ఫ్యూచర్‌ ప్లాన్‌ | Malik Family Planned For New House | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ ప్లాన్‌

Published Mon, Jun 11 2018 1:03 AM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM

Malik Family Planned For New House - Sakshi

‘‘ఈ గది 10్ఠ 8 ఉండాలి’’ అంది శ్రీమతి మాలిక్‌ వాళ్ల ముందరి టేబుల్‌ మీదున్న ఇంటి ప్లానును చూపిస్తూ. ఆమె అలా సూచించడం అది మూడోసారి. దానిని ఆమె భర్తగాని, ఇంటి డిజైన్‌ తయారుచేసే వ్యక్తిగాని గుర్తించినట్లు లేదు. మాలిక్‌ దంపతులు ఢిల్లీలో సొంతిల్లు కట్టుకోబోతున్నారు. ఇల్లు కట్టడం పూర్తయితే, తన భర్త వేరే చోటికి బదిలీ అయినా తాను మాత్రం సొంత ఇంట్లోనే ఉండాలని శ్రీమతి మాలిక్‌ మనస్సులో నిశ్చయించుకొంది. భర్త ఉద్యోగంలో బదిలీ మీద తిరిగి తిరిగి ఆమె అలసిపోయింది. ఇప్పుడు పిల్లలు పెరిగి వస్తున్నారు. వాళ్లను ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారుస్తూ పోవడం ఇంక మంచిది కాదు. ఆమె పిల్లలతో ఢిల్లీలోనే స్థిరపడుతుంది. వాళ్లత్త ఆమెకు తోడు ఉంటుంది. మాలిక్‌కు కూడా ఇందులో అభ్యంతరం లేదు.

‘‘ఈ గది 10  8 అయ్యుండాలి’’ ఆమె మళ్లీ అంది. ఆమె భర్త పక్క గదిలో ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతున్నాడు. ‘‘కాని ఇది స్టోర్‌’’ వాస్తు శిల్పి ఆమెకు వివరించాడు. ‘‘అవును, అయితే దానిని మా అత్త ఉన్నన్నాళ్లు ఆమెకిచ్చి, ఆ తర్వాత స్టోర్‌రూమ్‌గా వాడుకోవచ్చనుకున్నాను’’. వాస్తు శిల్పికి అర్థమైనట్లు లేదు. శ్రీమతి మాలిక్‌ మాటలు విని అతను అయోమయంగా చూశాడు. ‘‘నా ఉద్దేశం మా అత్త ఆ గదిని వాడుకుంటుంది... మీకు తెలుసుగదా ఆమె ముసలావిడ... ఎక్కువకాలం ఉండదు. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’’. మాలిక్‌ వచ్చి వాళ్లతో చేరాడు. అతను ఫోన్‌లో మాట్లాడుతూనే తన భార్య సూచనను గురించి కూడా ఆలోచించినట్లున్నాడు. అతను కూడా స్టోర్‌ కొంచెం పెద్దదిగానే ఉండాలన్న అభిప్రాయంలో ఉన్నాడు. స్టోర్‌ రూమ్‌ ఎప్పుడూ పెద్దదిగా ఉంటే పెట్టెల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలవుతుంది.

వంటగది పక్కగదిని 10 ్ఠ 8 కొలతల్లో కట్టాలని నిర్ణయించబడింది. మండువా కొంత ఇరుగ్గా ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు. మిగతా పనంతా పూర్తయింది. ప్లాను ఆమోదం కోసం కార్పొరేషన్‌కు పంపించారు. శ్రీమతి మాలిక్‌ ఇంటి నిర్మాణం మీద శ్రద్ధగా పనిచేసింది. రోజంతా గొడుగు వేసుకొని నిలబడి పని చేయించింది. అవసరమైనప్పుడు మేస్త్రీలకు చేతి సహాయం కూడా చేసింది. ఇల్లు కట్టినన్ని రోజులూ అక్కడికి మొట్టమొదట వచ్చేది ఆమే, చిట్టచివర వెళ్లేది ఆమే. తొందరగానే ఇల్లు పూర్తయింది. ఇంటికి కొత్త ఫర్నిచర్‌ తేవాలని పట్టుబట్టింది. పాత ఫర్నిచర్‌లో ఒక ముక్కను కూడా కొత్తింట్లోకి తీసుకు రాకూడదనుకొంది. కొత్తింట్లోకి ఎప్పుడు మారాలో ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇంతలో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొందని తెలిసింది. శ్రీమతి మాలిక్‌కు చాలా కోపం వచ్చింది. ఇంటి కట్టడాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడే ఇంటికి సంబంధించి అనేక పథకాలను రూపొందించింది. అన్ని మరిచిపోవాల్సి వచ్చింది.

అప్పుడే వాళ్లకు ఢిల్లీ నుంచి బదిలీ అయ్యింది. శ్రీమతి మాలిక్‌ చాలా సంతోషించింది. ఈ యింట్లో ఉండలేక పోయినందుకు బాధపడనక్కరలేదు. ప్రభుత్వమే వాళ్ల యింటిని అద్దెకు తీసుకోవడంతో ఒక రకంగా వాళ్లు అదృష్టవంతులే. ప్రైవేటు వ్యక్తులతో తలనొప్పి. పైగా బాడుగ సక్రమంగా ఇవ్వరు. ప్రభుత్వం నెలనెలా బాడుగను వాళ్ల బ్యాంక్‌ అకౌంటుకు జమ చేస్తుంది. ఒక చోటి నుండి మరొక చోటికి బదిలీ అవుతూ ఢిల్లీకి పోస్టింగ్‌ రావడానికి మాత్రం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె అత్త చనిపోయింది. వాళ్ల అమ్మాయికి పెళ్లయిపోయింది. వాళ్ల అబ్బాయి మాత్రమే పెళ్లికాకుండా మిగిలి ఉన్నాడు. మాలిక్‌ రిటైర్‌ అయ్యేలోపల ఆ పనికూడా చేసేయ్యొచ్చనుకున్నారు.

వాళ్లబ్బాయికి పెళ్లయింది, మాలిక్‌ రిటైర్‌ అయ్యాడు. ప్రభుత్వం మాత్రం ఇంటిని ఖాళీ చెయ్యలేదు. మాలిక్, అతని భార్య కొడుకు కోడలుతో కలిసి బాడుగ ఇంట్లో ఉన్నారు.  మాలిక్‌ ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడు. తాము కట్టించుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా కాపురం చెయ్యకుండానే మాలిక్‌ మరణించాడు. మూడు నెలల్లో ఇల్లు ఖాళీ అయ్యింది. శ్రీమతి మాలిక్‌ కన్నా ఆమె కోడలు సొంతింట్లోకి వెళ్లడానికి ఉత్సాహపడుతున్నది. ఇల్లు స్వాధీనం కాగానే, ఇంటికి రంగులు వేయించి, ఇంట్లోకి మారడం ప్రారంభించింది. ఫర్నిచర్‌ డీలర్‌ని పిలిచి అతని దగ్గర ఉన్న ప్రతి వస్తువూ పంపమని చెప్పింది. సోమవారం ఉదయం ఇంట్లోకి మారవలసి ఉండింది. మంచిరోజు గనుక ఆరోజే ఇంట్లోకి మారితే బాగుండునని శ్రీమతి మాలిక్‌ ఆశ. మంగళవారం అమంగళం. ఆరోజు ఇల్లు మారాలని అనుకోనుకూడా అనుకోరాదు.


అమ్మ మనసు తెలిసి, కొడుకు వాన కురుస్తున్నా ఇల్లు మారాలని నిర్ణయించుకున్నాడు. సొంతకారుతో బాటు ఒక టాక్సీని రప్పించి, ఇంట్లోకి మారినట్లు మారారు. లగేజి ఇంకా మార్చవలసి ఉంది.వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కార్లో వెనక సీట్లో కూర్చున్న శ్రీమతి మాలిక్‌ స్మృతుల్లోకి వెళ్లిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు తనెంత శ్రమించింది? భోజనం తప్పిపోయిన రోజులున్నాయి. ఇంటిపని చూస్తూ మండుటెండలో మాడుతూ నిల్చుంది! వానలో ముద్దయిన రోజులున్నాయి. వాస్తు శిల్పి ఇల్లంతా కట్టడం పూర్తయితే ఎలా ఉంటుందో రంగుల చిత్రంగా వేసి చూపించాడు. అందులో ఒక అమ్మాయి మార్బుల్‌ స్తంభానికి ఆనుకొని వీపు చూపిస్తూ వరండాలో నిలబడినట్లుంది. ఎంత అందం! ఆత్మ తృప్తికి సంకేతం. మెరూన్‌ చీర ధరించింది. శిల్పి తననే చెక్కినట్లు శ్రీమతి మాలిక్‌ భావించింది. అయితే ఆమె మెరూన్‌ చీరలెప్పుడూ కట్టలేదు. స్కెచ్‌లోని బొమ్మ ఆమెలాగే పొడవుగా ఉంది. ఆ స్కెచ్‌ను తన కోడలికి చూపించాలనుకొంది.

కోడలు ముందు సీట్లో తన భర్త పక్కన కూర్చొని ఉంది. కారుకున్న రియర్‌వ్యూ గ్లాసును తిప్పుకొని పెదవులకు తిరిగి రంగు అద్దుకుంది. సొంత ఇంటికి వెళ్తూ పెదవులకు రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ కాలపు ఆడపిల్లల వాలకమే ఇంత. ఉన్నట్టుండి వాస్తు శిల్పి దిద్దిన బొమ్మ తన కోడలిది కావచ్చని అనిపించింది ఆమెకు. అదెలా సాధ్యం? ఇంటిప్లాన్‌ తయారు చేసేటప్పుడు కోడలు రంగంలోనే లేదు. అయితే ఆమె బొమ్మలో లాగే మెరూన్‌ చీర ధరించింది. అవును, ఇది మెరూన్‌ కలరే. శ్రీమతి మాలిక్‌కు మెరూన్‌ కలర్‌ ఎప్పుడూ ఇష్టం లేదు. వాళ్లు ఇల్లు చేరుకున్నారు. కొడుకు కారును నేరుగా పోర్టికోలోకి పోనిచ్చాడు. కోడలు కారులోంచి ఎగిరి దూకింది. వరండాలో మార్బుల్‌ స్తంభం దగ్గర నిలబడి ఆనుకొంది. శిల్పి స్కెచ్‌లో వేసినట్లే నిలబడింది. శ్రీమతి మాలిక్‌కు గుండెల్లో కలుక్కుమంది. శిల్పి ఈ అమ్మాయినే అనుకరించాడేమో! 

టాక్సీలోని లగేజి అంతా ఇంట్లోకి చేరింది. బాడుగ తీసుకొని టాక్సీ డ్రైవర్‌ వెళ్లిపోయాడు. శ్రీమతి మాలిక్‌ ఇంకా కారు వెనక సీట్లో కూర్చునే ఉంది. ఆమెకు తాను కిందికి దిగిపోతున్న అనుభూతి కలుగుతోంది. కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్లారు. ఒకటొకటిగా లైట్లు వేశారు. అన్ని గదులూ వెలుతురుతో నిండాయి. ఉద్వేగంలో శ్రీమతి మాలిక్‌కు తలుపు తెరవాలని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. హఠాత్తుగా కొడుక్కి తల్లి గుర్తొచ్చింది. పరుగెత్తికెళ్లి కారు తలుపులు తెరిచాడు. ‘నేను ఏమీ తినను, ఆకలిగా లేదు’’ శ్రీమతి మాలిక్‌ అంది. ‘‘నేను నిద్రపోతాను’’.

‘‘అయితే మీ రూములో పడుకోండి’’ కోడలు 10 ్ఠ 8 కొలతల గదిని చూపిస్తూ అంది. కొడుకు ఆమెను ఆ గదిలోకి పట్టుకుపోయి దించాడు. ఆమెకు బాగా మత్తుగా ఉంది.‘మా అత్త ఆ గదిని వాడుకుంటుంది. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’. పడక మీద పడుకొన్న శ్రీమతి మాలిక్‌ చెవుల్లో ఈ మాటలు మార్మోగాయి. ఆమె మాటిమాటికి తల తిప్పుతూంది. ఆమె కేమయ్యింది? భర్త ఎప్పుడో పోయాడు. ఆమె అతణ్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆమె కోడలు ‘‘ఇల్లు బాగానే ప్లాన్‌ చేశారు. స్టోర్‌ రూమ్‌ ఒక్కటి లేదు. ఒక పెద్ద స్టోర్‌ రూమ్‌ కావాలి’’ అనడం వినిపించింది. శ్రీమతి మాలిక్‌ ఆ మాటలు వింది. ఆమెకు లోతులకు లోలోతులకు, అగాధమైన బావిలోకి దిగిపోతున్నట్లు అనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement