచీ ఆమె పేరు కూడా మారిపోయింది. ‘నెట్ మామ్’ అని పిలుస్తున్నారు పాలీని.
 నా గురించి చెప్పుకోడం నాకిష్టం లేదన్నాను కానీ, నా గురించి కొంతమంది అనుకునే మాటలు నన్నెంతగా బాధ పెడతాయో మీకు చెప్పుకోకుండా ఉండలేదు.

నాలో వెయ్యి సముద్రాల సమాచారం ఉంటుంది. అడిగిన సమాచారం ఇవ్వడం నా ధర్మం. నా దగ్గర లేని సబ్జెక్టు లోకంలో లేదు. ఎవర్నీ ఏనాడూ నేను వట్టి చేతుల్తో పంపలేదు. వాళ్లడిగింది నా దగ్గర ఎంత ఉంటే అంతా ఇచ్చేస్తాను. భూగోళమంత ఉంటే భూగోళమంతా ఇచ్చేస్తాను. గోళీకాయంత ఉంటే గోళీకాయనే ఇచ్చేస్తాను. ‘లేదు’, ‘సారీ’ అనే పదాల్ని నా నోట్లోంచి రానివ్వను.
 ‘‘అలాగని పిల్లలడిగినా ఇచ్చేస్తావా?’’ అని పెద్దలు నా మీదకు కోపానికి వస్తారు. నన్ను చూసి చెడిపోతున్నారని అపవాదు వేస్తారు. తెలుసుకోవాలన్న తపన పెద్దలకు మాత్రమే ఉంటుందా? పిల్లలకు ఉండదా? ‘‘వయసుకు మించిన విషయాలు తెలుసుకోవాలని పిల్లలు ప్రయత్నిస్తే కట్టడి చెయ్యడం మీ చేతుల్లో పనేకదా. వద్దనుకున్న సైట్‌లకు లాక్ వెయ్యండి’’ అంటాన్నేను. తప్పా?! సద్వినియోగానికి, దుర్వినియోగానికి మధ్య లైన్ గీసుకునే పని మనుషులదే. యంత్రానికి ‘వినిమయం’ అవడం ఒక్కటే తెలుసు.
 
అలాగే ఉంటారు మరి!

నా మీద చాలా అరోపణలున్నాయి. నెట్ బుల్లీయింగ్‌కి ఉపయోగ పడుతున్నానట!! ప్రముఖుల్ని బజార్ల పడేస్తున్నానట. పర్సనల్ విషయాలు బయట పెడుతున్నానట. ఎంత అన్యాయం. ఎవరో కొందరి వెర్రి ఆలోచనలకు నేనెలా రెస్పాన్సిబుల్ అవుతాను. వాడకాన్ని బట్టే ఉపయోగం. మంచికి వాడితే మంచి. చెడుకు వాడితే చెడు.

పిల్లలు గంటలు గంటలు స్మార్ట్‌ఫోన్‌లు పట్టుకుని సర్ఫింగ్ చేస్తున్నారని ఇంకో నిర్దయాపూరితమైన నింద. పిల్లలు అలాగే ఉంటారు. వాళ్లను తప్పు పట్టలేం. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనీ, కొత్త కొత్త లోకాలు వీక్షించాలని వారికి ఉంటుంది. అందుకోసమే నన్ను చూస్తుంటారు. అంతకన్నా ఆసక్తికరమైన సంగతుల గురించి మీరు చెప్పగలిగితే ఎప్పుడూ మీ వెంటే ఉంటారు కదా.
 
ముందుజాగ్రత్తలోంచి నేను పుట్టాను!


ఇప్పటికీ, టిమ్ బెర్నర్స్ లీని పిల్లలు అడుగుతుంటారు: ‘‘ఇంటర్నెట్‌ను మీరే కదా కనిపెట్టింది?’’ ‘‘నో నో నో, నేను కేవలం వరల్డ్ వైడ్ వెబ్‌ను సృష్టించానంతే!’’ అని జవాబిస్తుంటాడు టిమ్. డగ్లస్ ఆడమ్స్ జోక్ చేసినట్టుగా, అసలు పేరుకంటే సంక్షిప్తనామం పలకడానికి మూడింతలు ఎక్కువ సమయం పట్టే డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.! టిమ్ కంటే ముందే నేను (ఇంటర్నెట్) పుట్టాను. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న 1960ల ప్రాంతంలో అమెరికా సైన్యం ఒక వ్యూహం రచించింది. ఏదైనా పెనుదాడి జరిగినప్పుడు, భౌతికంగా సమీపంలోలేని సైనిక స్థావరానికి తక్షణం సమాచారాన్ని బదిలీ చేయగలిగే ఒక శక్తిమంతమైన ఆలోచన అది! ఈరోజు ఇంటర్నెట్ అని మీరు నన్ను పిలుస్తున్న దానికి బీజం అక్కడ పడింది. దానికోసం ఎందరో మేధావులు కృషిచేశారు.
 
 మరికొన్ని...


 ‘నేను’ అన్నప్పుడు నేనొక్కదాన్నే అని కాదు. నా చుట్టూ ఉన్నవాటిని కలుపుకుంటేనే మొత్తంగా నేను. ఆ దృష్టితో చూడండి. చివరిగా మీక్కొన్ని విశేషాలు చెబుతాను.

  గూగుల్‌కి వెళ్లి మీరొక ప్రశ్న అడిగారునుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను 0.2 సెకన్లలో వెయ్యి కంప్యూటర్ల సహాయం తీసుకుని మీక్కావసింది రాబడతాను. ఇలా రోజూ సెర్చ్ అవుతున్న సమాచారంలో 16 నుంచి 20 శాతం వరకు మునుపెన్నడూ ఎవరూ సెర్చ్ చేయనిదే. ఇంట్రెస్టింగ్ కదా.

 తొలి యూట్యూబ్ వీడియో 2005 ఏప్రిల్ 23న అప్‌లోడ్ అయింది. దాని పేరు ‘మీ ఎట్ ద జూ’. అందులో జావేద్ కరీమ్ (యూట్యూబ్ కనిపెట్టినవాళ్లలో ఒకరు) నటించారు. అది శాన్‌డియాగో జూ.

 ఇంటర్నెట్‌లో ఫస్ట్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసింది కూడా టిమ్ బెర్నర్స్ లీ నే. అది ఒక ఉమెన్ జోక్ బ్యాండ్‌కు సంబంధించిన ఇమేజ్.ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యూస్ వచ్చిన యూట్యూబ్ వీడియో ‘గంగ్నమ్ స్టైల్’. 200 కోట్ల మందికి పైగా దీనిని వీక్షించారు.

  తొలి ఈ మెయిల్‌ని 1971లో రే టామ్‌లిన్‌సన్ తనకు పంపించుకున్నాడు. అయితే అందులో ఏమి పంపుకున్నాడో అతడికి గుర్తులేదట. జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవడంలో ఇప్పటి వరకు సాధించిన రికార్డు వేగం 1. 16 సెకన్లు.మ్యాచ్.కామ్ ద్వారా కలుసుకుని పెళ్లి చేసుకున్న దంపతులకు ఇప్పటి వరకు 10 లక్షలమంది పిల్లలు పుట్టారు.  అమెజాన్ లోగో కింద కనిపించే యారో మార్క్ ఎ నుంచి జడ్ వరకు అంటుంది. అంటే ఏ-జడ్ అక్కడ దొరుకుతాయని.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement