
న్యూయార్క్ : రోజూ రాత్రి కనీసం ఏడుగంటల నిద్ర లేకుంటే కుంగుబాటు, యాంగ్జైటీ ముప్పు 80 శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. రోజుకు ఏడు గంటల నిద్ర అవసరమని దీనిలో కనీసం గంట పాటు నిద్ర కరవైనా నీరసం, నిస్సత్తువ, అలసట ఆవహించే ప్రమాదం 60 నుంచి 80 శాతం వరకూ ఉంటుందని అథ్యయనం వెల్లడించింది. మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని, వారి హార్మోన్ల కారణంగా కుంగుబాటు ముప్పు అధికమని పేర్కొంది. ఏటా 25 శాతం మంది నిద్రలేమితో బాధపడుతుండగా, ఏడు శాతం మంది కుంగుబాటు బారినపడుతున్నారు. రోజుకు పెద్దలు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రించాలని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సూచించింది.
కుంగుబాటు రుగ్మతకు చికిత్స అందించే సమయంలో వైద్యులకు తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని అథ్యయనం చేపట్టిన జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 20,851 మందిని టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు అడగడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. అథ్యయనంలో భాగంగా వారి నిద్ర అలవాట్లను, ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అథ్యయన వివరాలను న్యూరాలజీ, సైకియాట్రి, బ్రైన్ రీసెర్చి జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.