ప్రతిభను పక్కన పెడ్తారా? | In The Industry if not Compromise Chance is not | Sakshi
Sakshi News home page

ప్రతిభను పక్కన పెడ్తారా?

Published Mon, Apr 22 2019 1:02 AM | Last Updated on Mon, Apr 22 2019 1:02 AM

In The Industry if not Compromise Chance is not - Sakshi

ఇండస్ట్రీ థూ అనిపించుకుంటోంది!ఒకళ్లిద్దరు చాలు కదా... మంచి ఇండస్ట్రీని థూ అనిపించడానికి!యాక్టింగ్‌ అంటే ఏంటీ? ప్రతిభను ధరించి ముందుకు రావడం!ఆ ప్రతిభను వొలుస్తానంటారా?పక్కలో ఉండమంటారు.. లేకపోతే పక్కన పెడ్తామంటారు!కాంప్రమైజ్‌ కాకపోతే ఇండస్ట్రీలో ప్రామిస్‌ లేదంటారు!ఈ అపశ్రుతిని శ్రుతి మళ్లీ బహిర్గతం చేసింది!

‘‘పదహారేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా. తెర ముందు సత్కారాలు.. తెర వెనక అవమానాలు. మేము చాలా కంఫర్టబుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తామని.. గొప్ప మహర్జాతకులమని మాగురించి సామాన్య జనాల్లో ఓ అపప్రథ ఉంటుంది. కాని అది నిజం కాదు. మాకు నచ్చినా నచ్చకపోయినా.. తప్పనిపించినా.. కరెక్ట్‌ అనిపించినా.. అందరూ మెచ్చేలాగే ఉండాలి. నాకు బాగా గుర్తు.. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. దక్షిణాది సినిమా ఒకటి చేశాను. బికినీ వేసుకొమ్మని అడిగారు.రెండో ఆలోచన లేకుండా  ఓకే అన్నాను. బికినీ వేసుకొని నటిస్తున్న సీన్‌ను ఎలా షూట్‌ చేయబోతున్నారు? అసలు ఆ సీన్‌కి బికినీ అవసరమా? వంటి ప్రశ్నలేవీ నా మైండ్‌లో. అలా అడగాలనీ తెలియదు. ఓ సినిమాలో అవకాశం వచ్చింది.. చేయాలి.. అంతే! అప్పుడు నా ముందున్న లక్ష్యం అదే. తర్వాతర్వాత మరాఠీ షోలతో నేను పాపులర్‌ అయ్యాక.. ఆ బికినీ సీన్‌ను చూసిన జనం ఆ ఫొటోస్‌తో ట్రోల్‌ చేశారు.

అది మన సెల్ఫ్‌ఎస్టీమ్‌ను ఎంత దెబ్బతీస్తుంది? బికినీ వేసుకుని నటించాలి.. అడగ్గానే అలాగే నటించాను. నటిగా నన్ను యాక్సెప్ట్‌ చేయలేదు. ఆబ్జెక్టిఫై చేశారు. అయినా ఏమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. నాకున్న కల ఒక్కటే.. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని. దాన్ని  సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోలేదు. నా దారిలో వాళ్లు లేరుకదా! నేనేంటో నాకు తెలుసు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా.. నెమ్మది నెమ్మదిగా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నిలబడ్డాను. ఈరోజుకి స్ట్రాంగ్‌ అయ్యాను. ఈ మధ్య ఒకసారి ఓ సినిమాలో లీడ్‌ రోల్‌ చేసే చాన్స్‌ వచ్చింది. డిస్కషన్స్‌లో భాగంగా ప్రొడ్యూసర్‌ని కలిశాను. స్టార్టింగ్‌లో చాలా ప్రొఫెషనల్‌గానే ఉన్నాడు. తర్వాతే కాంప్రమైజ్‌.. వన్‌ నైట్‌ అంటూ మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆయన మాటలను అడ్వాన్స్‌ కానివ్వకుండా అడిగా.. ‘‘హీరోయిన్‌ అవకాశం ఇవ్వడం కోసం నన్ను నీతో పడుకోమంటున్నావ్‌.

మరి హీరోను ఎవరితో పడుకోబెడ్తున్నావ్‌?’’ అని. కంగుతిన్నాడు ఆ ప్రొడ్యూసర్‌. ఈ విషయాన్ని వెంటనే ఆ ప్రాజెక్ట్‌లోని క్రూ మెంబర్స్‌ అందరికీ చెప్పేశారు. అది ఓ కొలాబరేషన్‌ ప్రాజెక్ట్‌. మిగిలిన వాళ్లంతా అతనిని టీమ్‌ నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు.  ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. నేను ధైర్యం చేసింది ఒక్క నాకోసమే కాదు.. నాలా ఆబ్జెక్టిఫై అవుతున్న చాలా మంది మహిళల కోసం. ఈజీగా ఇతరుల జడ్జ్‌మెంట్‌కు బలవుతున్న అమ్మాయిల కోసం.  యాంబిషస్‌గా ఉండడమే తప్పా? నన్ను నిర్వచించేది నేను వేసుకున్న దుస్తులతో కాదు. నా ప్రతిభ, పని పట్ల నా నిబద్ధత, నా సక్సెస్‌.. నా వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. ఈ సత్యాన్ని జనాలు గ్రహించే టైమ్‌ వచ్చిందనే భావిస్తున్నా!ఫేస్‌బుక్‌లోని ‘అఫీషియల్‌ హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే పేజీలో మరాఠీ నటీమణి శ్రుతి మరాఠే రాసిన సత్యం అది.

అవకాశం కోసం శ్రుతి మరాఠేను  అనుచితమైన కోరిక కోరిన ప్రొడ్యూసర్‌ను ఆ ప్రాజెక్ట్‌ నుంచే తొలగించేలా చేసిన ఆమె సాహసానికి  స్ఫూర్తి ‘మీ టూ’ ఉద్యమమే. జరిగినప్పుడే చెప్పకుండా కొన్నేళ్ల తర్వాత ఎందుకు చెప్తారు? అన్న నోళ్లకు సమాధానం ఆమె. ఎప్పుడో జరిగిన అవమానాలను ఎన్నేళ్లకైనా బయటపెట్టేందుకు మీ టూ వేదికైంది. పెట్టొచ్చు అనే ధైర్యాన్నీ ఇచ్చింది కాబట్టే  తాజాగా ఎదురైన ఇన్‌సల్ట్‌ను దిగమింగుకోకుండా వెంటనే ఎదురించగలిగారు శ్రుతి. చేదు గతం బహిర్గతమవుతేనే  వర్తమానంలో నివారణ దొరుకుతుంది. భవిష్యత్‌ భద్రంగా  ఉంటుంది. మీ టూది అలాంటి ప్రయత్నమే.
మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక దాడితో మన దగ్గర సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం ప్రారంభమైంది.  ప్రీతి జింటా.. తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి గురించి కంప్లయింట్‌ చేసిన మొదటి ఉత్తరాది నటి అనుకోవచ్చు. ఆ తర్వాతే తనుశ్రీ దత్తా, ఇటు చిన్మయీ శ్రీపాద నిర్భయంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.  ‘‘అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు’’ అంటూ వచ్చిన ఎదురు దాడికీ వెరవలేదు.  భయంకరమైన ట్రోలింగ్‌కూ  గురయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా స్థిరంగా నిలబడ్డారు.. అందువల్లే శ్రుతి మరాఠే లాంటి వాళ్లు సినిమా మెన్‌ క్వాయిష్‌ను తిప్పికొట్టగలిగారు.

ఫీల్డ్‌లో లేకుండా చేస్తారు
‘కాస్టింగ్‌ ఏజెంట్‌ నుంచి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో దాకా.. అందరితో (లేదా కొందరితో) కాంప్రమైజ్‌ (ఇది సినిమా భాషే) అయితేనే చాన్స్‌. నో అని చెప్పినా.. కంప్లయింట్‌ చేసినా.. క్యారెక్టర్‌ అసాసినేషన్‌ జరిగి.. ఫీల్డ్‌లో లేకుండా చేస్తారు’’ అని చెప్తారు బాలీవుడ్‌కు చెందిన ఓ వర్ధమాన నటి.  ‘‘నాకూ ఇంచుమించు ఇలాంటి ఎక్స్‌పీరియన్సే ఎదురైంది. చాన్స్‌ ఇస్తానని, డిస్కషన్స్‌కి పిలిచి.. ఫేవర్‌ అడిగాడు.. తనతో టైమ్‌ స్పెండ్‌ చేయమని. నో అన్నాను. ‘నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరైనా నువ్‌ కాంప్రమైజ్‌ కావాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేవు. నీకు సినిమాలు లేకుండా చేయగలను’ అంటూ శపించాడు. అయినా నేనేం భయపడలేదు’’ అని చెప్పారు  ప్రముఖ మరాఠీ నటీమణి, ‘ఫైర్‌బ్రాండ్‌’ హీరోయిన్‌ ఉషా జాధవ్‌.

 తనూ వెడ్స్‌ మను, నిల్‌ బట్టి సన్నాట, అనార్కలీ ఆఫ్‌ ఆరా ఫేమ్‌.. స్వర భాస్కర్‌ తెలుసు కదా! అంత టాలెంట్‌ ఉన్నా తగినన్ని అవకాశాలు ఎందుకు లేవు ఆమెకు?  నో ‘కాంప్రమైజ్‌’ అంటుంది కాబట్టి. ‘‘కుదరదు అని చెప్పినందుకు చాలా రోల్స్‌ మిస్‌ చేసుకున్నా. నేను ఫోన్‌ చేస్తే కొంతమంది డైరెక్టర్స్‌ ఫోన్‌ ఎందుకు లిఫ్ట్‌ చేయరో కూడా నాకు తెలుసు. ఎందుకంటే సబ్జెక్ట్‌ తప్ప వాళ్లను ఇంకేరకంగానూ ఎంటర్‌టైన్‌ చేయను కదా.. ఐ మేడ్‌ ఇట్‌ క్లియర్‌’’ అంటారు స్వర భాస్కర్‌. మోనా మాథ్యూస్‌ అనే బెల్లీ డ్యాన్సర్,  క్యారెక్టర్‌ నటి కూడా వేషాల కోసం కాంప్రమైజ్‌ కాలేదు.. కాదల్చుకోలేదు.

‘‘ఫలానా పాత్రకు నేను బాగుంటాను అనుకొని వచ్చిన పాత్రలను అంగీకరించడం తప్ప నాకై నేను అవకాశాల కోసం కాస్టింగ్‌ స్టూడియోస్‌కు వెళ్లట్లేదు. కొత్తలో వెళ్లేదాన్ని.. కాంప్రమైజ్‌ కావడానికి సిద్ధమేనా? అని అడిగారు. నో అని చెప్పి అప్పటి నుంచి కాస్టింగ్‌ స్టూడియోస్‌కు వెళ్లడం మానేశాను’’ అని చెప్పారు మోనా మాథ్యూస్‌. సో... అప్పుడే ఎందుకు చెప్పలేదు లాంటి సన్నాయి నొక్కుళ్లకు కాలం చెల్లింది.. కరెంట్‌ యాక్షన్స్‌కు షాకింగ్‌ రిజల్ట్స్‌ ఇవ్వడానికి మహిళలు సిద్ధమయ్యారనడానికి శ్రుతి, ఉషాలాంటి వాళ్లే ఉదాహరణలు. మీ టూ  ‘నెవర్‌’గా స్థిరపడేందుకు ఇదో శుభసూచకం. 

సరస్వతి రమ

తెలుగులో కూడా నో కాంప్రమైజ్‌ అని ముక్కు పగలగొట్టిన నటీమణులు, మహిళా టెక్నీషియన్లు ఉన్నా రు. ఫిదా ఫేమ్‌ గాయత్రీ గుప్తా, పాటల రచయిత్రి శ్రేష్ట అలాంటి ధీరవనితలే. ‘‘ఈ ఫీల్డ్‌కి వచ్చినప్పుడే అనుకున్నా... ప్రతిభకే తప్ప ఇంకే చాన్స్‌కీ చోటివ్వొద్దని. అద్దంలో నన్ను నేను చూసుకుంటే ప్రౌడ్‌ ఫీలవ్వాలి. ఆత్మగౌరవాన్ని మించింది లేదు. నా యాక్టింగ్‌ స్కిల్‌ నా పర్సనాలిటీకొక క్రౌన్‌ కావాలి తప్ప నా పర్సనాలిటీని తగ్గించకూడదు కదా! అయితే నాలాంటి వాళ్లు ఇలా ముక్కుసూటిగా మాట్లాడ్డం వల్ల ‘అమ్మో వీళ్లకు చాన్స్‌లు ఇస్తే కంప్లయింట్లు చేస్తారు ఎందుకొచ్చిన గోల’ అంటూ అవకాశాలే ఇవ్వరు. కాని ఇండస్ట్రీలో అందరూ పాజిటివ్‌గా ఆలోచిస్తే పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. ఇంతకుముందు జరిగిన పొరపాట్లు ఇక నుంచి జరగనివ్వకుండా... స్త్రీ,పురుషులు ఒకరిపట్ల ఒకరు గౌరవంతో.. టాలెంట్‌ను గుర్తించి, రెస్పెక్ట్‌ ఇచ్చేలా మారితే బాగుంటుంది. వస్తుందని ఆశిద్దాం..’’  అంటారు గాయత్రీ గుప్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement